శుక్రవారం 10 జూలై 2020
Khammam - Feb 13, 2020 , 23:40:09

అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతకే ప్రాధాన్యం

అభివృద్ధి, పచ్చదనం, 	పరిశుభ్రతకే ప్రాధాన్యం

ఖమ్మం, నమస్తే తెలంగాణ : గ్రామ స్వరాజ్యాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. పల్లె అభివృద్ధితోపాటు పట్టణాల అభివృద్ధి మన కర్తవ్యమన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  పథకాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి, అధికారులపై ఉందన్నారు. రెండు విడతలుగా నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైందని చెప్పారు. ఈ పల్లెప్రగతి పనుల్లో మన జిల్లా రాష్ట్రంలో నాల్గవ స్థానంలో ఉందని, మూడవ దశ పల్లె ప్రగతి నాటికి జిల్లాను  మొదటి స్థానంలో నిలపాలని మంత్రి అన్నారు. విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పాడుపడిన బావులు నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చివేయాలని, ఈ పనులన్నీ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో  జరగాలని మంత్రి అన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని, పల్లెల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ప్రతి నెలా రూ.339 కోట్లను గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుందన్నారు. పల్లె ప్రగతిలో మన జిల్లా నాల్గవ స్థానంలో ఉండటానికి కేవలం సర్పంచ్‌ల ప్రతిభతో పాటు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారుల కర్తవ్యం ప్రస్ఫూటంగా కనిపిస్తుందని కొనియాడారు. డంపింగ్‌యార్డుల నిర్మాణాలకు 2 లక్షల 50 వేలు, వైకుంఠధామాల నిర్మాణాలకు 12 లక్షల 50 వేల రూపాయలను ప్రభుత్వం కేటాయించిందని, ఈ పనులన్నీ వేసవిలోపు పూర్తి చేయాలని మంత్రి అన్నారు. జిల్లాలో గ్రామపంచాయతీలకు నూతన ట్రాక్టర్ల కొనుగోలులో కూడా మన జిల్లా ముందుందని, ఇప్పటికే 3 వందల ట్రాక్టర్లు కొనుగోలు చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా పల్లెలన్నీ పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లివిరుస్తున్నాయని, యవత్‌ భారత దేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని, దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు ఉచిత కరెంటుతో పాటు నిరంతరాయంగా 24 గంటలు కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని మంత్రి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కానుందని పేర్కొన్నారు. సంక్షేమ, అభివృద్ధి, పారిశ్రామిక రంగం, క్రమశిక్షణతో, శాంతి భద్రతల్లో మనం ముందున్నామని, అదే స్ఫూర్తితో పల్లెల అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలవాలన్నారు. ప్రభుత్వంలో ఏ ప్రజాప్రతినిధికి లేని చెక్‌ పవర్‌ కేవలం సర్పంచ్‌లకు మాత్రమే ఉందని వివరించారు. పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి సర్పంచ్‌ల రిజర్వేషన్‌ కాలపరిమితిని ప్రభుత్వం పొడగించిందని మంత్రి అన్నారు. రాబోయే 25 రోజుల్లో గ్రామాల అభివృద్ధి పనుల్లో మార్పురావాలి. పల్లె ప్రగతి పనులను తనిఖీ చేసేందుకు రాష్ట్రస్థాయి ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాలు జిల్లాలో పర్యటిస్తాయని చెప్పారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడ్తానని పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించిన గ్రామాలకు అవార్డులు, ప్రోత్సాహాకాలు ఉంటాయని అన్నారు. అదేవిధంగా పనుల పూర్తి చేయని గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు కూడా తప్పవని హెచ్చరించారు. 

జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన మొదటి, రెండవ విడత పల్లె ప్రగతి ద్వారా 95 శాతం పనులు చేపట్టాం. స్థానిక ప్రజా ప్రతినిధుల సహాకారంతో చేపట్టిన  పనులన్నింటిని పూర్తి చేసుకుంటున్నాం. పల్లె ప్రగతి పనులు నిరంతరాయంగా 365 రోజులు కొనసాగాలి.. దీనికి గాను పంచాయతీ కార్యదర్శులు తాము పనిచేసేచోట తప్పనిసరిగా నివాసముండాలని కలెక్టర్‌ అన్నారు. పల్లెల అభివృద్ధికి అవసరమైన వసతులన్ని కల్పించాం. ఇప్పటికే చేపట్టిన డంపింగ్‌యార్డులు, స్మశానవాటికలు, ఇంకుడు గుంతల పనులు త్వరగా పూర్తి చేయాలని, ప్రతి రోజు ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్త సేకరణ జరగాలన్నారు. నాటిన మొక్కల సంరక్షణ చేపట్టాలన్నారు. అర్బన్‌, రూరల్‌ లోకల్‌ బాడీస్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అడిషనల్‌ కలెక్టర్‌ను  నియమించిందని, వారు ప్రతిరోజు పనులను తనిఖీ చేస్తారని చెప్పారు. పల్లె ప్రగతిలో పూర్తి స్థాయిలో పనులు చేపట్టని గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అదేవిధంగా మంచిగా పనిచేసిన గ్రామాలకు జూన్‌-2, ఆగస్టు-15 సందర్భంగా అవార్డులు, ప్రోత్సాహకాలను  అందిస్తామని కలెక్టర్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా జిల్లాలో ఇంటింటికి శుద్ధ్దమైన గోదావరి జలాలను అందించేందుకు ప్రతి ఇంటికి నల్లా బిగించడం జరిగిందని, ఈ నల్లాలకు నష్టం కల్గించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ సర్పంచ్‌లకు తెలిపారు. ప్రజలు నీటి విలువ తెలుసుకోవాలని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రభుత్వం అందిస్తున్న మిషన్‌ భగీరథ జలాలను వృథా చేయరాదని కలెక్టర్‌ పేర్కొన్నారు. పంచాయతీరాజ్‌ చట్టం పట్ల సమగ్ర అవగాహన కలిగి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తమ బాధ్యతలను, విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్‌ తెలిపారు. 

మిషన్‌ భగీరథ నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు, బయట కొనుగోలు చేసి తాగే నీటి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై గ్రామీణ నీటి సరఫరా విభాగం వారు ప్రచురించిన గోడపత్రికను ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, శాసనసభ్యులు ఆవిష్కరించారు. 

రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ధనలక్ష్మీ, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా అటవీశాఖాధికారి ప్రవీణ, జిల్లా పంచాయతీ అధికారి కె. శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఇందుమతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కె. శ్రీనివాస్‌, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు తదితరులు సమ్మేళనంలో పాల్గొన్నారు. 


logo