శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 14, 2020 , 23:05:02

పదిలో ‘ఇరవై’ పై నిశిత పరిశీలన..

పదిలో ‘ఇరవై’ పై నిశిత పరిశీలన..

ఖమ్మం ఎడ్యుకేషన్‌: విద్యార్థిలోని ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయడానికి పరీక్షలతో పాటు సీసీఈ విధానంలో పలు అంశాలపై మేధస్సును పరీక్షిస్తున్నారు. దీనిలో భాగంగా పాఠశాల స్థాయిలో పదో తరగతి విద్యార్థులకు 20 మార్కులను ఇంటర్నల్‌గా కేటాయిస్తున్నారు. ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా విద్యార్థికి మార్కులు కేటాయిస్తారు. వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నాపత్రాన్ని అందజేస్తారు. ఈ పద్ధతులను కొందరు తమకు అనుకూలంగా మార్చుకోగా, మరికొందరు వ్యాపారాన్ని జోడించారు. వార్షిక పరీక్షల్లో ఏ గ్రేడ్‌ స్థ్ధాయిలో సత్తా చాటలేని విద్యార్థికి సైతం 19కి పైగా మార్కులు కేటాయించడం కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో జరుగుతుండగా, కొందరు ఉపాధ్యాయులు విద్యార్థి రాసిన సమాధాన పత్రాలు వాల్యుయేషన్‌ చేయకుండానే మార్కులు కేటాయించిన సంఘటనలు ఉన్నాయి. వీటి నేపథ్యంలో విద్యార్థికి సంబంధించిన 20 మార్కుల విషయంలో మార్కులు ఎక్కువ లేదా తక్కువ కాకుండా ఉండేందుకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో 17వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేయనున్నాయి.

సబ్జెక్ట్‌ నిపుణుల పరిశీలన.. 

తనిఖీలకు వెళ్లిన అధికారుల బృందంలో ముగ్గురు సబ్జెక్ట్‌ నిపుణులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్ట్‌ ఆధారంగా ప్రతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్‌ మార్కులను పరిశీలిస్తారు. సంబంధిత మార్కుల ప్రొఫార్మాను పోల్చుతూ విద్యార్థి రాసిన సమాధాన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో సరిచూస్తారు. దీంతో పాటు విద్యార్థి రాసిన సమాధానాలను ఉపాధ్యాయులు సరిగ్గా మార్కులు వేశారా? తప్పులు ఏమైనా దొర్లాయా?  ఏమైనా ప్రభావితం జరిగిందా? అనే కోణంలోనూ పరిశీలిస్తారు. ఆ సమయంలో ఉన్న సందేహాలకు అనుగుణంగా సమాధాన పత్రాలతో పాటు విద్యార్థికి సంబంధించి హాజరు పట్టికను, ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను పరిశీలిస్తారు. సబ్జెక్ట్‌ నిపుణులు పరిశీలించిన వాటిలో హెచ్చుతగ్గులు ఉంటే సంబంధిత బృంద నాయకుడికి వివరిస్తారు. తనిఖీల్లో లోపాలుంటే నివేదికను సంబంధిత తనిఖీ కన్వీనర్‌ డీసీఈబీ సెక్రెటరీ ద్వారా డీఈఓకి అందజేస్తారు.

ఎంఈఓల ఆధ్వర్యంలో.. 

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్‌ మార్కులు తనిఖీలను మండల విద్యాశాఖాధికారులు సమన్వయం చేసుకోనున్నారు. మండల విద్యాశాఖాధికారుల సూచించిన విధంగా ఆయా బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నాయి. యాజమాన్యాల వారీగా ఎయిడెడ్‌ 7 స్కూల్స్‌-86 మంది, బీసీ వెల్ఫేర్‌ రెండు -103 మంది, ప్రభుత్వ 21 స్కూల్స్‌ 1361 మంది, ఐటీడీఏ ఏడు-316 మంది, కేజీబీవీలు 13 స్కూల్స్‌-486 మంది, టీఎస్‌ఎంఎస్‌ రెండు-186 మంది, ప్రైవేట్‌ 167 స్కూల్స్‌-7536 మంది, టీఎస్‌ఆర్‌ఎస్‌ రెండు-157 మంది, టీ ఎస్‌డబ్యూర్‌ఈఎస్‌ ఏడు-554 మంది, జిల్లా పరిషత్‌ 188 స్కూల్స్‌-7175 మంది మొత్తం 17,960 మంది పది పరీక్షలకు హాజరుకానున్నారు. 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు రోజుకు రెండు స్కూల్స్‌ చొప్పున 416 పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నారు. బృందాలకు అనుగుణంగా ఒక్కో టీమ్‌కు 10 నుంచి 13వరకు స్కూల్స్‌ను కేటాయించారు. ఒకే ప్రాంతంలో ఉండి దగ్గరగా ఉన్న స్కూల్స్‌ అయితే రోజుకి మూడు చేసేలా సూచనలు చేశారు. 

జిల్లాలో 51 బృందాలు.. 

ఇంటర్నల్‌ మార్కుల తనిఖీలకు సంబంధించి నిపుణులైన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఇంటర్నల్‌ మార్కుల ప్రక్రియలో పాల్గొనేందుకు ఖమ్మంలో 51 బృందాలను నియమించారు. ప్రతి బృదానికి ఒక సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు నాయకత్వం వహిస్తారు. వారి ఆధ్వర్యంలో ప్రతీ బృందానికి ముగ్గురు సబ్జెక్ట్‌ ఎక్స్‌ఫర్ట్‌లను నియమించారు. తెలుగు, హిందీ సబ్జెక్ట్‌లకు ఒకరు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్ట్‌లకు ఒకరు, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్ట్‌లకు ఒకరు చొప్పున నియమించారు. వీరికి కేటాయించిన సబ్జెక్ట్‌ ఆధారంగా పాఠశాలలో తనిఖీలు చేస్తారు. తనిఖీలు ఎలా చేయాలి, ఏఏ అంశాలు ప్రాతిపదికన పరిశీలించాలనే వాటిపై మండల స్థ్ధాయిలో సమావేశం నిర్వహిస్తున్నారు. తనిఖీల సమయంలో సందేహాలున్నా, విధులకు సంబంధించిన సమాచారాన్ని డీసీఈబీ సెక్రెటరీ కనపర్తి వెంకటేశ్వర్లుకు అందజేస్తారు. తనిఖీలకు డీసీఈబీ సెక్రెటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రోజు వారి తనిఖీల సమాచారాన్ని డీఈఓకి డీసీఈబీ సెక్రెటరీ నివేదిస్తారు.


logo