మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Feb 18, 2020 , 00:18:48

పట్టణ ప్రగతి ప్రణాళిక సిద్ధం చేయండి

పట్టణ ప్రగతి ప్రణాళిక సిద్ధం చేయండి

ఖమ్మం, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతి ప్రణాళికను అమలు పర్చేందుకు నివేదిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. తెలంగాణ కొత్త పురపాలిక చట్టం అమలుపై సోమవారం కలెక్టరేట్‌ లోని కలెక్టర్‌ చాంబర్‌లో మున్సిపల్‌ కమిషనర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మున్సిపల్‌ కమిషనర్లకు పలు ఆదేశాలు చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థతో పాటు వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకుగాను ముందస్తుగానే డంపింగ్‌యార్డులు, శ్మశానవాటికలు, అదేవిధంగా హరితహారంలో నగరం, పట్టణాలను సుందరీకరించేందుకు పార్కులను, ట్యాంక్‌బండ్‌లను గుర్తించాలని, విద్యుత్‌ సమస్యలకు సంబంధించిన పనులను  చేపట్టేందుకు విద్యుత్‌శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సూచించారు. దీనితో పాటు మున్సిపాలిటీలలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు కావాలసిన నిధులు సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. 


దీనితో పాటు ఆయా మున్సిపాలిటీలలో ఖాళీ పోస్టుల వివరాలను, వార్డు కమిటీల వివరాలను సమర్పించాలని ప్రతి వార్డుకు స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించేందుకు ప్రతిపాదించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో గ్రీన్‌ యాక్షన్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. మున్సిపల్‌ పరిధిలో జరిగే నూతన భవన నిర్మాణాలకు సంబంధించిన అనుమతులకై నూతన మున్సిపల్‌ యాక్టు గురించి ప్రజలకు వివిధ ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లను కలెక్టర్‌ ఆదేశించారు. వార్డు యూనిట్‌గా పట్టణ ప్రగతి జరగాలని, ప్రతి వార్డుకు ఒక ప్రత్యేక అధికారిణి నియమించాలని, పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల వారీగా చేపట్టాల్సిన పనులను మొత్తం పట్టణంలో చేయాల్సిన పనులను గుర్తించాలన్నారు. నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు తమ తమ వార్డులలో యువజనులు, మహిళలు, వయోజనులతో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, వార్డు కమిటీలు సమావేశమై నగరంలో పారిశుధ్యం, చెట్లు నాటడం, నీటి సరఫరా, వీధి దీపాలు వంటి ప్రాధాన్యతాంశాలపై చర్చించి పనులను  గుర్తించి పూర్తి చేయాలన్నారు. ఆస్థిపన్ను, ఇంటి పన్ను, నీటి పన్ను, వ్యాపార పన్నులను త్వరితగతిన వసూలు చేయాలని తెలిపారు. 


పట్టణ ప్రణాళిక, నగర ప్రణాళిక రూపొందించాలన్నారు. మానవ నివాసము కోసం కొత్త ప్రాంతాల ప్రణాళిక అభివృద్ధి, వినియోగించిన భూమి క్రమబద్ధీకరణ, భవనముల నిర్మాణము, ఉద్యానవనముల, పచ్చని ప్రాంతాల, వినోద ప్రాంతాల ఏర్పాటు, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌ క్రమబద్ధీకరణ, భూములు, భవనముల సర్వే, రోడ్లు, మురుగు కాలువల వంతెనల నిర్మాణం, ప్రజారోగ్యం, పారిశుధ్యం, బహిరంగ మల విసర్జన నిర్మూలన, స్త్రీలకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం, అంటు వ్యాధుల నిర్మూలన, నియంత్రణ పనులను చేపట్టాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్లు అందరూ నూతన మున్సిపల్‌ యాక్టును సమగ్రంగా అవగాహన చేసుకొని తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ తెలిపారు. అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, శిక్షణ కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి, వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపల్‌ కమిషనర్లు విజయానంద్‌, మీనన్‌, దేవేందర్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. 


logo