సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Feb 13, 2020 , 01:11:43

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు

ఏన్కూరు, ఫిబ్రవరి 12: వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చే రైతలను మోసం చేసే వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్‌ శాఖ వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మల్లేశం హెచ్చరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మార్కెట్‌లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శుల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కెట్‌కు వచ్చే రైతులకు సాధ్యమైనంత వరకు మద్దతు ధర లభించేలా చూడాలన్నారు. రైతులను వ్యాపారులు పలు రకాలుగా దగా చేస్తున్న విషయాన్ని ఏన్కూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూక్యా లాలునాయక్‌ ఆయన దృష్టికి తీసుకెళ్లగా జేడీఎం పైవిధంగా స్పందించారు. ఈ ఏడాది వరంగల్‌ రీజనల్‌ పరిధిలో 19జిల్లాల పరిధిలోని 104మార్కెట్లలో 2019-20లో మార్కెట్‌ లక్ష్యం 236.48లక్షలు కాగా జనవరి 31వరకు 107.66లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. సీవిల్‌ సైప్లె వరి, సీసీఐ పత్తికొనుగోలు ఆదాయం ఇంకా రాలేదని, ఆ ఆదాయం వస్తే మార్కెట్‌ లక్ష్యం అధిగమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రభుత్వం పత్తికి మద్దతు ధర రూ.5550 ప్రకటించటంతో రైతులు ఎక్కువ శాతం మంది సీపీఐ కొనుగోలు కేంద్రాలలోనే అమ్మకాలు చేశారన్నారు. రైతులు బయట తక్కువ ధరకు అమ్మి మోస పోవద్దని, మార్కెట్‌లో ప్రభుత్వం కల్పించే మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు. గోదాములు, నాబార్డు గోదాముల నిర్మాణం పూర్తయితే ఎవ్వరికి కేటాయించారు. షాపుల అద్దెలు, బకాయిలు, వ్యాపరస్తుల రెన్యూవల్‌ వివరాలు, లావాదేవీలు, బకాయిలు, మార్కెట్‌ లక్ష్యాలను అధిగమించేందుకు తీసుకుపోయే చర్యలు శాఖల వారీగా కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. మార్చి కల్లా లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీప్యూటీ జాయింట్‌ డైరెక్టర్‌ అజ్మీరారాజు, జిల్లా మార్కెటింగ్‌ అధికారులు సంతోషం, నరేంద్రకుమార్‌, ఏన్కూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భూక్యా లాలునాయక్‌, ఉమ్మడి జిల్లా మార్కెటింగ్‌ శాఖ డీఈ రాంబాబు, కార్యదర్శులు శ్రీనివాసరావు, చౌదరిరెడ్డి, నిర్మల, సంతోష్‌కుమార్‌, నాగేశ్వరరావు, శ్రీనివాస్‌, నిరంజన్‌, సత్యనారాయణ, సురేష్‌, శ్రీను, మార్కెట్‌ సూపర్‌వైజర్లు ఆంజనేయులు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo