ఆదివారం 29 మార్చి 2020
Khammam - Feb 19, 2020 , 23:11:10

వార్డుల వారీగా నివేదిక సమర్పించాలి

వార్డుల వారీగా నివేదిక సమర్పించాలి

ఖమ్మం నమస్తేతెలంగాణ: పల్లె ప్రగతి స్ఫూర్తితో పట్టణ ప్రగతిని విజయవంతం చేయాలని, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల ప్రభావం స్పష్టంగా కనిపించేలా ఉండాలని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం టీటీడీసీ సమావేశ మందిరంలో మున్సిపల్‌, విద్యుత్‌శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పట్టణ ప్రగతి సన్నాహక సమావేశంలో చేపట్టవలిసిన పనులపై అధికారులకు కలెక్టర్‌ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో చేపట్టనున్న పట్టణ ప్రగతిలో చేపట్టే పనులపై వార్డుల వారీగా నివేదిక సమర్పించాలని విద్యుత్‌, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో ప్రధానంగా విద్యుత్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాలో ఇప్పటికే గుర్తించిన పనులతో పాటు ఇంకా చేపట్టవలిసిన పనులపై వ్యూహంతో పనులు చేపట్టాలన్నారు. విద్యుత్‌కు సంబంధించి ప్రధాన సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ట్రాన్స్‌ఫార్మర్ల పనులు రోడ్డు మధ్యలో ఉన్న స్థంభాల మార్పు, రద్దీ ప్రదేశాలలో అవసరమైన చోట అదనపు విద్యుత్‌ స్థంబాలను ఏర్పాటు చేయాలని, కార్పొరేషన్‌ విలీన గ్రామాలలో ప్రత్యేక దృష్టి సారించి విద్యుత్‌ సమస్యలను పరిష్కరించాలని చూచించారు. ప్రతి వార్డుకు డీఈ, ఏఈ, క్యాడర్‌ సమర్ధవంతమైన అధికారిని బాధ్యులుగా నియమించాలని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈని కలెక్టర్‌ ఆదేశించారు. 


వేలాడే విద్యుత్‌ తీగలను సరిచేయటం, థర్డ్‌వైర్‌ ఏర్పాటు చేయటం, తుప్పు పట్టిన స్థంబాల మార్పిడి, రోడ్డు మధ్యలో ఉన్న స్థంబాల మార్పిడి, ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్‌ ఏర్పాటు, పుట్‌పాత్‌లపై ఉన్న స్థంబాల తొలగింపు పనులను వంద శాతం పది రోజుల పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టి పట్టణాలు, నగరాలను సందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ.. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటికే చేపట్టిన మిషన్‌ భగీరథ, ముఖ్యమంత్రి హామీ పనులు, ఎల్‌ఆర్‌ఎస్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణ ప్రగతి పది రోజుల కార్యక్రమంలో పెండింగ్‌ పనులను పూర్తి చేయాలన్నారు. విలీన గ్రామాలు, డబుల్‌ బెడ్‌రూం కాలనీలలో విద్యుత్‌ సమస్యల పరిష్కారాని ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీధి దీపాలు, నూతన కరెంట్‌ కనెక్షన్‌లకు సంబంధించి వార్డుల వారీగా లక్ష్యాలను నిర్ధేశించుకుని తదనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. లోకల్‌బాడీస్‌ అడిషనల్‌ కలెక్టర్‌ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ రమేష్‌, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ కమిషనర్లు విజయానంద్‌, మీనన్‌, దేవేదర్‌, ఆర్‌అండ్‌బీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ శ్యాంప్రసాద్‌, రవాణా శాఖ అధికారి క్రిష్ణారెడ్డి, నగరపాలక సంస్థ డీఈ రంగారావు, మున్సిపల్‌, విద్యుత్‌శాఖల ఏఈలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.logo