ఆదివారం 29 మార్చి 2020
Khammam - Feb 13, 2020 , 01:14:38

తేలిన పశువుల లెక్క..

తేలిన పశువుల లెక్క..

ఖమ్మం వ్యవసాయం : జిల్లా వ్యాప్తంగా ఏఏ రకాల పశువులు ఎన్ని ఉన్నాయే దాదాపు తేలిపోయింది. ఇప్పటికే జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు ఇందుకు సంబంధించి తుది నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే  పశుగణన లెక్కను కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఆయా రకాల పశువుల నూతన గణాంకాల ప్రకారం వ్యాక్సిన్లు, మందుల పంపిణీ జరుగుతుంది.  చివరిసారిగా జిల్లాలో 2012 సంవత్సరంలో పశుగణన జరిగింది. అనంతరం 2017లో జరగాల్సిన పశుగణన జరగలేదు. 2018 సంవత్సరంలో  పశుగణన చేపట్టేందుకు గానూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే జిల్లాలో 2018 అక్టోబర్‌ 1 నుంచి పశుగణన ప్రక్రియ ప్రారంభమైంది. 2012 సంవత్సరం గణాంకాల ప్రకారం జిల్లాలో  పశువులు, జీవాలు, కోళ్లు, కలిపి 17,85 లక్షల ఉన్నాయి. గడిచిన  6 సంవత్సరాలలో ఎంత పశుఉత్పత్తి జరిగింది. అవసరమైన మేర పశువులు ఉన్నాయా అనేది తేల్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం పశగణనకు శ్రీకారం చుట్టింది. గత ఐదేళ్లతో పోల్చుకుంటే జిల్లాలో తెల్లజాతి పశువుల సంఖ్య కొంత మేర తగ్గింది.  నల్లజాతి, ఇతర జీవాల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీ గొర్రెల పథకం ద్వారార లక్షలాది గొర్రెలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సర్వే వివరాలను ఆదే రోజున ఆన్‌లైన్‌లో పొందుపరేందుకు గాను ఈ సంవత్సరం ట్యాబ్‌లను రాష్ట్ర పశుసంవర్థకశాఖ అందజేసింది. దాదాపు 6 నెలల పాటు  ఈ ప్రక్రియకు  కొనసాగింది.  ఈ ప్రక్రియ కోసం జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి 114 మంది ఎన్యూమరేటర్లు, మరో 28మంది సూపర్‌వైజర్లను నియమించారు. పశుగణన కోసం ఎంపిక చేసిన పర్యవేక్షకులకు రాష్ట స్థాయిలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఎన్యూమరేటర్లకు ట్యాబ్‌లను అందజేశారు. సేకరించిన డాటాను సదరు ఎన్యూమరేటర్లు ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో పొందుపరచి అనంతరం సదరు అధికారులు చేరవేశారు. 

2012 పశుగణన ప్రకారం ఇలా..

2012 సంవత్సరంలో పశుగణన లెక్కల ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా  17.85 లక్షల పశువులు ఉన్నాయి. వీటిలో తెల్లజాతికి చెందిన ఆవులు, ఎద్దులు హైబ్రీడ్‌ రకం చెందినవి మగ, ఆడవి కలిపి 2,117 ఉన్నాయి. అదే విధంగా దేశవాలికి చెందిన తెల్లజాతి పశువులు ఆడ, మగవి కలిపి 1,44,907 పశువులు ఉన్నాయి. నల్లజాతికి చెందిన బర్రెలు దున్నపోతులు హైబ్రీడ్‌ జాతికి చెందినవి, దేశవాళి రకానికి చెందినవి కలిపి మరో 4,06,145 ఉన్నాయి. గొర్రెలు, గొర్రెపోతులు కలిపి 3,12,383 ఉండగా, మేకలు, మేకపోతులు కలిపి 1,59,478 జీవాలు ఉన్నాయి. పందులు ఆడ, మగ కలిపి 4,080 కాగా నాటు కోళ్లు మరో 7,55,157 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే 2012 సంవత్సరానికి ముందు నేటితో పోల్చుకుంటే కొంత మేర దేశవాళి పశువుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచన వేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి జిల్లాలో హైబ్రీడ్‌ రకం పశువుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. పశువుల సంఖ్య కొంత మేర తగ్గినప్పటికి ఉత్పత్తిగణనీయంగా పెరగింది. దీనికి తోడు రాయితీ గొర్రెల పథకం ద్వార సైతం జీవాల సంఖ్య బారీగా పెరిగింది.

