బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Feb 11, 2020 , 23:25:25

ఇక సంక్షేమ పాలన..

ఇక సంక్షేమ పాలన..

ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాలనపై పూర్తి దృష్టిసారించారు. నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ప్రస్తుతం జరగబోయే సహకార ఎన్నికలతో అన్ని రకాల ఎన్నికలు ముగియనున్నాయి. ఇక మరో ఐదేండ్ల తరువాత ఎన్నికలు రానున్నాయి. ఈ నాలుగేండ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం రూపొందించిన నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల వెలుగులో పాలన కొనసాగనుంది. ఈ చట్టాలకు లోబడి స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఎన్నో బాధ్యతలను అప్పగించింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో నూతన చట్టాల రూపకల్పన చేసిన సంగతి తెల్సిందే. ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం కేటాయించింది. ఇప్పటి వరకు ఉన్న జాయింట్‌ కలెక్టర్‌ వ్యవస్థను రద్దు చేసి ఆ స్థానంలో ఇద్దరు అదనపు కలెక్టర్లను నియమించారు. వీరిలో ఒక్కరు పూర్తిగా స్థానిక సంస్థలకే బాధ్యత వహించనున్నారు. మరొకరు రెవెన్యూకు కేటాయించారు. దీంతో ప్రజలకు పాలన దగ్గరకానుంది. ప్రభుత్వం, ప్రభుత్వ లక్ష్యాలు ప్రజలకు చేరనున్నాయి. 

స్థానిక సంస్థల పర్యవేక్షణకు అదనపు కలెక్టర్లు...

ఇప్పటి వరకు స్థానిక సంస్థలపై పర్యవేక్షణ బాధ్యత ఎవరికి లేదు. అయితే నూతన పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలకు లోబడి పాలన జరగనుంది. ఖమ్మం జిల్లాలో 584 గ్రామపంచాయతీలు, 3 మున్సిపాలిటీలు, 20 మంది జడ్పీటీసీలు, 276 మంది ఎంపీటీసీలున్నారు. వీటితో పాటు ఖమ్మం కార్పొరేషన్‌ కూడా ఉంది. 2019 పురపాలక చట్టం ప్రకారం కలెక్టర్లకు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఇక ముందు స్థానిక సంస్థల పర్యవేక్షణ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్‌కు అప్పగించారు. నిధుల వ్యయం, పనుల్లో నాణ్యత, పనుల కాంట్రాక్టులు, పన్నుల వసూళ్లు, భవన నిర్మాణ అనుమతులు, హరితహారం, లే అవుట్‌ల మంజూరు బాధ్యతలను అదనపు కలెక్టర్‌ పర్యవేక్షించనున్నారు. గ్రామాల్లో విరివిగా మొక్కలను పెంచేలా ప్రోత్సహించాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరయడంతో పాటు మురికిగుంటలు, చెత్తాచెదారం తొలిగించే కార్యక్రమాలను కలెక్టర్‌ పర్యవేక్షించాలి. పంచాయతీలు, పురపాలక సంఘాలలో జవాబుదారితనం పెంచే లక్ష్యంతో కలెక్టర్‌ను కేటాయిచండం జరిగింది. నిర్లక్ష్యం వహించే ప్రజా ప్రతినిదులపై చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే అప్పగించారు. అదనపు కలెక్టర్‌ పూర్తిగా స్థానిక సంస్థలను మాత్రమే పర్యవేక్షించనున్నారు. మరో అదనపు కలెక్టర్‌ పూర్తిగా రెవెన్యూ అంశాలను మాత్రమే పర్యవేక్షించనున్నారు. పౌరసరఫరాలు, మార్కెట్‌ల నిర్వహణ, భూసేకరణ తదితర అంశాలను అదనపు కలెక్టర్‌కు అప్పగించారు. 

పకడ్బందీగా పురపాలక చట్టం..

స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి ఇప్పటి వరకు స్థానిక సంస్థల ప్రతినిధులే ఆయా పంచాయతీకి, మున్సిపాలిటీలకు సుపీరియర్‌గా వ్యవహరించేవారు. పాలకవర్గం వారి చేతిలో ఉంటే ఇష్టం వచ్చిన రీతిలో నిధులను ఖర్చు చేసేవారు. అభివృద్ధి పనుల్లో చేతివాటం ప్రదర్శించే వారు ఇక ముందు అలాంటి వాటికి చెక్‌ పెట్టేలా ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌, పురపాలక చట్టాలను రూపొందించింది. ఈ చట్టాల ప్రకారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే వారిని సస్పెండ్‌ చేసే అధికారం కలెక్టర్లకు అప్పగించారు. ప్రతి గ్రామపంచాయతీలో పచ్చదనం వెల్లివిరిసేందుకు ప్రభుత్వం గ్రామానికి ఒక నర్సరీని ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీల్లో కూడా వార్డుల పరిధిలో నాటే మొక్కలలో 85 శాతం మొక్కలను బతికించే బాధ్యతలను వార్డు కౌన్సిలర్‌లకు అప్పగించారు.  


logo