శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Khammam - Feb 14, 2020 , 23:04:14

సొసైటీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

సొసైటీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

చింతకాని: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పల్లెల్లో  ఓటర్లందరూ  సహకరించాలని, శనివారం సొసైటీ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని వైరా ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. స్ధానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పాత్ర పోషిస్తూ పోలీస్‌ సిబ్బంది నిబద్ధతతో పనిచేశారని, వైరా డివిజన్‌ పరిధిలో 17 పీఏసీఎస్‌ స్థానాలకు జరుగబోయే ఎన్నికల్లో సైతం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఒక్కో మండలానికి ఎస్‌ఐ అధికారి గ్రామాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారని, పోలింగ్‌ కేంద్రాల సమీపంలో గుంపులుగా ఉండకూడదని, ఓటర్లందరూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ ప్రతీఒక్కరూ తమకు కేటాయించిన  విధులను సమయస్ఫూర్తితో సరిగా నిర్వర్తించాలని తెలిపారు. 17 సహకార సంఘాల్లో జరుగనున్న ఎన్నికలలో 260 మంది సిబ్బందికి విధులు కేటాయించామని, అతిసమస్యాత్మక గ్రామాలు 62, సమస్యాత్మక గ్రామాలు 51, సాధారణ పంచాయతీలు 43, ఇబ్బందికర పంచాయతీలు 14గా ఉన్నాయని, ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్‌ఐలు, 47 మంది హెడ్‌కానిస్టేబుల్‌, 112 మంది కానిస్టేబుల్‌, 19ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, టీఎస్‌ఎస్పీ, హోంగార్డులతో పటిష్ట ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ సదస్సులో సీఐ వసంత్‌కుమార్‌, ఎస్‌ఐ రెడ్డిబోయిన ఉమ, పీఏసీఎస్‌ సీఈవోలు, ఆయా రాజకీయ పక్షాల నాయకులు ఉన్నారు.

స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలి...

చింతకాని: పీఏసీఎస్‌ ఎన్నికల్లో ఓటుహక్కు కలిగిన రైతులు స్వేచ్చగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం సీసీఎస్‌ ఏసీపీ జహంగీర్‌ అన్నారు. చింతకాని, నాగులవంచ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రశాంత వాతావరణంలో సహకార సంఘాల ఎన్నికలు జరిగేలా తోడ్పడాలని, ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల అధికారులు పోలింగ్‌ ఏర్పాట్లు చేశారని ఆయన తెలిపారు. మండలవ్యాప్తంగా చింతకాని సొసైటీలో 12 వార్డులు, నాగులవంచ సొసైటీలో 12వార్డులకు గాను శనివారం ఎన్నిక జరుగనున్నదని, ఎన్నికల సిబ్బందితో పోలింగ్‌ ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే సమస్యాత్మక గ్రామాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారని తెలిపారు. శనివారం సాయంత్రం కల్లా డైరక్టర్‌కు పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఆయన వెంట ఖమ్మం టౌన్‌ సీఐ రమేశ్‌, ఎస్‌ఐ ఉమ, ఎన్నికల. పోలీస్‌ సిబ్బంది తదితరులున్నారు. 


logo