శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 11, 2020 , 23:23:16

డీసీసీబీపై గులాబీ జెండా ఎగురడం ఖాయం

 డీసీసీబీపై గులాబీ జెండా ఎగురడం ఖాయం

  కామేపల్లి:ఖమ్మం జిల్లా సహకార బ్యాంక్‌ పై గులాబీ జెండా ఎగురడం ఖాయమైందని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ మద్దినేని వెంకటరమణ అన్నారు. ఈ నెల 15న జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు.  మంగళవారం కొండాయిగూడెం సొసైటీ పరిధిలోని పండితాపురం, కొమ్మి నేపల్లి, రుక్కితండా, బండిపాడు, గోవింద్రాల గ్రామాలకు చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులకు సహకార సంఘం ఎన్నికల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేశామని చెప్పారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగ అని ప్రకటించగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగ చేసుకోవచ్చునని నిరూపించి రైతు బాంధవుడిగా కొనియాడారు. 24 గంటల పాటు వ్యవసాయ రంగానికి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా, రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం, అన్నదాత ఏ కారణంగా అయినా మరణిస్తే రైతు బీమా పథకం ద్వారా రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటు న్నామన్నారు. ఇవే కాకుండా రైతులకు ఖరీఫ్‌, రబీ సీజన్‌లో అవసరమైన ఎరువులు, విత్తనాలు కొరత లేకుండా అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నందున సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను రైతులు తప్పకుండా ఆశీర్వదిస్తారని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులు ఎల్లప్పుడూ అండగా ఉంటారన్నారు. అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే హవా కొనసాగుంతుందని, సహకార ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ పూర్తి స్థాయిలో గెలుపొంది, చైర్మన్‌ పీఠాన్ని కైవసం చేసుకుంటామని తెలిపారు. కొండాయిగూడెం సొసైటీలో 13 డైరెక్టర్‌ స్థానాలకు 4 డైరెక్టర్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికావడం పట్ల స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులను అభినందించారు. సంఘం పరిధిలోని ప్రతి ఓటర్‌ని టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి ఓట్లు అభ్యర్థించాలని కోరారు. ఇతర విపక్ష పార్టీలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించడంతో పాటుగా సహకార సంఘాలు మరింత బలోపేతం కావాలంటే టీఆర్‌ఎస్‌ గెలవాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. మిగతా 9 డైరెక్టర్‌ స్థానాలను గెలుచుకోవాలని సూచించారు. సహకార సంఘాల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేస్తే విజయం మనదేనని అన్నారు. అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ సేవాగుణం కలిగిన ధనియాకుల హనుమంతరావు సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా పోటీ చేయడం ఇక్కడి ప్రజలు, రైతులు అదృష్టంగా భావించాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో సహకార సంఘాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలను ప్రజలు, రైతులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి రైతు తమ విలువైన ఓటును టీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులకే వేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు వీరూనాయక్‌, ధనియాకుల హను మంతరావు, ప్రదీప్‌, కొమ్మినేని శ్రీనివాసరావు, లకావత్‌ బీమా, దండగల దేవేందర్‌, ఉప్పుగండ్ల వీరభద్రరావు, సుందర్‌సింగ్‌, కొమ్మినేని వెంకటేశ్వర్లు, బండి లక్షినర్సు, యల్లయ్య, షేక్‌ మీరాజానీ, నెహ్రూ పాల్గొన్నారు.


logo