సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Feb 22, 2020 , 00:53:40

హర హర మహాదేవ శంభో శంకర

హర హర మహాదేవ శంభో శంకర

ఓం..నమఃశివాయ... శంభో శంకర... హర హర మహాదేవ.. అంటూ భక్త కోటి తరించింది.. వాడవాడలా ఓంకార, ఢమరుక నాదాలు ప్రణవిల్లాయి.. శివనామస్మరణ నటరాజ ఢమరుక నాదమై నాట్యమాడింది.. ‘

  • భక్తి ప్రపత్తులతో మహాశివరాత్రి పర్వం...
  • భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు..
  • శివనామస్మరణతో మార్మోగిన తీర్థాల ప్రాంగణం
  • నీలాద్రికి పోటెత్తిన భక్తజనం
  • వైరా నదిలో పుణ్యస్నానమాచరించిన వేలాది మంది భక్తులు
  • కూసుమంచి గణపేశ్వరాలయంలో మహా అన్నదానం
  • కమనీయం... ఆదిదంపతుల కల్యాణం..
  • పలు ఆలయాల్లో పూజలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, తాతా మధు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ
  • పటిష్టబందోబస్తు నిర్వహించిన పోలీసులు

ఓం..నమఃశివాయ... శంభో శంకర... హర హర మహాదేవ.. అంటూ భక్త కోటి తరించింది.. వాడవాడలా ఓంకార, ఢమరుక నాదాలు ప్రణవిల్లాయి.. శివనామస్మరణ నటరాజ ఢమరుక నాదమై నాట్యమాడింది.. ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరి మంత్రం భక్తులకు ప్రాణనాదమై ముక్కంటి కృపకు పాత్రులను చేసింది.. జలం, పంచామృతాలు, మారేడు దళాలతో తమ ఆరాధ్య దైవం శివుడికి అభిషేకం చేసి భక్తులు పులకించిపోయారు.. జాతరలు, జాగరణలు, ఉపవాసాలు, అభిషేకాలు, శివలింగ పూజలు, విశేష అర్చనలతో నిటలాక్షుడిని ప్రసన్నం చేసుకున్నారు.. జిల్లాలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన శైవ క్షేత్రాలు, శివాలయాలు భక్త కోటితో కిటకిటలాడాయి.. శివ జాతరలు భక్తులతో పోటెత్తాయి. పవిత్ర స్నానాలు, స్వామి దర్శనం, మొక్కుబడులు, లింగోద్భవ పుణ్యకాలం, కమనీయమైన ఆది దంపతుల కల్యాణంతో వాడవాడలా శివభక్తి పులకించిపోయింది. మంత్రి పువ్వాడ అజయ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్‌, కందాల, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.. అనంతరం ఆలయాల పరిధిలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు.    - న్యూస్‌ నెట్‌వర్క్‌


శివనామ  ఆలయాలు మార్మోగాయి. ఖమ్మం జిల్లాలో  సందర్భంగా శుక్రవారం ముక్కంటికి భక్తులుప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి తరించారు.    కూసుమంచి, ఖమ్మం రూరల్‌, మధిర, వైరా, కారేపల్లి మండలాల్లో  ఉన్న శైవక్షేత్రాల్లో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.   తెలంగాణ నెట్‌వర్క్‌


కూసుమంచి: మహా శివుడికి ప్రీతిపాత్రమైన శివరాత్రి భక్త జన సందోహంతో కూసుమంచి కిటకిటలాడింది. ఖమ్మం జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులతో శుక్రవారం మహాశివరాత్రి వైభవంగా జరుపుకున్నారు. కాకతీయుల కాలం నాటి శివాలయంలో భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్న శివలింగాకారం చూడటానికి భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయానికి  తరలి వచ్చారు. వేలాదిగా భక్తులు తరలిరావటంతో సర్పంచ్‌ చెన్నా మోహన్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. ఆలయ పునఃనిర్మాణ కర్త సాధు వీరప్రతాపరెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో పూజలు చేశారు. సెంటర్‌ నుంచి ఆలయం వరకు భక్తుల సందోహం కనిపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 


మంత్రి పువ్వాడ, ఎమ్మెల్యే కందాళ పూజలు... 

    మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ శివలింగాన్ని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పువ్వాడకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పువ్వాడతో పాటు రాష్ట్ర టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి  తాతా మధు, జడ్పీటీసీ ఇంటూరి బేబీ శేఖర్‌, ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి శివలింగాకారాన్ని దర్శించుకున్నారు. పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా పూజలు నిర్వహించిన తరువాత అభిషేకాలను సరస్వతీ దేవి గుడిని దర్శించుకున్నారు. అన్నదాన కార్యక్రమంను పరిశీలించి భక్తులకు అన్నదానం చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మహిళా కోర్టు న్యాయమూర్తి మధుసూదన్‌, డీసీపీ సాయిబాబా, రూరల్‌ ఏసీపీ వెంకటరెడ్డి, గాయత్రీ రవి చంద్ర, రాయల నాగేశ్వరరావు, కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ప్రగతి గోపాల్‌,  డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళీ, న్యాయవాది నిరంజన్‌రెడ్డి, ఇంటూరి శేఖర్‌రావు, మల్లీడి వెంకటేశ్వరరావు, రామసహాయం వెంకటరెడ్డి, బారి వీరభద్రం, బారి శ్రీనివాస్‌ యాదవ్‌ సీఐ మురళి, శివుడిని దర్శించుకున్నారు.


మహా అన్నదానం... 

    శివ రాత్రికి వచ్చిన భక్తులకు సుమారు 25 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ పునఃనిర్మాణ కర్త సాధు వీరప్రతాపరెడ్డి ఎంపీపీ బాణోత్‌ శ్రీనివాస్‌, సర్పంచ్‌ చెన్నా మోహన్‌, ఎంపీటీసీ మాదాసు ఉపేందర్‌రావు, భక్తులు బారి శ్రీరనివాస్‌ యాదవ్‌, చౌడవరపు కృష్ణారావు, కూరపాటి సందీప్‌, రేపాల శ్యాంసుందర్‌, కోనారెడ్డి, తిరుపతిరావు, నవీన్‌లతోపాటు రెండు వందల మంది శివ స్వాములు పర్యవేక్షించారు. 


పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు...

  మహా శివరాత్రి సందర్భంగా కూసుమంచి సీఐ ఓ.మురళి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కూసుమంచి ఎస్‌ఐ అశోక్‌రెడ్డి, నేలకొండపల్లి ఎస్‌ఐ గౌతం, తిరుమలాయపాలెం ఎస్‌ఐ, సర్కిల్‌ పోలీసులు, మహిళా పోలీసులు బందోబస్తు నిర్వహించి ట్రాఫిక్‌ రాకపోకలకు అంతరాయం కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.


అలంకరణలతో శివాలయం.. 

   శివరాత్రి సందర్భంగా పూలమాలతో పాటు బంతి, పచ్చి పూలతో అలంకరణ చేశారు. లైటింగ్‌ ఏర్పాటు చేశారు. మామిడి తోరణాలు కట్టారు. శివస్వాములు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాలు నిర్వహించారు. దుకాణాలు, ప్రత్యేక అభిషేకాలు, ఆకర్షణగా నిలిచాయి. శివ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనేక మంది ఆటో యజమానాలు భక్తుల కోసం ఉచితంగా ఆటోలు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ ఈవో నారాయణా చార్యులు, శివ స్వాములు పాల్గొన్నారు.


logo