శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 24, 2020 , 23:31:26

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి..

అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి..

ఖమ్మం, నమస్తే తెలంగాణ :ఖమ్మం నగరం లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతిలో ప్రారంభిస్తారని  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత వెజ్‌, నాన్‌-వెజ్‌ మార్కెట్‌, పెవిలియన్‌ మైదానంలో బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియం, బైపాస్‌రోడ్‌లోని నైట్‌ షెల్టర్‌, వైఎస్‌ఆర్‌ నగర్‌లోని రెండు పడకల గృహసముదాయం, రఘునాథపాలెం ఎంపీడీవో నూతన కార్యాలయ భవ నం, రెండు పడకల గృహసముదాయం పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ. కర్ణన్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఎన్‌ఎస్‌పీ క్యాంప్‌లో నూత నంగా నిర్మించిన వెజ్‌- నాన్‌వెజ్‌ మార్కెట్‌కు సంబంధించిన విద్యుత్‌, నీటివసతి, ప్లాంటేషన్‌, పార్కింగ్‌ ఏరియా పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి నగర పాలక సంస్థ కమిషనర్‌ను  ఆదేశించారు. అదేవిధంగా మార్కెట్‌ ఆవరణలో పండ్ల వ్యాపారుల కోసం ప్రత్యేక షెడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. బాస్కెట్‌బాల్‌ ఇండోర్‌ స్టేడియంలో ఫ్లోరింగ్‌, లైటింగ్‌ పనులు, నైట్‌ షెల్టర్‌లో ఫ్లోరింగ్‌ పనులను సత్వరమే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. నగర మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ మద్దినేని వెంకటరమణ, పంచాయతీరాజ్‌ ఈఈ ప్రభాకర్‌, నగరపాలక సంస్థ డీఈ రంగారావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


రఘునాథపాలెం: ఖమ్మంలో మార్చి ఒకటిన అభివృద్ధి పనుల ప్రారంభో త్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పర్యటనకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల వేగం పెంచాలన్నారు. సోమవారం ఆయన ఖమ్మం నగరం 6వ డివిజన్‌ పరిధి వైఎస్‌ఆర్‌ నగర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 240డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను, మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మండల పరిషత్‌ కార్యాలయం నూతన భవన నిర్మాణ పనులు, ఆ పక్కనే కేజీబీవీ భవనం, రఘునాథపాలెం గ్రామ నిరుపేదలకు కేటాయించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నత్తనడకన సాగుతున్న మండల కేంద్రంలోని మండల పరిషత్‌ నూతన భవన నిర్మాణ పనులపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. బాధ్యుడైన పం చాయతీరాజ్‌ సీఈ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈకి సమాచారాన్ని అందించి నాలుగురోజుల పాటు ఇక్కడే ఉండి పనులు పూర్తి చేసేలా ఆదేశించాలని కలెక్టర్‌ను సూచించారు. 


రఘునాథపాలెం గ్రామానికి కేటాయించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల సముదాయానికి వచ్చే ప్రధాన ద్వారం వద్ద ‘కేటీఆర్‌ డిగ్నిటీ హోమ్స్‌' అని బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక కేటీఆర్‌ పర్యటన రోజు ఎలా ఉండాలి అనేదానిపై అధికారులకు సూచనలు చేశారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. మండల పరిషత్‌ నూతన భవన నిర్మాణం పెండింగ్‌ పనులు పూర్తి చేసే బాధ్యతను ఏఎంసీ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణకు మంత్రి అప్పగించారు. మంత్రి వెంట నగరపాలక కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, మేయర్‌ డాక్టర్‌ పాపాలాల్‌, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులు, ఎంపీడీవో శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ నాయకులు బచ్చు విజయ్‌ కుమార్‌  పాల్గొన్నారు. 


logo