ఆదివారం 29 మార్చి 2020
Khammam - Feb 28, 2020 , 00:06:51

యువనేత పర్యటనకు సర్వం సిద్ధం..

యువనేత పర్యటనకు సర్వం సిద్ధం..

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు యువనాయకులు, రాష్ట్ర మున్సిపల్‌ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మార్చి 1వ తేదీన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వెల్లడించారు. గురువారం సాయంత్రం ఖమ్మంలోని వీడియోస్‌ కాలనీలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఖమ్మం వస్తారని, మధ్యాహ్నం 1 గంట వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని, మాజీ పార్లమెంట్‌ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనయుడి వివాహ రిసెఫ్షన్‌కు హాజరై అక్కడ భోజనం చేసిన అనంతరం 3 గంటలకు హెలికాఫ్టర్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందుకు బయలుదేరతారన్నారు. అక్కడ జరిగే పట్టణ ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభకు హాజరవుతారన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌ రాష్ట్రంలోని పలు పట్టణాలలో పర్యటిస్తూ పట్టణ ప్రణాళిక కార్యక్రమాన్ని వేగవంతం చేస్తున్నారని, ఆయన స్ఫూర్తితో  ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు పరుగులు పెట్టాలన్నారు. 

ఖమ్మాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం..

పట్టణ ప్రగతి స్ఫూర్తికంటే ముందే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పువ్వాడ అన్నారు. పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి పట్టణానికి వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ ఉండాలని నిర్ణయించారని, దీనికంటే ముందే ఖమ్మంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో నిర్మించామన్నారు. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఈ మార్కెట్‌ను ప్రారంభించబోతున్నామని, ఆ స్థలంలోనే ప్రజలు, అధికారులు, కార్పొరేటర్లతో కేటీఆర్‌ ఇష్టాగోష్టి ఉంటుందన్నారు. అదే విధంగా పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి పట్టణానికి క్రీడా ప్రాంగణాలు, పబ్లిక్‌ జిమ్‌లుండాలని నిర్ణయించారని, దీనికంటే ముందే ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో కోటి రూపాయల వ్యయంతో బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌స్టేడియాన్ని నిర్మించుకున్నామని, దీనిని మార్చి 1వ తేదీన రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఖమ్మంలోని అన్ని పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేశామని, మిగిలిన వాటిలో కూడా త్వరలోనే జిమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం నగరానికి మణిహారంగా ఉన్న లకారం ట్యాంక్‌ బండ్‌కు అనుసంధానంగా దాదాపు రూ. 2 కోట్లతో మినీ ట్యాంక్‌ బండ్‌ నిర్మాణం చేస్తున్నామని, దాని చుట్టు వాకింగ్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. అనాథలు, అభాగ్యుల కోసం నైట్‌ షెల్టర్‌ను నిర్మించామన్నారు. ఖమ్మం నగరంలోని నిరుపేదలకు, రఘునాథపాలెం గ్రామంలోని పేదల కోసం 300ల డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను నిర్మించామని, ఈ కాలనీకి కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశామన్నారు. దీనితో పాటు ఎన్‌పీడీవో కార్యాలయం, జూనియర్‌ కళాశాల నిర్మాణం పూర్తి చేశామన్నారు. పల్లెప్రగతికి ఉన్న మద్దతు మాదిరిగానే పట్టణ ప్రగతికి కూడా ప్రజల మద్దతు ఉందని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో మరమ్మతులకు గురైన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్త వాటిని నిర్మించడం, లూజువైర్లను సరిచేయడం, ఐరన్‌ స్తంభాలను తొలగించడం, ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పర్చడం, కాలువలను శుభ్రం చేయడం, చెత్తచెదారాన్ని ఎత్తివేయడం చేస్తున్నామని, దీని కోసం వంద వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. 

రూ.3 కోట్లతో శ్మశానవాటిక నిర్మాణం..

ఖమ్మం నగరం రోజురోజుకు విస్తరిస్తుందని, దీనిని దృష్టిలో  ఉంచుకుని బల్లెపల్లి వద్ద నాలుగున్నర ఎకరాల స్థలంలో మూడు కోట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో ఆధునీకమైన శ్మశానవాటికను నిర్మిస్తున్నామన్నారు. ఖమ్మం నగరంలో ఏడు ప్రదేశాలలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఉన్నాయని, మరో 15 ప్రదేశాలలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మిస్తున్నామన్నారు. వీధి వ్యాపారుల కోసం బస్టాండ్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వస్థలాన్ని కేటాయించామని, ఖమ్మంలో 13 రోడ్లను మోడల్‌ రోడ్లుగా విస్తరించి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. 

ప్రజల అభిష్టం మేరకే రోడ్ల విస్తరణ... 

ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా అజయ్‌కుమార్‌ పనిచేయడని ఖమ్మంలోనే పుట్టి.. ఇక్కడే చదివి ఈ గడ్డపైనే పెరిగానని, తనకు వచ్చిన అవకాశం ద్వారా ఖమ్మం రుణాన్ని తీర్చుకునే విధంగా పనిచేస్తాను తప్ప ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోనని మంత్రి పువ్వాడ అన్నారు. ముస్తఫానగర్‌ ప్రజలు స్వయంగా వారి ఇష్టం ప్రకారమే రోడ్ల విస్తరణ చేశారని, దాని ద్వారా ఆ రోడ్లను నాలుగులైన్ల రోడ్డుగా చేయడం జరిగిందని, దాని ద్వారా వారి ఆస్తుల విలువ కూడా పెరిగిందని మంత్రి అన్నారు. అదేవిధంగా ఖమ్మంలో ఏ రోడ్డు అయినా ప్రజలు కోరుకుంటేనే విస్తరణ చేస్తామన్నారు. ఇల్లెందు ప్రధాన రహదారిని కూడా నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించామన్నారు. త్వరలోనే శ్రీశ్రీ విగ్రహం నుంచి వీ వెంకటాయపాలెం వరకు నాలుగులైన్ల రోడ్డు విస్తరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఖమ్మంలో నిర్మిస్తున్న ఐటీహబ్‌, కొత్తబస్టాండ్‌ త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఖమ్మం ప్రజలు చెట్లను పెంచే బాధ్యత తీసుకోవాలన్నారు. 

మున్నేరుపైన చెక్‌డ్యాం మంజూరు...

ఖమ్మం నగరంలో ఉన్న మున్నేరు నది పైన ప్రకాశ్‌నగర్‌ బ్రిడ్జి వద్ద రూ. 10 కోట్లతో చెక్‌డ్యాం నిర్మిస్తున్నామని, దీనికి సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. ఇది పూర్తి అయితే అక్కడ నుంచి దానవాయిగూడెం పార్కు వరకు మున్నేరులో సంవత్సరం పోడువునా నీళ్లు ఉంటాయన్నారు. మున్నేరుకు ఇరువైపుల కరకట్టను నిర్మించి వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తామని, ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌తో మాట్లాడానన్నారు. ఖమ్మాన్ని సుందర నగరంగా తీర్చి దిద్దుతానని పువ్వాడ చెప్పారు. ఖమ్మం- సూర్యాపేట జాతీయ రహదారి నిర్మాణం వేగంగా జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, మేయర్‌ గుగులోత్‌ పాపాలాల్‌, ఖమ్మం మున్సిపల్‌ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఆర్‌జేసీ కృష్ణ, టీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు కమర్తపు మురళీ, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీప్రసాద్‌, కార్పొరేటర్లు నీరజ, ప్రశాంత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 


logo