బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Feb 14, 2020 , 23:07:26

అనుమతులు నిల్‌.. వ్యాపారం ఫుల్‌..

అనుమతులు నిల్‌.. వ్యాపారం ఫుల్‌..

రఘునాథపాలెం: ఖమ్మం అర్బన్‌ పరిధి రామన్నపేట ప్రాంతం అక్రమ ఇటుక బట్టీలకు అడ్డాగా తయారైంది. రామన్నపేట చుట్టు పక్కల వ్యవసాయ పొలాలన్నీ ఇటుక బట్టీలకు వేదికలయ్యాయి. రామన్నపేటను అక్రమ సంపాదనకు నిలయంగా మార్చుకొని వ్యాపారులు బట్టీలను నెలకొల్పి రూ.కోట్లు గడిస్తున్నారు. బట్టీల నిర్వహణలో నిబంధనలను పాతరేసి ప్రభుత్వ పన్నుకు ఎగనామం పెడుతున్నారు. బట్టీల నిర్వహణతో పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్నది. చెరువు మట్టిని అక్రమంగా తరలించి బట్టీల్లో గుట్టలు గుట్టలుగా నిల్వ చేసుకుంటున్నారు. కలప వాడకంతో చెట్లు నరికివేతకు గురవుతున్నాయి. విద్యుత్‌ చౌర్యానికి గురవుతోంది. పట్టించుకోవాల్సిన సంబంధిత శాఖాధికారులు అటుగా కన్నెత్తి చూడటం లేదు. రామన్నపేట చుట్టు పక్కల పొలాల్లో ఎక్కడ పరిశీలించినా పదుల సంఖ్యలో ఇటుక బట్టీలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

ఖమ్మం అర్బన్‌ రెవెన్యూ పరిధి రామన్నపేటలో ఇటుక బట్టీల వ్యాపారం జోరుగా కొనసాగుతోంది. ఎలాంటి అనుమతుల్లేకుండానే గుట్టుగా బట్టీలను ఏర్పాటు చేసి ఇటుకల తయారీని విచ్చలవిడిగా చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతులను మరిచి వ్యాపారాన్ని సాగిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. పేదల అవసరాలను ఆసరా చేసుకొని వారి భూములను ఏళ్ల తరబడి లీజుకు తీసుకొని ఇటుకల దందా సాగిస్తున్నారు. మైనింగ్‌, రెవెన్యూశాఖల మధ్య లోపించిన సమన్వయాన్ని క్యాష్‌ చేసుకుంటూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే బట్టీల నిర్వహణలో నిబంధనలకు గాలికొదిలేశారనే చెప్పవచ్చు. బట్టీ ఇటుకలను వరిపొట్టుతో కాల్చాలనే నిబంధన ఉన్నా.. కలపను వినియోగిస్తున్నారు. ఫలితంగా చుట్టు పక్కల ప్రాంతాల్లో చెట్ల ఆనవాళ్లు లేకుండా పోతున్నాయి. బట్టీల నిర్వహణతో ప్రభుత్వానికి చెల్లాంచాల్సిన సెస్సుకు ఎగనామం పెడుతున్నారు. నిబంధనలకు పాతరేసి ఏళ్ల తరబడిగా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగుతున్నా అటుగా కన్నెత్తి చూసే అధికారి కరువయ్యాడు. 

గుట్టలుగుట్టలుగా చెరువు మట్టి నిల్వలు..

రామన్నపేటలో అక్రమంగా సాగుతున్న ఇటుక బట్టీలో ఏ బట్టీని పరిశీలించినా ప్రస్తుతం చెరువు మట్టి గుట్టలుగుట్టలుగా కనిపిస్తోంది. బట్టీల నిర్వహణ కారణంగా చుట్టు పక్కల ఉన్న చెరువులు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. రాత్రికిరాత్రి వ్యాపారులు చెరువు మట్టి తోలకాలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ అందస్తుండగా ఇటుక బట్టీల నిర్వహకులు తమ వ్యాపారానికి ఈ విద్యుత్‌నే వాడకుంటున్నారు. దీనిపై ట్రాన్స్‌కో అధికారులు పట్టించుకోకపోవడంపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో బట్టీల నిర్వహణ ఓ పక్క పర్యావరణానికి విఘాతం కలిగిస్తుండగా..ట్రాన్స్‌కోనూ నిండా ముంచుతున్నాయి. కలపతోనే బట్టీలను కాలుస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇస్తున్న విద్యుత్‌తోనే బోరు బావులను వినియోగిస్తున్నారు. కొన్నిచోట్ల విద్యుత్‌ తీగలకు వైర్లు తగిలించి ఆక్రమంగా విద్యుత్‌ను వాడుకుంటున్నారు. ఏళ్ల తరబడిగా కొనసాగడంతో విద్యుత్‌శాఖకు తీరని నష్టం వాటిల్లుతోంది. ఆ శాఖాధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరం. 

పనుల్లో ఒడిషా కార్మికుల పిల్లలు..

పొట్ట చేత పట్టుకొని ఒడిషా నుంచి వచ్చిక కార్మికులు బట్టీల మాటులన శ్రమ దోపిడీకి గురౌతున్నారు. కార్మికుల బిడ్డలు సైతం చదువులకు దూరమై వారి పసిప్రాయం బట్టీల్లోనే మసవుతోంది. ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసి వలస కూలీలకు విద్యాబుద్ధులు చెప్పించాల్సిన అధికారులు బాధ్యతను విస్మరిస్తున్నారు. ఫలితంగా బాల్యం బట్టీల్లోనే బుగ్గిపాలవుతోంది. నిర్వాహకుల స్వార్థం మూలంగా అభంశుభం తెలియని అమాయక చిన్నారులు ఇటుక బట్టీల్లోనే పని చేయాల్సి వస్తోంది.


logo
>>>>>>