శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Feb 10, 2020 , 23:56:29

డీసీసీబీపై గులాబీ జెండా

డీసీసీబీపై గులాబీ జెండా

(ఖమ్మం, నమస్తే తెలంగాణ):ఇప్పటికే అధిక సంఖ్యలో గెలుచుకున్న టీఆర్‌ఎస్‌ మిగిలిన స్థానాల్లో కూడా విజయం సాధించేలా ప్రణాళికను రూపొందిస్తున్నది. ఆ పార్టీ నాయకుల అంచనా మేరకు మరో 50కి పైగా సొసైటీలను కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే మరికొన్ని సొసైటీల్లో డైరెక్టర్ల స్థానాల విషయంలో ఏకగ్రీవం చేసుకునే అంశంలో చిన్నచిన్న అంశాలపై విభేదాలున్నట్లుగా తెలుస్తున్నది. రెండు రోజుల్లో అవి కూడా సమసిపోతాయని, పోలింగ్‌ నాటికి టీఆర్‌ఎస్‌ ఖాతాలోకి మరిన్ని సొసైటీలు చేరే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. సహకార సంఘాలకు పోలింగ్‌ జరగకముందే నామినేషన్ల ఉపసంహరణ రోజునే టీఆర్‌ఎస్‌ 35 స్థానాలను గెలుచుకోవడం మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. గత ఎన్నికల్లో ఒక సొసైటీని కూడా గెలుచుకోలేని టీఆర్‌ఎస్‌ ఆరు సంవత్సరాల కాలంలోనే డీసీసీబీపై గులాబీ జెండాను పాతడం చరిత్రను తీరగరాసినట్లవుతున్నది. 

ఖమ్మం డీసీసీబీ పరిధిలో 101 సొసైటీలు..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ పరిధిలో 101 సొసైటీలున్నాయి. జిల్లా విభజన అనంతరం వాటిలో ఖమ్మం జిల్లాలో 76 సొసైటీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 సొసైటీలు, మహబూబాబాద్‌ జిల్లాలో రెండు సొసైటీలు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ జిల్లాలో రెండు సొసైటీలు ఉండిపోయాయి. జిల్లా విభజన చేసినప్పటికీ కేంద్ర సహకార బ్యాంక్‌ను విభజించకపోవడం వల్ల ప్రస్తుత ఎన్నికలు ఆనాటి ఉమ్మడి జిల్లా ఆధారంగానే జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 101 సొసైటీల్లో 35 సొసైటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకోగా మిగిలిన 63 సొసైటీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. భద్రాచలం సొసైటీ పరిధిలో 40 మంది ఓటర్లు మాత్రమే ఉండటంతో ఎన్నికలను నిర్వహించకుండా చేతుతెత్తే పద్ధతిన డైరెక్టర్లను ఎన్నుకుంటారు. దానిని మినహాయించి మిగిలిన 66 సొసైటీల పరిధిలోని డైరెక్టర్ల స్థానాలకు ఈ నెల 15న పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు అక్షరమాల ప్రకారం పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. సోమవారం రాత్రి పొద్దు పోయే వరకు అధికారులు అభ్యర్థులకు గుర్తులను కేటాయించడంతో మంగళవారం నుంచి రంగంలో నిలిచిన అభ్యర్థులు ప్రచారం చేయనున్నారు. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే పోలింగ్‌కు ఉండటంతో అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసే అవకాశం ఉంది. 

35 సొసైటీల ఏకగ్రీవంతో టీఆర్‌ఎస్‌ జోష్‌.. 

