సోమవారం 30 మార్చి 2020
Khammam - Feb 19, 2020 , 01:34:06

పైసలు కొట్టు.. పత్రం పట్టు..

పైసలు కొట్టు.. పత్రం పట్టు..

ఖమ్మం నగరానికి చెందిన ఆనంద్‌ (పేరుమార్చాం) తన భార్య అనారోగ్యానికి గురవడంతో వైద్య ఖర్చుల కోసం రెండు లక్షలు అప్పులు చేశాడు. అవి తీర్చేందుకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసేందుకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు మీ సేవలో దరఖాస్తు చేశాడు.

  • మీసేవ దరఖాస్తులకు స్పందించని సిబ్బంది
  • కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా దరఖాస్తుదారులు
  • అయినా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది..
  • అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం అంటేనే హడలుతున్న జనం..

ఖమ్మం నగరానికి చెందిన ఆనంద్‌ (పేరుమార్చాం) తన భార్య అనారోగ్యానికి గురవడంతో వైద్య ఖర్చుల కోసం రెండు లక్షలు అప్పులు చేశాడు. అవి తీర్చేందుకు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసేందుకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పొందేందుకు మీ సేవలో దరఖాస్తు చేశాడు. రోజులు గడుస్తున్నా సర్టిఫికెట్‌ మంజూరు కాకపోవడంతో ఆనంద్‌ సంబంధిత ఏరియా వీఆర్‌వోను పలు మార్లు కలిసి ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని వేడుకున్నాడు. అయినా పని కాకపోవడంతో తెలిసిన వ్యక్తి ద్వారా సదరు వీఆర్‌వోకు రూ.3వేలు ముట్టజెప్పాడు. ఇంకేముంది మరునాడే ఆనంద్‌ మీ ధ్రువీకరణ పత్రం మంజూరైనట్లు సెల్‌కు మెసేజ్‌ వచ్చింది. ఇలా ఆనంద్‌ ఒక్కడికే కాదు ఇలాంటి వారు ఎందరికో      ఈ కార్యాలయంలో పని కావాలంటే కాసులు ముట్టజెప్పాల్సిందేనని ప్రజలు వాపోతున్నారు..                  -రఘునాథపాలెం 


రఘునాథపాలెం: ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌ ప్రాంతానికి చెందిన అతడి పేరు అజయ్‌. ఆయన భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెకు కనీస వైద్యం కూడా చేయించలేని నిరుపేద. అప్పోసప్పో చేసయినా సరే.. ఆమెను బతికించుకోవాలనుకున్నాడు. అందినకాడికల్లా అప్పులు చేశాడు. ఆమె పూర్తిగా కోలుకునేసరికి ఆస్పత్రి, మందుల ఖర్చు రెండులక్షల రూపాయలకు చేరింది. కనిపించని దైవానికన్నా... కనిపించే-కరుణించే ప్రత్యక్ష దైవంలాంటి ముఖ్యమంత్రికి తన దీనగాథను చెప్పుకుని, సాయం అడుగుదామనుకున్నాడు. సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసేందుకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం మీ సేవా కార్యాలయంలో అర్జీ పెట్టాడు. రోజులు గడుస్తున్నప్పటికీ, ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పటికీ సర్టిఫికెట్‌ చేతికందలేదు. తమ ఏరియా వీఆర్‌వోను కలిసి, తన గోడును చెప్పుకున్నాడు. ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాలని వేడుకున్నాడు. ఒక్కసారి కాదు... రెండుసార్లు కాదు.. అనేకసార్లు కలిసి వేడుకున్నా ప్రయోజనం కనిపించలేదు. చివరకు, ఓ మిత్రుడి ద్వారా ఆ వీఆర్‌వోకు 3000 రూపాయలు ముట్టజెప్పాడు. ఆశ్చర్యం...! రోజులతరబడి తిరిగినా కూడా అందని సర్టిఫికెట్‌, లంచం ముట్టజెప్పిన 24 గంటల్లోపే... (ఆ మరునాడే) అజయ్‌ సెల్‌ ఫోన్‌కు.. “మీ ఆదాయ ధ్రవీకరణ పత్రం మంజూరైంది. మీ సేవా కార్యాలయంలో తీసుకోండి” అని, మెసేజ్‌ వచ్చింది..!! ఆ నిరుపేద అజయ్‌కు అప్పుడు జ్ఞానోదయమైంది. తన మనసులో ఇలా అనుకున్నాడు-

‘సర్టిఫికెట్‌ చేతికందాలంటే...

