శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Mar 02, 2020 , 00:46:28

సొంతింటి కల సాకారం..

సొంతింటి కల సాకారం..

రఘునాథపాలెం: ఖమ్మం నియోజకవర్గంలో ఇళ్లులేని నిరుపేదల సొంతింటి కల సాకారానికి మరో అడుగు పడింది. తుది విడుతగా ఆదివారం వైఎస్‌ఆర్‌ నగర్‌లో 240ఇళ్లు, రఘునాథపాలెంలో 60‘డబుల్‌' ఇండ్లకు గృహప్రవేశాల కార్యక్రమం ఆదివారం పండుగ వాతావరణంలో జరిగింది. మొత్తం 300ఇండ్లకు గానూ 300మంది లబ్ధిదారులతో ఖమ్మం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గృహప్రవేశాలు చేయించారు. ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో ఉండి కిరాయిలు కట్టడానికి ఇబ్బందులు పడిన నిరుపేదలు సొంతింట్లోకి ప్రవేశమన్న ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. జీవితంలో సొంత ఇంటిని కట్టుకోగలమా..? అనుకున్న తమమదిలోని ఆలోచనలకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం నయా పైసా ఖర్చు లేకుండా తాము కన్న కలలకు పరిష్కారం చూపిందని మురిసిపోయారు. నిరుపేదలు సొంతింట్లోకి వచ్చిన శుభ సందర్భంగా లబ్ధిదారుల వారి ఆనందాన్ని ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.

అభిమానం.. ఆరాధన అయిన వేళ...‘డబుల్‌' ఇళ్లకు కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు...

రఘునాథపాలెం: అభిమానం కట్టలు తెంచుకున్నది... ఆరాధనగా మారింది. ‘డబుల్‌' బెడ్‌రూమ్‌ ఇండ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో లబ్ధిదారులు సీఎం కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. తమకు వచ్చిన ‘డబుల్‌' ఇండ్లకు మంత్రి కేటీఆర్‌, సీఎం కేసీఆర్‌ ఫొటోలు పెట్టుకున్నారు. డబుల్‌ బెడ్‌రూం పథకాన్ని ప్రవేశపెట్టి మా సొంతింటి కలను నిజం చేసిన కేసీఆర్‌ మా దేవుడు అంటున్నారు. మండలకేంద్రం రఘునాథపాలెంలో ఆదివారం జరిగిన డబుల్‌బెడ్‌రూం పథకం ప్రారంభోత్సవంలో భాగంగా కేటీఆర్‌ డిగ్నిటీ హోమ్స్‌లోని ప్రతి ఇంటికీ కేసీఆర్‌, కేటీఆర్‌ ఫొటోలు దర్శనమిచ్చాయి. లబ్ధిదారులను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా కనిపించే దైవాలు వారు అంటూ చెప్పుకొచ్చారు. తాము ఉన్నంతకాలం తమ ఇండ్లపై వారి ఫొటోలు తప్పక ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌, మంత్ర కేటీఆర్‌ చిత్రాలతో పాటు రాష్ట్ర రవాణాశాఖ మాత్యులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, రఘునాథపాలెం టీఆర్‌ఎస్‌ నాయకులు గుడిపూడి రామారావు ఫొటోలు సైతం ప్రతి ఇంటి వద్ద కనిపించాయి.


సొంతింటి కల నెరవేరింది..

మాకు ఇళ్లు లేదు. 15ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా మాకు కనీసం కాలనీలు కూడా మంజూరు చేయలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మాకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు రావడం ఆనందంగా ఉంది. అధికారులు నిజాయితీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. అందులో నా పేరు వచ్చి, ఈ రోజు గృహప్రవేశాలు మంత్రి గారు..దెగ్గరుండి చేయించడం సంతోషంగా ఉంది.

- లబ్ధిదారులు ఎస్‌. సుమలత, ఉపేందర్‌


కలలో కూడా ఊహించలేదు..

మాకు ఓ ఇళ్లు వస్తదని, సొంతింట్లో ఉంటామని కళలో కూడా ఉహించలేదు. కూలి పనులు చేసుకునే మాకు డబుల్‌బెడ్‌రూం ఇంటిలో నివసిస్తామని అనుకోలేదు. కూలి పనులు చేస్తే వచ్చిన కూసిన్ని డబ్బులతో ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు పడినం. ఇప్పుడు అన్నిహంగులతో కూడిన ఇళ్లు మా సొంతమైనందుకు సంతోషంగా ఉంది. 

-  బోయిన ప్రమీల, లబ్ధిదారురాలు


logo