మంగళవారం 07 జూలై 2020
Khammam - Feb 15, 2020 , 23:40:43

సహకార ఎన్నికలు @ 87.55 శాతం

సహకార ఎన్నికలు @ 87.55 శాతం
  • ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
  • నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక
  • అత్యధికం నాగులవంచ, అత్యల్పం కల్లూరు
  • 363 డైరెక్టర్ల స్థానాలకు 784 మంది పోటీ
  • ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్‌

ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 15 :జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డైరెక్టర్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సరాసరి 87.55 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం 76 సొసైటీలకుగాను శనివారం 42 సొసైటీల పరిధిలోని 363 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో 784 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు పొలింగ్‌ ప్రశాంతంగా కొనసాగింది. ఉదయం 8 గంటల వరకు కేవలం 8 శాతం మాత్రమే పోలింగ్‌ శాతం జరిగింది. 9 గంటలకు 23 శాతం, 10 గంటలకు 47 శాతం, పోలింగ్‌ నమోదు కాగా మధ్యాహ్నం ఓటింగ్‌ సమయం ముగిసే వరకు 88.55 శాతం నమోదు కావడం విశేషం. దాదాపు ప్రతి సొసైటీలో 70శాతం పైగానే ఓటింగ్‌ నమోదు అయ్యింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన 42 సొసైటీలకు గాను మూడు డిస్ట్రిబ్యూట్‌ కేంద్రాలు ఏర్పాటు చేసిన జిల్లా ఎన్నికల అధికారులు సదురు కేంద్రాలకు ఇన్‌చార్జులను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. 


జిల్లా సహకార సంఘాల అధికారి రాజేశ్వరశాస్త్రితో పాటు అధికారులు ఏ శ్రీనివాస్‌, జిల్లా ఉపాధి అధికారి శ్రీరాం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టారు. ప్రతి గంట గంటకు ఏఏ పోలింగ్‌ బూత్‌లలో ఎంత మేర పోలింగ్‌ శాతం నమోదయ్యింది.. తాజా పరిస్థితులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు చేరవేశారు. ఎలాంటి సాంకేతిక, ఇతర సమస్యలు ఎదురు కాకుండా ఆయా సొసైటీల ఎన్నికల అధికారులు, రూట్‌ ఆఫీసర్లు, జోనల్‌ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలను సైతం ఆయా రాజకీయ పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు స్పష్టంగా తెలిసింది. పోలింగ్‌ బూత్‌లకు సమీపంలో వారు ప్రత్యేక టెంట్లు వేసుకొని ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం జరిగింది. మరికొన్ని సొసైటీలలో ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల దగ్గరికి తీసుకవచ్చిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఎన్నికలలో పురుషులతో పాటు మహిళలు, వృద్ధులు సైతం భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


 అత్యధికం నాగులవంచ.. అత్యల్పం కల్లూరు 

మొత్తం 42 సొసైటీల పరిధిలో ఎన్నికలు జరగగా, మధిర నియోజకవర్గంలోని నాగులవంచ సొసైటీ పరిధిలో మొత్తం 12 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో 1,428 మంది ఓటర్లు ఉండగా, 1,395 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 97.69 శాతం ఓట్లు పోలయ్యాయి. అదే విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు సొసైటీలో నాలుగు వార్డులకు ఎన్నికలు జరిగాయి. వీటి పరిధిలో మొత్తం 1,016 మంది ఉండగా, కేవలం 767 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో ఒక్కడ 75.49శాతం మాత్రమే పోలింగ్‌ నమోదయ్యింది. 24 సొసైటీల పరిదిలో 90శాతం పైగా ఓటింగ్‌ నమోదు కాగా, మిగిలిన 18 సొసైటీల్లో 75 నుంచి 90 శాతం చొప్పున పోలింగ్‌ నమోదు అయినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. 


 నేడు చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

డీసీసీబీ పరిధిలోని  76 సొసైటీలకు సంబంధించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఆదివారం ఆయా సొసైటీ కార్యాలయాల్లో జరుగుతోంది.  ఏకగ్రీవంగా ఎన్నిక కాని పక్షంలో పరోక్ష పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎంపిక జరగనుంది. సొసైటీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపికకు ఆయా సొసైటీల్లో కోరం సరిపడా ఉంటేనే ఎన్నికలు జరగనున్నాయి. లేని యెడల మరుసటి రోజుగానీ, ఆ తరువాత రోజు గానీ మరోమారు ఎన్నిక కోసం ఎన్నికల అధికారి తేదీని ఖరారు చేయనున్నారు. పరోక్ష పద్ధతిలోనే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఎన్నుకోవాలని సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయితే పోలింగ్‌ అధికారి మరోమారు అదే రోజున  పోలింగ్‌ ప్రక్రియ చేపడతారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు చైర్మన్‌ , వైస్‌ చైర్మన్‌ పదవి కోసం పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. అనంతరం పరిశీలన తరువాత ఉపసంహరణకు సైతం గడువు ఇస్తారు. అనంతరం సభ్యుల సూచనల మేరకు బ్యాలెట్‌ పద్ధతిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎంపిక ప్రక్రియ చేపట్టడం జరుగుతుంది.


logo