బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Feb 22, 2020 , 00:50:13

సేమ్‌ టు సేమ్‌రూపం ఒక్కటే.. శరీరాలు వేరు

సేమ్‌ టు సేమ్‌రూపం ఒక్కటే.. శరీరాలు వేరు

కవలలు అంటే కొంతమంది అదృష్టమంటారు.. మరికొంతమంది వంశపారంపర్యమంటారు.. ఏది ఏమైనా కవలలుగా పుట్టడం ఆశ్చర్యం.. సాధారణంగా కవలలు ఒకరిని పోలి మరొకరు ఉండటం ఒక ఎత్తయితే..

  • ఇంటి దీపాలు.. అమడాల పిల్లలు
  • సమాజంలో కలర్‌ఫుల్‌గా కన్పిస్తున్న ‘కవలలు’
  • ‘ట్విన్స్‌'కు ప్రత్యేకం ‘వేపకుంట్ల’
  • ఒకే ఊరిలో తొమ్మిది మంది కవలలు జననం

కవలలు అంటే కొంతమంది అదృష్టమంటారు.. మరికొంతమంది వంశపారంపర్యమంటారు.. ఏది ఏమైనా కవలలుగా పుట్టడం ఆశ్చర్యం.. సాధారణంగా కవలలు ఒకరిని పోలి మరొకరు ఉండటం ఒక ఎత్తయితే.. ఒకే లాంటి అభిరుచులు, అలవాట్లు కలిగి ఉండటం మరో విశేషం.. కవలలను చూసిన ఎదుటి వ్యక్తులు ఆశ్చర్యచకితులై వారి ప్రవర్తనలను చూసి పులకించిపోవడం, వారి ఒకేరూపాన్ని చూసి వింత గొలపడం మనం చూస్తూనే ఉంటాం.. అవునండీ ఈ రోజు కవలల దినోత్సవం.. నేడు ప్రపంచ కవలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒకే రూపాన్ని కలిగి ఉండే ‘కవలల’ పరిచయంపై ప్రత్యేక కథనం...    - ఖమ్మం ఎడ్యుకేషన్‌/రఘునాథపాలెం


(ఖమ్మం ఎడ్యుకేషన్‌):ఒక కాన్పులో ఒక బిడ్డని ప్రసవించడం సాధారణ లక్షణం. అదే ఒక కాన్పులో ఇద్దరు, అరుదుగా ఎక్కువమంది కూడా జన్మిస్తూ ఉంటారు. అటువంటి ప్రత్యేకమైన పిల్లల కోసం ప్రపంచం ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించింది. ప్రపంచంలో చాలా దేశాలు ఫిబ్రవరి 22ను కవలల దినోత్సవంగా జరుపుకుంటాయి. కవలలు జన్మించడం అనేది వింత కాదు.. కృతయుగంలో సీతారాములకు లవకుశలు, రోమన్‌లో అక్కడి సామ్రాజ్య పాలకులు మొదలుకొని ఎందరికో కవల పిల్లలు జన్మించారు. పోలెండ్‌ దేశంలోని మోజన్‌, ఆరన్‌ విల్‌కాక్స్‌ల పేరుమీద ట్విన్స్‌ డేను జరుపుతున్నారు. 


ఒకే పోలికతో..

మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. ఆ మాటను వినడమే కానీ ఒకేలా ఉన్న ఏడుగురిని ఒకేసారి చూసిన వాస్తవం మాత్రం లేదు. కానీ ఒకే రూపాన్ని కలిగిన ఇద్దరిని తప్పక చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ ముగ్గురిని కూడా. వారినే కవలులుగా పిలుస్తుంటారు. తల్లిగర్భం నుంచి ఒకేసారి జన్మించిన వారినే ‘కవలలు’గా చెప్పుకుంటాం. ఇద్దరు, ముగ్గురు ఆపైన ఎంతమందైనా ఒకే కాన్పులో జన్మిస్తే వారిని కవలలుగానే పిలుచుకుంటాం. ఇలా ఒకే రూపాన్ని పోలిన ఇద్దరు కవలలు మనకు అనేక సందర్బాల్లో ఎదురయ్యే ఉంటారు. శరీరాలు వేరై ఒకే రూపంతో జన్మంచడం అదృష్టంగానూ భావిస్తుంటారు. వారిని ఎంతో అపురూపంగా చూసుకుంటారు. వారికి పెట్టే పేర్లూ దెగ్గరిగా ఉండేలా చూస్తుంటారు. అంతేకాదు కవలల కేశాల అలంకరణ మొదలుకొని ధరించే దుస్తులు, చెప్పులు వంటి వాటిల్లో ప్రతీదీ ఇద్దరికీ వేసి ప్రత్యేకతను చాటుతుంటారు. అచ్చుగుద్దినట్లు కనిపించే కవలలను చూస్తే మనమూ ఆశ్చర్యానికి గురవుతాం. 


