సోమవారం 30 మార్చి 2020
Khammam - Feb 21, 2020 , 01:39:01

పట్టణ ప్రగతితో.. మున్సిపాలిటీలకు మహర్దశ

పట్టణ ప్రగతితో.. మున్సిపాలిటీలకు మహర్దశ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘పల్లె ప్రగతి’ స్ఫూర్తితో ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించి విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు.

  • ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు ప్రణాళిక
  • పది రోజుల్లో పట్టణాల స్వరూపం మారాలి
  • మురికివాడల బాగోగులపై ప్రత్యేక దృష్టి అవసరం
  • వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయండి
  • పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో మంత్రి అజయ్‌
  • ప్రణాళికను సక్సెస్‌ చేయండి: మానుకోట ఎంపీ కవిత
  • పాల్గొన్న ‘గూడెం’, ఇల్లెందు ఎమ్మెల్యేలు వనమా, హరిప్రియ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ‘పల్లె ప్రగతి’ స్ఫూర్తితో ‘పట్టణ ప్రగతి’ని ప్రారంభించి విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు, అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన పట్టణ ప్రణాళిక సన్నాహాక సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ స్వయంగా రూపొందించి అమలుపర్చిన పల్లెప్రగతి కార్యక్రమం అద్భుత విజయాలను సాధించిందని, ఆ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై బాధ్యతాయుతంగా పనులు నిర్వహించాలన్నారు.


ప్రతి పట్టణంలో విరివిగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మాణం చేపట్టి రాష్టానికే ఆదర్శంగా నిలవాలన్నారు. వచ్చే ఎనిమిది నెలల్లో విద్యుత్‌ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని, అందుకు అనుగుణంగా నూతన చైర్‌పర్సన్లు, కమిషనర్లు బాధ్యతగా పనిచేయాలని, లేకపోతే పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని హెచ్చరించారన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. కౌన్సిలర్లు, కమిషనర్లు సమన్వయంతో పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. వార్డుల వారీగా నియమించిన కమిటీల వారి అభిప్రాయాలు, వార్డుల్లోని ప్రముఖులు, ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకొని ప్రాధాన్యతాంశాల వారీగా చేసుకుంటూ రావాలన్నారు. సుందర పట్టణాలుగా తీర్చిదిద్దాలన్నారు. వెజ్‌, నాన్‌వెజ్‌, ఫ్రూట్‌, ఫ్లవర్‌మార్కెట్లను ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ చేపట్టాలన్నారు.  పట్టణ ప్రజలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకు క్రీడాప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు, పార్కులు ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఏ శాఖకు చెందిన స్థలాన్నైనా ప్రజావసరాల కోసం ఉపయోగించే విచక్షణాధికారాలు నూతన మున్సిపల్‌ చట్టం ద్వారా కలెక్టర్‌కు ఆపాధించబడ్డాయని, కలెక్టర్‌ అందుకు అనుగుణంగా స్థలాలను కేటాయించి పట్టణాభివృద్ధికి కృషి చేయాలన్నారు. 


వంగిన, తుప్పు పట్టిన, రోడ్డు మధ్యలో, ఫుట్‌పాత్‌లపై ఉన్న విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను మార్చాలన్నారు. ఇండ్లపై వేలాడే, హైటెన్షన్‌ లైన్లను సరిచేసి విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. ప్రతి వార్డుకు స్పెషల్‌ ఆఫీసర్లను నియమించాలని, వారు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ వార్డుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి వాటర్‌మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ నీటి వినియోగంపై అత్యంతశ్రద్ధ తీసుకున్న రాష్ట్రం తెలంగాణ అన్నారని తెలిపారు. భూగర్భజలాలు అడుగంటకుండా గ్రామాల్లో మాదిరిగానే పట్టణాల్లో కూడా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలన్నారు. 

కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ట్రైనీ కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్‌, అదనపు కలెక్టర్‌ కర్నాటి వెంకటేశ్వర్లు, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపల్‌ కమిషనర్లు అరిగెల సంపత్‌కుమార్‌, శ్రీకాంత్‌, విజయ, వెంకటస్వామి, కొత్తగూడెం పట్టణ ప్రణాళిక పొనుగోటి కృపాకర్‌రావు, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు స్పెషలాఫీసర్‌లు వై వేణుగోపాల్‌, కే వెంకటేశ్వర్‌రెడ్డి, రాములు, కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి, ఇల్లెందు చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్‌ చైర్మన్లు వేల్పుల దామోదర్‌, జానీ, కౌన్సిలర్లు, వార్డుల స్పెషల్‌ ఆఫీసర్లు, తహసీల్దార్‌ వర్సా రవికుమార్‌, ఆర్‌ఐ యాసిన్‌, వెంకటేశ్వ ర్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.


ప్రజల సీఎం కేసీఆర్‌ -మహబూబాబాద్‌ ఎంపీ కవిత

నిరంతరం ప్రజల గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్‌. దేశంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. వారం రోజులు సీఎం కేసీఆర్‌ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారంటే ప్రజల కోసం ఏదో ఒక బృహత్తర పథకాన్ని తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. అందులో భాగంగానే అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కానీ పల్లె, పట్టణ ప్రగతి అనే పథకాలను ప్రవేశపెట్టలేదు. ప్రజలు, అధికారులను మమేకం చేస్తూ పనులు చేయాలనే ఆలోచన చేయలేదు. సీఎం కేసీఆర్‌ మాత్రం ప్రజలకు ప్రజాప్రతినిధులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలను రూపొందించడం ఎంతో అభినందనీయం. 


ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దాం

-ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారిగా నిర్వహించిన మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న నమ్మకానికి ఈ విజయం ఒక నిదర్శనం. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు పదేళ్లు రిజర్వేషన్‌ అమలు చేశారు. అంటే ఒక్కసారి కౌన్సిలర్‌గా గెలిస్తే ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పించి వార్డును అన్నీ రంగాల్లో అభివృద్ధి చేస్తే మళ్లీ అదే కౌన్సిలర్‌ మళ్లీ రిజర్వేషన్‌ సమస్య లేకుండా పోటీచేసే అదృష్టాన్ని సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ కల్పించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలకు హామీ ఇచ్చి నమ్మకంగా ఓటు వేయించుకున్నామో అదే నమ్మకంతో ప్రజల అవసరాలను తీర్చాలి.  


ప్రజా జీవితం ఎంతో గొప్పది 

-వనమా వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే, కొత్తగూడెం 

ప్రజా జీవితం ఎంతో గొప్పది. కోట్ల రూపాయలు ఉన్నా ఆ డబ్బులు కుటుంబానికి మాత్రమే పనికి వస్తాయి. డబ్బులున్నంత మాత్రం నాయకులు కాలేము. ప్రజల ఆధరాభిమానాలు ఉంటేనే నాయకులుగా ఎదుగుతాం. ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు కల్పిస్తే వారు జీవితాంతాం గుర్తుంచుకుంటారు. ప్రజలు నమ్మితే మళ్లీమళ్లీ ఎన్నికల్లో గెలిపిస్తారనడానికి నేనే ఒక ఉదాహరణ.  ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలి. పట్టణ ప్రగతిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి. 


logo