మంగళవారం 07 జూలై 2020
Khammam - Feb 28, 2020 , 23:25:18

నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక

నేడు డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్ల ఎన్నిక

ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 28: సహకార ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియనుంది. జిల్లా కేంద్ర సహాకర బ్యాంక్‌, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు నేడు జరగనున్నాయి. రెండు పాలకమండల ఆఫీస్‌ బేరర్ల ఎన్నికలు సైతం జిల్లా కేంద్ర సహాకార బ్యాంక్‌ సమావేశ మందరంలో వేర్వేరుగా నిర్వహించనున్నారు. పాలకమండలి చైర్మన్ల, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు 2013 సంవత్సరంలో జరిగాయి. ఏడు ఏళ్ల తరువాత నూతన పాలకమండలి ఏర్పాటు కానుంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు మహబూబాబాద్‌, ములుగు జిల్లాల పరిధిలో ఉన్న రెండు మండలాలు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ పరిధిలో ఉన్నాయి. దాదాపు 1.66లక్షల మంది రైతులు, 50 బ్రాంచీలు, 101 సహకార సంఘాలు కలిగిన ఖమ్మం డీసీసీబీకి వందేళ్ల చరిత్ర ఉంది. ఖమ్మం డీసీసీబీ ప్రస్తుతం ఏటా రూ 2,500 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాలకమండలికి తొలిసారిగా టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతంగానే కైవాసం చేసుకోవడం విశేషం. డీసీసీబీతో పాటు డీసీఎంఎస్‌ పాలకమండలి సైతం ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ ఖాతాలోకి వెళ్లింది. ఇతర పార్టీలతో సంబంధం లేకుండా సొంతంగానే రెండు సంఘాలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల ఎన్నికలు లాంచనం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల అధికారులు మైఖేల్‌బోస్‌, విజయకుమారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికైన పాలకమండలి సభ్యులు తప్ప ఇతరులెవరికీ ఓటింగ్‌ కేంద్రానికి అనుమతి లేదని వారు తెలిపారు. ఇందు కోసం పోలీస్‌ అధికారులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 


చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు ఇలా..

డీసీసీబీ, డీసీఎంఎస్‌ల చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలకు ఆయా సంఘాల ఎన్నికల అధికారులు ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఫిబ్రవరి 25న డీసీసీబీకి జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లకు ఇప్పటికే ఓటింగ్‌కు  ఆహ్వానం పంపారు. ఏక్లాస్‌కు చెందిన 12మంది, బీ క్లాస్‌కు చెందిన మరో నలుగురు డైరెక్టర్లు నేడు ఎన్నికల్లో పాల్గోనున్నారు. ఉదయం 8-30 నిమిషాల వరకు డీసీసీబీ సమావేశ మందిరానికి సదరు డైరెక్టర్లు చేరుకోవాలి. ఎన్నికల అధికారులు డైరెక్టర్ల హాజరు తీసుకుంటారు. 9 గంటలకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పోటీలో నిలబడే వారికి అధికారులు నామినేషన్‌ పత్రాలు అందజేస్తారు. పోటీ చేసే ఇద్దరు అభ్యర్థులకు మరో ఇద్దరు చొప్పున ప్రతిపాధికుడు, సెకండర్‌లు సంతకం చేసి, పూర్తి వివరాలు పొందుపరచి అనంతరం ఎన్నికల అధికారికి సమర్పించాలి. డీసీఎంఎస్‌కు సైతం ఇదే విధానం కొనసాగుతుంది. అయితే అక్కడ ఎనిమిది మంది డైరెక్టర్లు మాత్రమే ఉంటారు. నామినేషన్ల స్వీకరణ తరువాత మధ్యాహ్నం 1గంట నుంచి నామ పత్రాలను పరిశీలన చేస్తారు. పోటీ ఉన్న పక్షంలో సీక్రెట్‌ పద్దతిలో బ్యాలెట్‌ పద్దతిన ఎన్నికలు నిర్వహించనున్నారు. సింగిల్‌ సెట్‌ నామినేషన్‌లు దాఖలు అయినైట్లెతే మధ్యాహ్నం 3గంటల వరకు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ల పేర్లను ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు. 


డీసీసీబీ, డీసీఎంఎస్‌లో సరికొత్త చరిత్ర

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం సహకార ఎన్నికల్లో అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి. ఖమ్మం డీసీసీబీ ఆవిర్బావం నుంచి గత పాలకవర్గం వరకు ఎప్పుడూ సొసైటీ చైర్మన్లకు ఆయా పార్టీల సానుభూతిపరులు ఎన్నికయ్యారు. దీంతో పాలకమండలి సభ్యుల ఎన్నికల నుంచి మొదలు కొని చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికల వరకు బ్యాలెట్‌ పద్దతి జరగడం ఆనవాయితీ. అయితే స్వరాష్ట సాధన తరువాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈ ఎన్నికలు తొలిసారిగా ఎదుర్కున్నది. 101 సొసైటీల డైరెక్టర్ల ఎంపిక నుంచి మొదలు కొని పాలకమండలి సభ్యుల వరకు ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలను తూచా తప్పకుండా క్షేత్రాస్థాయిలో అమలు జరిగాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఎప్పటికప్పుడు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్లతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శితో తాతా మధుతో తరచూ సమావేశాలు నిర్వహించారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా ఉమ్మడి జిల్లాలో దాదాపు ఏకపక్ష ఫలితాలు వచ్చాయి. అందుకు అనుగూణంగానే పాలకమండలి సభ్యుల ఎంపిక జరిగింది. డీసీసీబీ, డీసీఎంఎస్‌లకు పాలకమండలిలలో కేవలం ఒకేపార్టీ అభ్యర్థులు ఉండటం ఇదే తొలిసారి కావడం మరో రికార్డు.


logo