బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Feb 25, 2020 , 23:15:15

పాటతోనే పయనం..

పాటతోనే పయనం..

(భద్రాచలం, నమస్తే తెలంగాణ)“పాటతోనే నా పయనం. మాది వరంగల్‌ జిల్లా. బీటెక్‌ చదువుకున్నా. ‘తాజ్‌మహల్‌' చిత్రంలోని ‘మంచుకొండల్లోన చంద్రమా..’ అనే పాట నేను రాసిన మొదటి పాట. ఇప్పటికే 3,400లకు పైగా పాటలు రాశాను. 820 చిత్రాల్లో నా పాటలు ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్‌, పవన్‌ కల్యాణ్‌లు తీస్తున్న కొత్త చిత్రాలకు పాటలు రాస్తున్నా. ఎన్నో అవార్డులు నా సొంతమయ్యాయి. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే చిన్న సినిమాకు ‘నీలీనీలీ ఆకాశం ఇద్దామనుకున్నా..’ అనే పాట రాశా. ఈ పాటను ఇప్పటికే 4 కోట్ల మంది విన్నారు. వీక్షించారు. నాటికీ, నేటికీ నాట్యంలో స్పీడ్‌ పెరిగి వేగానికి తగ్గ పాటలు వస్తున్నాయ్‌. గాయకుడిని అవుదామనుకొని రచయితను అయ్యాను.” అంటూ ప్రముఖ సినీ పాటల రచయిత చంద్రబోస్‌ పేర్కొన్నారు. మంగళవారం భద్రాచలం వచ్చిన ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 


నమస్తే: మీ బాల్యం గురించి?

చంద్రబోస్‌: మధునమ్మ, నర్సయ్యలు మా అమ్మనాన్న. మాది వరంగల్‌ జిల్లా చల్లగరిగె గ్రామం. 1972లో జన్మించాను. బీటెక్‌ పూర్తి చేశాను. మాది ప్రేమ వివాహం. భద్రాచలంలో 1999 మార్చి7న కొరియోగ్రాఫర్‌ సుచిత్రను వివాహం చేసుకున్నా.


నమస్తే: మీ మొట్టమొదటి పాట?

చంద్రబోస్‌: నా మొదటి పాట తాజ్‌మహల్‌ చిత్రంలోని ‘మంచుకొండల్లోన చంద్రమా’. ఇప్పటి వరకు 3,400లకు పైగా పాటలు రాశాను. 820కి పైగా సినిమాల్లో పాటలు వచ్చాయి. 


నమస్తే: మీకొచ్చిన పురస్కారాలు?

చంద్రబోస్‌: 2002లో ‘ఆది’ చిత్రంలో ‘నీ నవ్వుల తెల్లదనాన్ని..’ గీతానికి నంది అవార్డు వచ్చింది. 2004లో ‘నేనున్నాను’ చిత్రంలో ‘చీటికతో వెలుగే చెప్పెను..’ అనే గీతానికి నంది అవార్డు వచ్చింది. 2001లో ఆత్రేయ మనిస్విని పురస్కారం ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ చిత్రంలో ‘ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి..’ గీతానికి లభించింది. 2001లో భరతముని పురస్కారం కూడా ఇదే గీతానికి లభించింది. 2010లో భరత్‌ముని పురస్కారం ‘ఝుమ్మందినాథం’ చిత్రంలో ‘దేశమంటే మతం కాదోయ్‌..’ అనే గీతానికి లభించింది. 2009లో మాటీవీ, రేడియోమిర్చి, బిగ్‌ ఎఫ్‌ఎం, సౌత్‌ స్కోప్‌ పురస్కారాలు లభించాయి. 


మగధీర చిత్రంలో ‘పంచదార బొమ్మా..’ గీతానికి ఆత్రేయ స్మారక పురస్కారం లభించింది. రెండుసార్లు శ్రీశ్రీ స్మారక పురస్కారం, దాశరథి స్మారక పురస్కారం, ఆరుద్ర స్మారక పురస్కారం, న్యూయార్క్‌ తెలుగు సంస్థ పురస్కారం లభించాయి. ‘చంద్రబోస్‌ సినీ సాహిత్యం - ఒక పరిశీలన’ అనే అంశంపై తిరుపతి కళాశాల అధ్యాపకులు ముని కృష్ణారెడ్డి వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి లఘు సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి డాక్టరేట్‌ పొందారు. వికీపీడియా సర్వేలో భారతదేశంలోని గీత రచయితల్లో జాతీయ స్థానంలో 17వ స్థానాన్ని, తెలుగులో 1వ స్థానాన్ని పొందాను. అమెరికాలోని తెలుగు సంస్థ నాటాకు బ్రాండ్‌ అంబాసీడర్‌గా నాలుగేళ్లు వ్యవహరించానున ఆంధ్ర విశ్వ విద్యాలయం నాకు కళాప్రపూర్ణ డాక్టరేట్‌ను ప్రకటించింది. తాజాగా రంగస్థలం, సైరా చిత్రాలకు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు లభించాయి.


నమస్తే: తాజాగా మీరు రాసిన పాటలు?

చంద్రబోస్‌: నేను రాసిన ‘మౌనంగానే ఎదగమని, చీకటితో వెలుగే చెప్పెను, ఎవ్వరేమనుకున్నా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, పెదవే పలికిన, కనిపించిన మా అమ్మ, ఎంత చక్కాగా ఉన్నావే లచ్చిమి’ అనే పాటలు నాకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ‘నీలీ నీలీ ఆకాశం..’ పాటను ఇప్పటికే 4 కోట్ల మిలియన్ల మంది అభిమానులు వీక్షించారు. ఇటీవల చిరంజీవిగారి కుమార్తె అడిగిన పాటను ఏకవాక్యంలో రాశాను. చిరంజీవిగారు నాకు ఫోన్‌ చేసి అభినందించిన తీరు మరువలేనిది. గతంలో భక్తరామదాసు సినిమాలో ‘చాలు... చాలు.. చాలు..’ అనే పాట రాశాను. అవకాశం వస్తే త్వరలో భద్రాద్రి రామునిపై పాట రాస్తాను. 


నమస్తే: నాటి పాటలకు, నేటి పాటలకు వ్యత్యాసం ఏమిటి?

చంద్రబోస్‌: ప్రస్తుతం నాట్యంలో స్పీడ్‌ పెరిగింది. వేగానికి తగ్గ పాటలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడూ ఇప్పుడు మంచి పాటలు వస్తూనే ఉన్నాయి. 


నమస్తే: మీరు ఆనందించే విషయం ఏమిటి?

చంద్రబోస్‌: పాటల రచయితగా ఇప్పటికే నా పాత్రను నేను పోషించాను. చంద్రబోస్‌ పేరు మీదుగా భద్రాచలంలోనే అభిమాన సంఘం ఏర్పాటు కావడం అభిమాన సంఘం ఏర్పాటుకావడం సంతోషంగా ఉంది. తోటమల్ల సురేశ్‌బాబు, కుప్పాల నాగరాజు, స్పైసీ రెడ్డి తదితరులు తమ సొంత ఖర్చులతో చంద్రబోస్‌ అభిమాన సంఘం పేరుతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేను ఎంతగానో ఆనందిస్తున్నా.


logo