శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 19, 2020 , 01:48:33

‘పల్లె’ స్ఫూర్తితో పట్టణ ప్రగతి

‘పల్లె’ స్ఫూర్తితో పట్టణ ప్రగతి

పల్లె ప్రణాళితో గ్రామాలు సుందరంగా మారాయి.. ప్రజా ప్రతినిధుల సమక్షంలో అధికారుల పర్యవేక్షణలో గ్రామస్తుల సహకారంతో పల్లెల్లో పారిశుధ్య పనులు చేపట్టి కొత్తందం తీసుకువచ్చారు.. అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు..

  • కార్యాచరణ సిద్ధం చేసిన సీఎం కేసీఆర్‌
  • 24 నుంచి మార్చి 4వరకు కార్యక్రమాలు
  • ప్రజల భాగస్వామ్యంతో మరో ప్రణాళిక
  • పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా పనులు
  • ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే లక్ష్యంతో ముందుకు
  • మారనున్న పట్టణాల రూపురేఖలు
  • జిల్లాలో ఖమ్మం నగరంతో పాటు, వైరా, సత్తుపల్లి, మధిరలో పట్టణ ప్రగతి
  • వార్డు కమిటీల ఏర్పాటు..

పల్లె ప్రణాళితో గ్రామాలు సుందరంగా మారాయి.. ప్రజా ప్రతినిధుల సమక్షంలో అధికారుల పర్యవేక్షణలో గ్రామస్తుల సహకారంతో పల్లెల్లో పారిశుధ్య పనులు చేపట్టి కొత్తందం తీసుకువచ్చారు.. అదే స్ఫూర్తితో సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టారు.. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు..  24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పది రోజుల పాటు తొలివిడుత పట్టణ ప్రగతి  కార్యక్రమం కొనసాగనుంది.. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ఖమ్మం కార్పొరేషన్‌తో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.. వార్డు కమిటీలను నియమించి వారి ద్వారా గుర్తించిన సమస్యలను పరిష్కరించనున్నారు..  

- ఖమ్మం నమస్తేతెలంగాణ 


(ఖమ్మం, నమస్తే తెలంగాణ): అభ్యుదయానికి నాంది పలుకుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల, పట్టణాల సంపూర్ణ అభివృద్ధిలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతనంగా అమలులోకి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజల భాగస్వామ్యానికీ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా హరితహారం, వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డులు, మెరుగైన విద్యుత్తు సరఫరా, అంతర్గత రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ భవనాల ఆధునికీకరణ, అవసరమైన నూతన నిర్మాణాలు, శిథిల భవనాల కూల్చివేత, పడావుబడిన బావుల పూడ్చివేత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ వంటి చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా గ్రామాల్లో సమస్యలు కొల్కిక్కి వచ్చాయి. దీంతో  నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం పట్టణాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి ప్రణాళిక కార్యాక్రమానికి కార్యాచరణ ప్రకటించింది. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం ఏటా రూ.కోట్లు విడుదల చేస్తున్నది. ఖమ్మం జిల్లాలోని ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌తోపాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో ఈ పనులు జరుగనున్నాయి. దీని ద్వారా పట్టణాల స్వరూపం పూర్తిగా మారనుంది.


వార్డు కమిటీల ఏర్పాటు..

పట్టణాల్లో పారిశుధ్యం, పచ్చదనం వెల్లివిరియాలని, పట్టణ పౌరులకు మెరుగైన సేవలు అందించాలని పట్టణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రజలందరి భాగస్వామ్యంతో పట్టణ ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం జిల్లాలోని ఖమ్మం నగరంతోపాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలను నియమించనున్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లో 60 డివిజన్‌లు ఉండగా మధిరలో 22, వైరాలో 20, సత్తుపల్లిలో 23 వార్డులు ఉన్నాయి. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరిగేలా ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రతి వార్డులోనూ ఐదు సంఘాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా వార్డులోని సమస్యలను గుర్తిస్తారు. తరువాత వాటిని పరిష్కరిస్తారు. ప్రతి వార్డుకీ ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. వారి పర్యవేక్షణలో పనులు జరుగుతాయి. పచ్చధనాన్ని, పారిశుధ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు నిరక్షరాస్యులను గుర్తించే దిశగా ముందుకు సాగుతారు.


పచ్చదనం, పారిశుధ్యానికి ప్రాధాన్యం.. 

పట్టణ ప్రగతిలో పచ్చదనం పారిశుధ్య పనులకు అధిక ప్రాధాన్యమిస్తారు. డ్రైనేజీలను శుభ్రం చేయడం, మురుగునీటి గుంతలు పూడ్చడం, విరివిగా మొక్కలు నాటడం, హరిత ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. వార్డుల్లో నర్సరీల ఏర్పాటు చేస్తారు. అనువైన స్థలాలను ఎంపికచేయడంతో పాటు నగరాలు, పట్టణాల్లో స్థలాలు అందుబాటులో లేకుంటే సమీప గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తారు. అందుకోసం పట్టణాలకు దగ్గరలోని గ్రామాలను ఎంపిక చేస్తారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో పారిశుధ్య పనుల కోసం మొత్తం అవసరమైన వాహనాలు సమకూర్చాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఒకవేళ వాహనాలు లేనట్లయితే కొత్త వాహనాలను త్వరగా తెప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  


పట్టణ ప్రణాళికలో చేపట్టనున్న పనులు..

*మంచినీటి సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం. 

*ప్రధాన రహదారులు, అంతర్గత రహదారుల పరిస్థితిని మెరుగుపరచడం

*గుంతలను పూర్తిగా పూడ్చేయడం. 

*దహన/ఖనన వాటికల ఏర్పాటుకు కావాల్సిన స్థలాలను ఎంపిక చేయడం. 

*ముళ్ల పొదలు, కంప చెట్లను నరికివేయడం. 

*వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్లు ఎన్ని నిర్మించాలో నిర్ణయించడం, వాటి కోసం స్థలాలను ఎంపిక చేయడం. 

*క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయడం. 

*డంప్‌ యార్డులకు స్థలాలను గుర్తించడం. 

*పబ్లిక్‌ టాయిలెట్స్‌ను నిర్మించడం

*మహిళల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్‌ ఏర్పాటుచేయడం, వీటి కోసం స్థలాలనులు గుర్తించడం.

*ప్రభుత్వ స్థలాలను టాయిలెట్ల నిర్మాణానికి కేటాయించడం. 

*వీధుల్లో వ్యాపారం చేసుకునే వారికి ప్రత్యామ్నాయ స్థలం చూపించడం 

*పార్కింగ్‌ స్థలాలను గుర్తించడం.

*ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అవసరం మేరకు పార్కింగ్‌ కోసం కేటాయించడం. 

*విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగుపర్చడానికి ఆధునిక పద్ధతులు అవలంబించడం.

*ప్రమాద రహిత విద్యుత్‌వ్యవస్థ ఉండేవిధంగా చర్యలు తీసుకోవడం.

*వంగిన, తుప్పుపట్టిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటుచేడయం.

*రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను మార్చడం, పుట్‌పాత్‌లపై ట్రాన్స్‌ఫారాలను మరోచోటికి తరలించడం. వేలాడే వైర్లను సరిచేయడం. 


logo