పోలికలు వేరైనా అభిరుచులు ఒక్కటే..

(అలోక్‌, అయాన్‌): ముద్దుముద్దుగా కనిపించే ఈ చిన్నారులు ఖమ్మం నగరం శ్రీసిటీకి చెందిన పునాటి మనోజ్‌, శ్రీహర్మ్య దంపతులకు జన్మించిన కవలలు. పేర్లు అలోక్‌, అయాన్‌. ఒకే సమయాన బాహ్యప్రపంచంలోకి వచ్చిన చిన్నారి కవలలంటే తల్లిదండ్రులకు ఎంతో అపురూపం. పుట్టినప్పటి నుంచీ ఏ వస్తువు కొన్నా ఒకే రకమైనదే అయి ఉంటుందని తల్లిదండ్రులు మనోజ్‌, హర్మ్య అంటున్నారు. 


ఒకటే వ్యక్తిత్వం.. 

(నయనిరేచల్‌, నైతిక్‌ కుమార్‌): ఇద్దరూ ఒక్కలాగే ఉంటారు. ఒకరు ఏం చేస్తే ఇంకొకరు అదే చేస్తారు. ఇలాంటి వ్యక్తిత్వమే నయనిక్‌రేచల్‌, నైతిక్‌కుమార్‌లది. ప్రస్తుతం ప్రైమరీ పాఠశాలలో చదువుకుంటున్న వీరిద్దరు పాఠశాలలోనూ ప్రత్యేకంగా ఉంటారు. ఒకే విధమైన డ్రెస్‌తో రోజూ అలరిస్తుంటారు. వీరి అల్లరి, ఆలోచనలతో తల్లిదండ్రులు కే.వినోద్‌కుమార్‌ శ్రీవిద్యలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


పుట్టిన రోజు సంబురంలా.. 

(సమీక్ష, వీధిక్ష): పుట్టినప్పటి నుంచి ప్రతి రోజూ తమకు పండుగలా ఉందని తల్లిదండ్రులు అలవాల లింగయ్య, స్వాతి చెబుతుంటారు. పుట్టినరోజును కుటుంబసభ్యులంతా సంబురంలా జరుపుకుంటారు. సమీక్ష,వీధిక్ష చేసే ప్రతిదీ ఆశ్యర్యంగానే ఉంటుందని వివరించారు. ప్రస్తుతం 9వ సంవత్సరాల వయస్సున్న సమీక్ష కార్తిక, వీధిక్ష కార్తిక వీరిద్దరు స్కూల్‌కు వెళుతున్నారు.


ఒకరినొకరు విడిచి ఉండలేరు.. 

(వర్షిణి, హర్షిణి) : నేలకొండపల్లి: ఒకరికొకరు ప్రతిరూపంలా కన్పిస్తున్న ఈ అక్కచెల్లెళ్లు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. నేలకొండపల్లి మండలం భైరవునిపల్లి గ్రామానికి చెందిన గోపి ఉపేందర్‌రావు, నాగలక్ష్మీల సంతానం వర్షిణి, హర్షిణి అనే ఈ కవలలు. ఇద్దరూ కూడా ఎప్పుడు ఒకే రకమైన డ్రస్సును ఇష్టపడతారు. 


తల్లిదండ్రులకు కష్టమే.. 

(రామ్‌, లక్ష్మణ్‌): పిడియా రామ్‌, లక్ష్మణ్‌లు జానపద కళాకారులు. ఇందులో లక్ష్మణ్‌ సాంస్కృతిక కళాకారుడిగా ఉన్నాడు. పిండిప్రోలులోని పాపాయిగూడేకి చెందిన వీరిని గుర్తుపట్టాలంటే తల్లిదండ్రులైన గురవమ్మ, గోపయ్యలకూ కష్టమేనట. 


ఒకే తరహాలో.. 

(మోక్షిత్‌, మోనిష్‌): అచ్చుగుద్దినట్లు ఒకే రూపాన్ని కలిగిన వీరి పేర్లు మోక్షిత్‌, మోనిష్‌. వీరి రూపాలే కాదు వీరు చేసే అల్లరీ ఒక్కటే. ప్రతి విషయంలోనూ పోటీ పడుతుంటారు. స్కూల్‌కు వెళ్ళే విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉంటారని తండ్రి అనిల్‌ పేర్కొన్నారు.


గుర్తించలేరు.. 

(అలిఫా, అఫియా): ఇద్దరూ ఒకేలా ఉంటారు. ఇద్దరిలో ఒకరిని గుర్తించటం కష్టంగా ఉంటుంది. చదువులో కూడా ఉత్సాహంగా ఉంటారని  అలీఫా, అఫియా తల్లిదండ్రులు అక్బర్‌ అలీ, ఆసియా పేర్కొంటున్నారు. అల్లరిలో కూడా ఇద్దరు ఒకేలా ఉంటారు.


logo