శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 14, 2020 , 23:03:37

వీడిన హత్య మిస్టరీ

వీడిన హత్య మిస్టరీ

దుమ్ముగూడెం: ఐదు రోజుల క్రితం ఓ గిరిజనుడిని గొంతుకోసి హతమార్చిన సంఘటన కేసు మిస్టరీ వీడింది. మండలంలోని లచ్చిగూడెం గ్రామానికి చెందిన కారం రామకృష్ణను గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లో ప్రవేశించి నిద్రిస్తున్న సమయంలో గొంతుకోసి హతమారుస్తుండగా భార్య తులసీ అడ్డురావడంతో ఆమె చేతిని కూడా గాయపర్చిన సంఘటన పాఠకులకు విధితమే. ఈ హత్యకు సంబంధించి పోలీసులు నిందితుల కోసం గాలిస్తూ మండలంలోని గంగోలు గ్రామశివారులో దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై రతీష్‌ వాహనాలు తనిఖీలు చేస్తుండగా రెండు ద్విచక్రవాహనాలపై వస్తున్న ఆరుగురు వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని ఆపి విచారించగా విషయం బయటపడిందని భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్ర శుక్రవారం దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

భూమి కోసం పథకం ప్రకారం హత్య..

మండలంలోని లచ్చిగూడెంకి చెందిన కారం రామకృష్ణకు అదే గ్రామానికి చెందిన సోంది ముద్దరాజు, కుమారుడు రవిబాబులు మధ్య భూమికి సంబంధించి గొడవ ఉండటంతో ఎన్నిసార్లు చెప్పినా రామకృష్ణ వినడంలేదని, తనను హతమారిస్తే కానీ భూమి మనకు దక్కదనే ఉద్ధేశ్యంతో ఆ గ్రామానికి చెందిన పెద్దలు పెనుబల్లి భద్రయ్య, సోంది అర్జున్‌లు సైతం రామకృష్ణను చంపితే ఆ భూమి మీకు వస్తుందని ప్రోత్సహించారని, అందుకు రామకృష్ణను హతమార్చేందుకు పథకం ప్రకారం రూ.40వేలు ఇచ్చి అంగీకారం కుదుర్చుకున్నారు. ఈనెల 9న చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మైత గ్రామానికి రవిబాబు, చర్లకు చెందిన తన స్నేహితుడు సతీష్‌లు కలిసి వెళ్లి ఖర్చులకు రూ.2వేలు ఇచ్చి అదే రాత్రి 7 గంటల సమయంలో రవిబాబు, తండ్రి ముద్దరాజు, స్నేహితుడు సతీష్‌లు గుర్రాలబైలు బ్రిడ్జి వద్దకు వెళ్లి 9 గంటలకు కలుసుకుని ఎలా చంపాలనే దానిపై పథకం రూపొందించుకుని అర్ధరాత్రి లచ్చిగూడెంలోని ఇంట్లో నిద్రిస్తున్న రామకృష్ణను గొంతుకోశారు. ఆ సమయంలో భార్య తులసి నిద్రలేవడంతో ఆమెపై కూడా దాడిచేశారు. దీంతో తన భర్తను చంపుతున్నారని పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచిపరారయ్యారని ఏఎస్పీ తెలిపారు. 

వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితులు..

లచ్చిగూడెంలో జరిగిన హత్య విషయాన్ని బయటకు తెలియనీయకుండా ఉండేందుకు గద్దమడుగు అటవీ పరిసర ప్రాంతంలో ఉంటూ శుక్రవారం చర్లలో గుంపెనగూడెంకు చెందిన పాయం సతీష్‌ ఇంటికి లచ్చిగూడెంకు చెందిన తండ్రీ కొడుకులు సోందే ముద్దరాజు, రవిబాబు, బంధువులు పొడియం నగేష్‌, పొడియం లచ్చు, పొడియం భద్రయ్య, పాయం సతీష్‌లు వెళ్తుండగా గంగోలు గ్రామశివారులో సీఐ ఆధ్వర్యంలో ఎస్‌ఐ వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఈ హత్య ఉదంతం బయటపడిందని, విచారణ చేపట్టగా వారితో పాటు ఈ హత్యకు ప్రేరేపించిన లచ్చిగూడెం గ్రామపెద్దలు పెనుబల్లి భద్రయ్య, సోంది అర్జున్‌లు కూడా ఉన్నట్లు తేటతెల్లమైందని, దీంతో హత్యకు కారణమైన ఆరుగురు వ్యక్తులతో పాటు హత్యకు ప్రేరేపించిన ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశామని ఏఎస్పీ తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను దర్యాప్తు చేసి కేసును చేదించిన సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రతీశ్‌, సిబ్బందిని ఆయన అభినందించారు. అనంతరం నిందితుల వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రెండు కత్తులు, ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో దుమ్ముగూడెం సీఐ ఎన్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ రతీశ్‌లు ఉన్నారు.


logo