సంబంధిత అధికారి చేయి తడపాలన్న మాట...!!!’ 


ఇది, ఒక్క అజయ్‌ అనుభవం మాత్రమే కాదు. ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని ఆ వీఆర్‌వోలాంటి అవినీతి చేపలు కొన్ని ఉన్నాయి. అజయ్‌ వంటి వారిని అవి పీక్కు తింటున్నాయి. ధ్రువీకరణ పత్రాల దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.

చేయి తడపనిదే... చేతికి అందదు..

ధ్రువపత్రాలను తేలిగ్గా, వేగంగా అందించే  లక్ష్యంతో మీ సేవా కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది. ధ్రువపత్రాల కోసం సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరగాల్సి అవసరం లేకుండా, ఈ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వాటిని సంబంధిత అధికారులు పరిశీలించి, నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ఈ సమాచారం వెంటనే దరఖాస్తుదారు సెల్‌ ఫోన్‌కు మెసేజ్‌ వస్తుంది. ఆ తరువాత, మీ సేవా కేంద్రానికి వెళ్లి సర్టిఫికెట్‌ తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో, ఏ దశలోనూ సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ, అవినీతి రుచి మరిగిన ఖమ్మం అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని కొందరు అధికారులు/సిబ్బంది... మీ సేవా ద్వారా వచ్చిన దరఖాస్తులను పట్టించుకోవడం లేదు. దరఖాస్తుదారులను కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. చేయి తడిపిన వెంటనే.. సర్టిఫికెట్‌ను చేతిలో పెడుతున్నారు (మీ సేవా కేంద్రం ద్వారా).  


ఇలా జరగాలి..

తహసీల్దార్‌ కార్యాలయంలో సర్టిఫికెట్ల జారీకి ఓ పద్ధతి ఉంది. నిబంధనల ప్రకారంగా... మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్‌ సిబ్బంది పరిశీలించి, సంబంధిత విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్‌(వీఆర్వో)కు ప్రింట్‌ తీసి పంపాలి. సదరు దరఖాస్తుదారు చిరునామా, ఇతరత్రా వివరాలను వీఆర్వో  పరిశీలించి, రిపోర్టును రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌(ఆర్‌ఐ)కు ఇస్తారు. ఆర్‌ఐ కూడా తన రిపోర్ట్ట్‌ జత చేసి, కార్యాలయంలోని కంప్యూటర్‌ సెక్షన్‌కు పంపుతారు. ఆ తరువాత, తహసీల్దార్‌ తన డిజిటల్‌ కీని ఉపయోగించి సంతకం చేస్తారు. అనంతరం, కంప్యూటర్‌ సెక్షన్‌ సిబ్బంది, ఓకే అయిన సర్టిఫికెట్‌ను స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో ఉంచుతారు. ఆ వెంటనే దరఖాస్తుదారుకు... ‘మీ సర్టిపికెట్‌ను మీ సేవా కేంద్రంలో స్వీకరించండి’ అని, మెసేజ్‌ వెళుతుంది. ఇదంతా, నిబంధనల ప్రకారంగా జరగాల్సిన ప్రక్రియ.


ఇలా జరుగుతోంది..

పైన వివరించినట్లుగా, మీ సేవా నుంచి అందిన దరఖాస్తులను అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలోని వీఆర్వోలు కొందరు తొక్కిపడుతున్నారు. దరఖాస్తుదారులను కార్యాలయానికి, ఆ తరువాత తమ వద్దకు రప్పించుకుంటున్నారు. తిరిగీ.. తిరిగీ.. ప్రదక్షిణలు చేసీ.. చేసీ... విసిగివేసారిన దరఖాస్తుదారులు, ఎంతోకొంత ముట్టజెప్పిన తరువాత, వీఆర్వోలు ‘కరుణిస్తున్నారు’.


వసూళ్ల దందాకు చెక్‌ పెట్టేదెప్పుడో... 

ఇదంతా చదువుతుంటే- ‘అమ్మో.. అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం’ అనుకుంటున్నారు కదూ...! ఇక్కడి అవినీ తి చేపల వసూళ్ల దందాకు చెక్‌ పడేదెప్పుడో... అజయ్‌ లాంటి ఎందరో బాధితుల (దరఖాస్తుదారుల) తిప్పలు తప్పేదెన్నడో... వేచి చూద్దాం.


logo