శుక్రవారం 10 జూలై 2020
Khammam - Feb 14, 2020 , 23:08:41

బీటీపీఎస్‌ పనులు శరవేగంగా..

బీటీపీఎస్‌ పనులు శరవేగంగా..

అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక సరిహద్దు ప్రాంతంలో నిర్మిస్తున్న 1080(4x270) మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తికి అత్యంత వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే యూనిట్‌-1,2,3లో లైటప్‌ విజయవంతంగా నిర్వహించారు. ఇదే స్ఫూర్తిగా యూనిట్‌-1లో సింక్రనైజేషన్‌ పూర్తి చేసిన అధికారులు సీవోడీకి సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలో యూనిట్‌-1లో విద్యుత్‌ ఉత్పత్తి అయ్యేలా జెన్కో అధికారులు పక్కా ప్రణాళికతో పనులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పనులు అన్ని కీలక దశకు చేరుకున్నాయి. మణుగూరు ఏరియా మల్లెపల్లి ఓసీపీ వద్ద నుంచి బీటీపీఎస్‌కు బొగ్గు సరఫరాను కూడా రోడ్డు మార్గంలో లారీల ద్వారా ప్రారంభించారు. భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు ప్రతీ రోజు 13 వేల టన్నుల బొగ్గు అవసరం ఉంటోంది. సింగరేణి సంస్థ బొగ్గును జెన్కోకు సరఫరా చేయనుంది. అసవరమైన బొగ్గును తొలుత రోడ్డు మార్గం ద్వారా ఆ తర్వాతా రైలు మార్గం ద్వారా తరలించనున్నారు. ఇప్పటికే రైల్వేలైన్‌ కోసం సర్వే పూర్తి కాగా, భూసేకరణ ప్రక్రియ కోసం ఎస్‌ఈఎస్‌ సర్వే నిర్వహిస్తున్నారు. బీటీపీఎస్‌కు అవసరమైన బొగ్గును మణుగూరు ఏరియా పీకేఓసీ-4, మణుగూరు ఓసీల నుంచే సరఫరా చేస్తున్నారు. మణుగూరు ఏరియా నుంచి బీటీపీఎస్‌కు 16 కీమీ దూరం ఉంది. ఇటీవల మణుగూరు ఏరియా మణుగూరు మల్లెపల్లి ఓసీపీ నుంచి బొగ్గు సరఫరా ప్రారంభమైంది. మణుగూరు ఏరియాలో ఇందుకు అవసరమైన బొగ్గు నిల్వలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం 2వేల టన్నుల బొగ్గు ప్రతి రోజూ సరఫరా చేసుకుంటున్నారు. 15 నుంచి మరింతగా బొగ్గు సరఫరా పెంచనున్నారు. ఈ ప్లాంట్‌ నిర్మాణంలో భెల్‌, జెన్కో అధికారులు 24 గంటలు పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉంటున్నారు. అనుకున్న సమయానికి పవర్‌ ప్లాంట్‌ పూర్తే లక్ష్యంగా టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఎప్పటికప్పడు ప్లాంట్‌ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. జెన్కో డైరెక్టర్‌ (ప్రాజెక్టు) ఎం సచ్చితానందం, డైరెక్టర్‌(సివిల్‌) ఎ. అజయ్‌ పర్యవేక్షణలో బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు ఆధ్వర్యంలో జెన్కో. భెల్‌ అధికారులు విద్యుత్‌ ప్లాంటు నిర్మాణ పనులను వేగవంతం నిర్వహిస్తున్నారు. 


అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో.. 

భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో సత్వర విద్యుదుత్పత్తితోపాటు ప్లాంట్‌ నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. దీని కోసం జెన్కో సంస్థ అదనంగా రూ. 680 కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ అదనపు వ్యయాన్ని ఫ్లూగ్యాస్‌ డీ సల్ఫరైజ్‌షన్‌(ఎఫ్‌జీడీ) వ్యవస్థ ఏర్పాటుకు వినియోగంచారు. ఈ ప్రాజెక్టు పనులతోపాటే దీని నిర్మాణమూ ఏకకాలంలో కొనసాగుతుంది. విద్యుత్పత్తి ప్రారంభమయ్యాక చిమ్ని నుంచి యాసిడ్‌ ఆకాశంలోకి చేరుతుంది. ఈ యాసిడ్‌ తీవ్ర స్థాయిలో వెదజల్లకుండా తగ్గించేందుకు వినియోగించే కొత్త సాంకేతిక పరిజ్ఞానమే ఫ్లూ గ్యాస్‌ డీసల్ఫరైజేషన్‌(ఎఫ్‌జీడీ)ఈ నిర్మాణాన్నీ కాంట్రాక్టు సంస్థ భెల్‌ చేపడుతోంది. బొగ్గు బూడిద (ధూళి కణాలు)చిమ్నీ నుంచి ఫ్లూ గ్యాస్‌ సల్ఫర్‌ రూపంలో బయటకు వస్తాయి. ఈ సమయంలో ఫ్లూ గ్యాస్‌ సల్ఫర్‌ 30 మైక్రాన్లకు తగ్గకుండా ఉండేందుకు జెన్‌కో సంస్థ ఇంత వ్యయాన్ని అదనంగా ఖర్చు చేయనుంది. ఎఫ్‌జీడీ ద్వారా విద్యుత్‌ కేంద్రంలోని ధూళి కణాల ప్రభావం చుట్టు పక్కల ప్రాంతాలపై తక్కువగా ఉంటుంది. 


విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు 

ప్రక్కా ప్రణాళికతో పనులు..

ఈ ఏడాదిలోనే ఇక్కడ 4 యూనిట్ల నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు జెన్‌కో పక్కా ప్రణాళికలతో ఉంది. అందుకు తగ్గటుగానే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే యూనిట్‌-1,2,3లో లైటప్‌ విజయవంతంగా నిర్వహించారు. ఇదే స్ఫూర్తిగా యూనిట్‌-1లో సింక్రనైజేషన్‌ పూర్తి చేసిన అధికారులు సీవోడీకి సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ప్రణాళిక రూపొందించుకున్నారు. ఈ ఏడాది 4 యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. అంతా అనుకున్నుట్లు జరిగితే ఈ నెలలో, మార్చి, ఏప్రిల్‌ వరుసగా మూడు యూనిట్లనుంచి విద్యుత్తును ఉత్పత్తి చేసి రాష్ట్ర అవసరాలకు వినియోగించుకున్నారు. ఆ వెంటనే యూనిట్‌-4నుంచి కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. యాష్‌ పాండ్‌ నిర్మాణం కోసం విద్యుత్తు కేంద్రం వెలుపల 427 ఎకరాల్లో రూ 46 కోట్లతో దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన నీటిని గోదావరి నుంచి వినియోగించనున్నారు. 

మండలంలోని కొడాయిగూడెం వద్ద నుంచి విద్యుత్‌ ప్లాంట్‌కు రావాల్సిన గోదావరి నీటిని సరఫరా చేసేందుకు 6.21 ఎకరాల్లో రూ.139 కోట్లతో ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి . ఈ నెలలో ఇన్‌టేక్‌ వెల్‌ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 6 లక్షల క్యూబిక్‌ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో 6.2 ఎకరాల కుంటలో  రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే స్వీచ్‌ యార్డ్‌ నిర్మాణ పూర్తి కాగా ఛార్జింగ్‌ పనులు కూడా నిర్వహించారు. బీటీపీఎస్‌లో అన్ని రకాల పనులు షెడ్యూల్‌ ప్రకారం జరుగతున్నాయి. 4కూలింగ్‌ టవర్లు, రెండు చిమ్నిలు, 4 బాయిలర్లు పూర్తయ్యాయి. ఇక్కడ ఉద్యోగల నివాస గృహాలను 225 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఆందుకోసం త్వరలోనే టెండర్లు ఆహ్వానించనున్నారు. 


వేగంగా పనులు పూర్తయ్యేలా చర్యలు.. 

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు పక్కా ప్రణాళికతో కొనసాగుతున్నాయి. అనుకున్న సమయానికి పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టేలా పక్కా ప్రణాళికతో పనులు వేగవంత చేస్తున్నాం. అన్ని రకాల పవర్‌ ప్లాంట్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 21 ఏజెన్సీలు పనులు నిర్వహిస్తున్నాయి. సుమారు 3500మంది ప్లాంట్‌ నిర్మాణంలో పని చేస్తున్నారు. నిరంతరం పనులను పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అనుకున్న సమయానికి పవర్‌ ప్లాంట్‌ పూర్తే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం. జెన్కో, భెల్‌ తరుపున సుమారు 400 మంది ఇంజినీర్లు పని చేస్తూ పనులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అందరం పనులు త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో శ్రమిస్తున్నాం. ఇటీవల టీఎస్‌ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్లాంట్‌ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పనులు మరింత స్పీడ్‌గా జరుగుతున్నాయి. మణుగూరు ఓసీ నుంచి బొగ్గు సరఫరా జరుగుతుంది. ఏంవోఈఎఫ్‌ నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తూ బొగ్గు రవాణా చేసుకుంటున్నాం. రోడ్డు ట్రాన్స్‌ పోర్టు అయ్యే మార్గంలో పర్యావరణ పరిరక్షణకు తప్పని సరిగా చర్యలు తీసుకుంటున్నాం.

-బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు 


logo