ఖమ్మం జిల్లాలోని 76 సొసైటీలకుగాను టీఆర్‌ఎస్‌ 30 సొసైటీలను కైవసం చేసుకుంది. వీటిలో ఖమ్మం నియోజకవర్గంలోని వీ.వెంకటాయపాలెం, మంచుకొండ, రఘునాథపాలెం, సొసైటీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం నాలుగు సొసైటీలుండగా మిగిలిన ఒక్క సొసైటీలో ఎన్నికలు జరగనున్నాయి. అది కూడా ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించిన సొసైటీ కావడం విశేషం. సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం 24 సొసైటీలుండగా వీటిలో 10 సొసైటీలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకుంది. వీటిలో సత్తుపల్లి, కిష్టారం, వేంసూరు, కందుకూరు, భరిణపాడు, పల్లెవాడ, పెనుబల్లి, చినకోరుకొండి, పోచారం, కొర్లగూడెం సొసైటీలున్నాయి. మిగిలిన 14 సొసైటీలకు ఎన్నికలు జరుగుతాయి. పాలేరు నియోజకవర్గంలో మొత్తం 16 సొసైటీలుండగా 5 సొసైటీలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మధిర నియోజకవర్గంలో 24 సొసైటీలుండగా పది సొసైటీలు టీఆర్‌ఎస్‌కు ఏకగ్రీవమయ్యాయి. వైరా నియోజకవర్గంలో మొత్తం 8 సొసైటీలుండగా రెండు సొసైటీలు టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకోగలిగింది. వీటిలో వైరా, గోపవరం సొసైటీలున్నాయి. మిగిలిన ఆరు సొసైటీలకు ఎన్నికలు జరుగుతాయి. కొత్తగూడెం జిల్లాలోని పినపాక నియోజకవర్గంలో 3 సొసైటీలు, భద్రాచలంలోని 2 సొసైటీలను టీఆర్‌ఎస్‌ గెలుచుకుంది.  

మంత్రి, ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ల చొరవ..

ఖమ్మం జిల్లా రాజకీయ పటంపై టీఆర్‌ఎస్‌ చెరగని ముద్రణ వేసుకోబోతున్నది. సహకార సంఘాల చరిత్రలోనే ప్రస్తుతం జరిగే ఎన్నికలు కొత్త చరిత్రకు నాంది పలుకనున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌కుమర్‌ ప్రత్యేక చొరవతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. తన నియోజకవర్గ పరిధిలో ఉన్న మూడు సొసైటీలు కూడా టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవం చేసుకోవడం వెనుక మంత్రి పువ్వాడ పాత్ర ఎంతో ఉంది. ఈ సొసైటీల పరిధిలో అనేకమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ మంత్రి పువ్వాడ చొరవ కారణంగా వారు ఉపసంహరించుకున్నారు. దీంతో పువ్వాడ తన సత్తాను మరోమారు చాటుకున్నారు. అదే విధంగా మధిర నియోజవర్గంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ కూడా బలంగా ఉన్నప్పటికీ అక్కడ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ ప్రత్యేక కృషి వల్ల 10 సొసైటీలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలవగలిగింది. మిగిలిన సోసైటీల్లో కూడా గులాబీ జెండా ఎగిరేలా ఆయన ప్రణాళికను రూపొందించారు. పాలేరు నియోజకవర్గంలో ఉన్న 16 సొసైటీలకుగాను ఐదు సొసైటీలను టీఆర్‌ఎస్‌ ఏకగ్రీవంగా గెలుచుకోవడం వెనుక ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవ కారణంగా మరో 2 - 3 సొసైటీలు ఏకగ్రీవం కావాల్సినప్పటికీ కాలేకపోయాయి. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరో చరిత్రను సృష్టించారు. మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తానికి మొత్తం సీట్లను గెలుచుకొని రికార్డులను సృష్టించిన సండ్ర సహకార ఎన్నికల్లో కూడా 10 సొసైటీలను ఏకగ్రీవంగా గెలిపించి తన సత్తాను చాటారు. మిగిలిన 14 సొసైటీలను కూడా కైవసం చేసుకోనున్నారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌ చొరవతో నియోజకవర్గంలోని రెండు సొసైటీలను గెలుచుకోగలిగారు.


logo