శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 19, 2020 , 23:20:53

పట్టణాల్లో ప్రగతి పరుగులు పెట్టాలి

పట్టణాల్లో ప్రగతి పరుగులు పెట్టాలి

ఖమ్మం, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 19: నగరాలు, పట్టణాలను మెరుగుపర్చేందుకు పట్టణ ప్రగతి తొలి మెట్టు అని, చిన్న చిన్న అభివృద్ధి పనులతోనే ప్రజల మన్ననలు పొందగలుగుతామని, ప్రజా అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలు పురోగతిలో పరుగులు పెట్టాలని, నూతన మున్సిఫల్‌ చట్టం ననుసరించి పట్టణ ప్రణాళికలు రచించుకొని పనులు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు 10 రోజులపాటు నిర్వహించనున్న పట్టణ ప్రగతిపై బుధవారం టీటీడీసీ సమావేశ మందిరంలో ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల మేయర్‌, చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కార్పొరేటర్స్‌, కౌన్సిలర్స్‌, మున్సిపల్‌ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సన్నాహాక సమావేశంలో మంత్రి పాల్గొని ప్రజాప్రతినిధులకు, అధికారులకు తమ కర్తవ్యాలను, బాధ్యతలను తెలియచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పాలకవర్గం, నూతన మున్సిపల్‌ చట్టం పట్ల పూర్తి అగవాహాన పెంపొందించుకోవాలని మంత్రి సూచించారు.తదనుగుణంగా పట్టణ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. 


పల్లెలను బాగుచేసుకునే పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతంగా నిర్వహించుకున్నామని గుర్తుచేశారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందని అన్నారు. నగరాలు, పట్టణాలను పురోగతిలోకి తీసుకవెల్లడానికి పట్టణ ప్రగతిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం ప్రతి మున్సిపాలిటీ పాలక వర్గం బడ్జెట్‌ను రూపొందించుకొని జీతాలు, విద్యుత్‌ బిల్లులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కేటాయించిన బడ్జెట్‌లో 10 శాతం నిధులను గ్రీన్‌ప్లాన్‌కు తప్పనిసరిగా కేటాయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘ నిధులతోపాటు రాష్ట్ర ప్రభత్వుం విడుదల చేస్తున్న నిధులతోపాటు ప్రతి మున్సిపాలిటీ తమ సొంత ఆదాయ వనరులను సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. పట్టణ ప్రగతిలో ప్రధానంగా వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్ల ఏర్పాటు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు, దహన, ఖనన వాటికల ఏర్పాటు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటు కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి పనులను చేపట్టాలని సూచించారు. రాబోయే 8 నెలల్లో అన్ని మున్సిపాలిటీల్లో చేపట్టిన పనులను పూర్తి చేయాలని మంత్రి అన్నారు.గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌తో పట్టణాలలో పచ్చదనాన్ని పెంచడంతోపాటు 85 శాతం మొక్కలు సజావుగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. దీనితోపాటు విద్యుత్‌ సమస్యలపై ప్రధాన దృష్టి సారించాలన్నారు. 


వంగిన స్తంభాలను, ప్రమాదకరమైన ట్రాన్స్‌ఫార్మర్లను, వేలాడే విద్యుత్‌ తీగలను, థర్డ్‌వైర్‌లను సరిచేయాలని సూచించారు. అధేవిధంగా మున్సిపాలిటీల పరిధిలో ట్యాంక్‌బండ్‌ల అభివృద్ధి, ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుకు ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సూచించారు. నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం కలెక్టర్లకు అపారమైన అధికారాలు కల్పించడం జరిగిందన్నారు. శాసనసభ్యులు, మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కమిషనర్లు జిల్లా కలెక్టర్‌తో సమన్వయంగా ఉంటూ నగరం, పట్టణాల అభివృద్ధికి పాటు పడాలని సూచించారు. ప్రజల మౌలిక అవసరాలను గుర్తించడం, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, రోడ్లపై గుంతల పూడిక వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మిషన్‌ భగీరథ పనులపై దృష్టి పెట్టడంతో పాటు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకవచ్చేలా న్రజాప్రతినిధులు వ్యవహరించాలన్నారు. వార్డుల వారీగా సమస్యలను గుర్తించేందుకు ప్రతి వార్డుకూ 4 కమిటీలను 60 మంది సబ్యులతో ఏర్పాటు చేసుకోవాలన్నారు. కమిటీ సభ్యులు ఆయా వార్డుల్లోని సమస్యలను గుర్తించి ప్రజల అవసరాలపై అభిప్రాయాలు సేకరించిన స్పందన మేరకు పనులు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీల నూతన పాలకవర్గాలకు పట్టణ ప్రగతి ఒక సువర్ణ అవకాశమన్నారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం తగ్గించి పనులు చేయించడంపై దృఫ్టి పెట్టాలని సూచించారు.  ఆర్భాటాలకు వెళ్లకుండా చేపట్టవలసిన పనులను ప్రణాళిక ద్వారా చేపట్టాలని సూచించారు. సమగ్ర కార్యాచరణ ద్వారా పట్టణాలు, నగరాలను పట్టణ ప్రగతి ద్వారా అభివృద్ధి పర్చాలని మంత్రి పువ్వాడ హితబోధ చేశారు. 


ప్రాధాన్య పరంగా పనులు చేపట్టాలి

పల్లె ప్రగతితో పోలిస్తే పట్టణ ప్రగతి భిన్నంగా ఉంటుందన్నారు. చిన్న చిన్న వార్డులు, అధిక జనాభా, పౌరసేవలు అధికంగా ఉంటాయని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ పేర్కొన్నారు.ప్రభుత్వం నుంచి ప్రజలు ఎక్కువుగా ఆశిస్తారని, తదనుగుణంగా పట్టణ ప్రగతి కార్యాచరణ సిద్ధం చేసి ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యం పరంగా వాటిని చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు సహకరించాలని కలెక్టర్‌ అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థతోపాటు జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు, పట్టణాలను ఆదర్శంగా మార్చే గురుతర బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ముఖ్యమంత్రి ఉంచారని అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, జిల్లా ప్రజాప్రతనిధులు సహకరాంతో దృఢమైన సంకల్పంతో పట్టణ ప్రగతిని కూడా జిల్లాలో విజయవంతంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా కలెక్టర్‌ అన్నారు. పట్టణ ప్రాంత ప్రజలకు మౌలిక అవసరాలు కల్పించే దిశగా పారిశుధ్యం మెరుగుపర్చడం, క్రమం తప్పకుండా మంచినీటి సరఫరా, విద్యుత్‌ సమస్యల పరిష్కారం, పట్టణాలను పచ్చదనంగా మార్చే విధంగా గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు, వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌ ఏర్పాటుకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి పనులు చేపడతామని కలెక్టర్‌ అన్నారు. ఈ సమావేశంలో వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు లావుడ్యా రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్‌ పాపాలాల్‌, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిఫల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, లోకల్‌ బాడీస్‌ అడిషనల్‌ కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ కమిషనర్లు విజయానంద్‌, మీనన్‌, దేవేందర్‌, కార్పొరేటర్లు, మున్సిపల్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


logo