మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 15, 2020 , 23:42:39

ఎన్నికలు ఏవైనా గులాబీదే విజయం

ఎన్నికలు ఏవైనా గులాబీదే విజయం
  • ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీ పార్టీదే
  • కాంగ్రెస్‌, వామపక్షాలకు కోలుకోలేని దెబ్బ
  • అభివృద్ధి, సంక్షేమ పథకాలే ప్రధానాస్ర్తాలు
  • ఖమ్మం ఖిల్లాలో ప్రతిపక్షాలు ఖల్లాస్‌
  • ‘సహకారం’లోనూ తిరుగులేని సత్తా

(ఖమ్మం, నమస్తే తెలంగాణ)సహకార సంఘాల ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 76 ప్రాథమిక సహకార సంఘాలుండగా నామినేషన్ల ఉపసంహరణ నాటికే 34 సంఘాలను ఏకగ్రీవంగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మిగిలిన 42 సంఘాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకొని మరో సువర్ణ అధ్యాయానికి నాంది పలికింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికలోనూ టీఆర్‌ఎస్‌ విజయదుందుభి మోగించింది. ప్రజలు టీఆర్‌ఎస్‌కు దన్నుగా నిలిచారు. మొదటి దఫాలో అందించిన అద్భుత ప్రజాపాలన ఫలితాలను మరింత హెచ్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. విజయ శేఖరుడై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నలుదిశలా తన అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టంకడుతూ ప్రతిపక్షాలను పాతాళానికి నెట్టివేశారు. 


టీఆర్‌ఎస్‌దే విజయం..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌ వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటర్లు కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి వైపు కారు వేగాన్ని పెంచారు. తాజాగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో కూడా అదే ఒరవడిని కొనసాగించారు. ఎన్నిక ఏదైనా సరే టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరు మీద నడకేనన్నట్లుగా తీర్పులిచ్చారు. 2014 నుంచి జరుగుతున్న ఎన్నికలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పుడు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీయే విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికకు, ఎన్నికకూ పార్టీ మరింత బలపడుతూ వస్తున్నది. పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదులో కూడా రికార్డును నమోదు చేసింది. అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసుకొని భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ రాజకీయ పార్టీగా అవతరించింది. 2001లో జలదృశ్యంలో అతికొద్ది మందితో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) అంచెలంచెలుగా అవతరిస్తూ జాతీయ, ఇతర ప్రాంతీయ పార్టీలకు దీటుగా ఎదిగింది. 


ప్రతిపక్షాలు ఖల్లాస్‌..

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతి పక్ష పార్టీలు ఖల్లాస్‌ అయ్యాయి. జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థలు, మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఉనికి కోసం పోటీచేశాయే తప్ప ప్రజల ఆదరణ పొందడానికి కాదు. అందుకే టీఆర్‌ఎస్‌ ప్రవాహంలో కనుచూపు మేరలో కూడా లేకుండా కొట్టుకుపోయాయి. సహకార ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలు ఐక్యంగా పోటీ చేసినప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీనే ప్రజలు ఆదరించారు. ప్రతి ఎన్నికల్లోనూ సిద్ధాంతాలను గాలికి వదిలి కూటమిగా జతకట్టిన ప్రతిపక్ష పార్టీలు గులాబీ పార్టీ దెబ్బకు తమ ఉనికిని కోల్పోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 584 గ్రామ పంచాయతీల్లో 80 శాతం పంచాయతీలను టీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు గెలుచుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ అందుకుంది. ఆ పార్టీ విజయయాత్ర ముందు ప్రతిపక్ష పార్టీల పాత్ర నామమాత్రమైంది. 


20 ఎంపీపీ స్థానాల్లో 18 ఎంపీపీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 20 జడ్పీటీసీ స్థానాలకుగాను 17 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది, ఖమ్మం జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను రెపరెపలాడించింది. గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలు నామమాత్రపు సీట్లకే  పరిమితమయ్యాయి. బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు. డిపాజిట్‌ కూడా దక్కలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి రాబోయే రోజుల్లో తమదే అధికారమని బాజాలు మోగించిన ఆ పార్టీ జిల్లాలో కనీసం బోణీ కూడా కొట్టలేదు. సీపీఐ కూడా ఒక్క స్థానమూ గెలుచుకోలేకపోయింది. మధిర, వైరా నియోజకవర్గాల్లో గట్టి పోటీనే ఇస్తామంటూ సీపీఎం మాటలు చెప్పినప్పటికీ కారు స్పీడును తాళలేకపోయింది. జిల్లాలో కారు వేగానికి జాతీయ పార్టీలు దాదాపుగా  కనుమరుగయ్యాయి. వామపక్ష పార్టీలూ ప్రజల్లో తమ చిరునామాను నిలబెట్టుకోలేకపోయాయి.


ప్రజల హృదయాల్లో పదిలంగా టీఆర్‌ఎస్‌ 

జిల్లాలో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను విజయ తీరాలకు చేర్చిన ప్రజలు ఆ పార్టీని తమ హృదయాల్లో పదిల పర్చుకున్నారు. అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షాన నిలబడి గులాబీ జెండాను గుండెలకు అద్దుకొని ప్రతిపక్షాల వెన్నులను విరిచారు. గత నెలలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మూడు మున్సిపాలిటీలనూ కైవసం చేసుకోవడంతో జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. ప్రస్తుత సహకార ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌కు రైతులు పట్టం కట్టారు. నాడు జిల్లాలోని కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, టీడీపీలకు కంచుకోటలుగా ఉన్న చోట్ల నేడు అప్రతిహత విజయం సాధించి టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా అవతరించింది.

 

అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్ర్తాలు..

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఎన్నికల్లో ప్రధాన అస్ర్తాలుగా నిలిచాయి. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్‌ కిట్‌ వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడటంతో ఓటర్లు ప్రభుత్వ పథకాలకు ఆకర్షితులయ్యారు. అంతేకాకుండా రైతులందరికీ ప్రయోజనం చేకూరే సీతారామ ప్రాజెక్టు నిర్మాణం, భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌, దుమ్ముగూడెం బరాజ్‌ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధుల కేటాయింపు వంటి ప్రాజెక్టులు రైతులను ఆకర్షించాయి.. దీంతో టీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులకే ఓటర్లు పట్టం కట్టారు. ప్రతీ ఇంటికీ ప్రభుత్వ పథకాలు అందించడం టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమనుకొని ఓటర్లు ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించారు. అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీయే గెలవాలని మరోసారి రుజువు చేశారు. 


ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహం   

జిల్లాలో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్లో గెలుపొందడానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సారథ్యంలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు పకడ్బందీగా వ్యూహాలను రచించారు. ఆయా సహకార సంఘాల పరిధిలోని ప్రజాప్రతినిధులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. 


logo
>>>>>>