2018 సర్వేలో తేలిన లెక్కల ప్రకారం..

పశుగణనకు సంబంధించి జిల్లాలో 2018-2019 మార్చి నెల వరకు దాదాపు ఆరునెలల పాటు గోపాలమిత్ర సిబ్బంది, పశుసంవర్థకశాఖ అధికారులు గణన చేపట్టారు. అనంతరం సేకరించిన వివరాలను ఆన్‌లైన్‌లో మండలాల వారీగా నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పూర్తి డాటా సేకరించిన యంత్రాంగం కేంద్రప్రభుత్వానికి పశుగణనకు సంబంధించిన వివరాలు పంపించారు. మరికొద్ది రోజుల్లోనే కేంద్రప్రభుత్వం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం తేలిన గణంకాల ప్రకారం పశువులకు అవసరమైన వ్యాక్సిన్‌లను, ఇతర మందులను పంపిణీ చేయడం జరుగుతుంది. 2018 సర్వే ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఆయా రకాల పశువులు  35,51 730 లక్షల పశువులు ఉన్నట్లు తేలింది. ఆవుజాతి పశువులు: 1,41,117, గేదెజాతి పశువులు, 3, 75103, గొర్రెలు 6,67,318, మేకలు 1,90 013, పెరటికోళ్లు 21,52,546, పందులు 5,641, కుక్కలు13,211, బాతులు 4,848, ఇతర రకాల కోళ్లు 1,691, కుందేళ్లు 115, టర్కికోళ్లు 63, గాడిదెలు 61, గుర్రాలు 3 ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

పకడ్బందీగా సాగిన పశుగణన 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా పశుగణన కార్యక్రమం జిల్లా పశుసంవర్థకశాఖ అధికారులు పకడ్బందీగా చేపట్టారు. ఇందుకోసం ఏకంగా సంభందిత సిబ్బందికి ట్యాబ్‌లు అందజేయడంతో ఏరోజు సేకరించిన డాటా అదే రోజుల ఆన్‌లైన్‌లో పొందుపరచేందుకు గాను అవకాశం కలిగింది. దీంతో సమయాభావం కలిసి రావడమే కాకుండా, వందశాతం పారదర్శకతకు దోహదం చేసినైట్లెంది. పశువుల గణన కోసం  గోపాలమిత్రలతో పాటు, ఆయ పశువుల వైద్యశాలలో పని చేస్తున్న 142 మంది సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా విధులు నిర్వహించారు. అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేసేందుకుగాను మరో 28 పశువైద్యులు పర్యవేక్షణ బాద్యతలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతంలో ప్రతి 4,500 ఇండ్లకు, పట్టణ ప్రాంతంలో 6వేల ఇండ్లకు ఒక ఎన్యూమనేటర్‌ విధులు నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సమారు 3,31 655 ఇండ్లలో సర్వే చేశారు.    ప్రతి రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపికైన సిబ్బంది గడపగడపకు వెళ్లి సదరు కుటుంబాల నుంచి పశువుల వివరాలు సేకరించారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు  తమకు ఇచ్చిన ట్యాబ్‌లలో పొందపరచడం జరిగింది.  ఇందుకోసం రాష్ట్ర పశుసంవర్థకశాఖ ప్రత్యేక యాప్‌ను తయారు చేసింది. సేకరించిన మొత్తం సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరచే విధంగా ప్రణాళిక రూపొందించారు.   


logo