సోమవారం 30 మార్చి 2020
Khammam - Feb 10, 2020 , 23:38:29

తెలంగాణ రాష్ర్టానికి నిధులు కేటాయించాలి

తెలంగాణ రాష్ర్టానికి నిధులు కేటాయించాలి

ఖమ్మం, నమస్తే తెలంగాణ:  లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌ 2020-21 పై చర్చ సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన ప్రసంగానికి సభలో సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యల పైన నామా మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది. పార్టీలకతీతంగా నామాపై ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రతాప్‌సింగ్‌ రూడీ చప్పట్లుతో నామా ప్రసంగానికి మద్దతు తెలిపారు. నామా లోక్‌సభలో మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎన్నో  ఉద్యమాలు జరిగాయని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో 15వ లోక్‌సభ సమయంలో మా నాయకుడు కేసీఆర్‌ అమరణ నిరహార దీక్షకు దిగి తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చావు బతుకులలో ఉండి కూడా తెలంగాణ కోసం పోరాటం చేశారన్నారు. ఆరేళ్లలో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్ర పునఃర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్‌ ప్రాజెక్టులు, నిధులు విడుదల చేయటంతో పాటుగా రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే, రహదారుల పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్రానికి నామా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతులు సమస్యలపై ఆలోచన చేసి దేశంలోనే మొదటిసారిగా రైతుబంధు పేరుతో ఎకరానికి పదివేలు ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం కూడా అదేవిధంగా దేశ వ్యాప్తంగా ఎకరానికి రూ. 10 వేలు పెట్టుబడి సహాయం అందించాలన్నారు. కేంద్రం స్పందించి విభజన సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ర్టాలకు ఇవ్వాల్సిన ట్యాక్స్‌ షేర్‌ ఎప్పుడు కూడా తగ్గించకూడదని ఉందని, కాని మొదటి సారిగా రాష్ర్టాలకు రావాల్సిన వాటాను తగ్గించారన్నారు. జమ్మూకశ్మీర్‌కు ఇస్తామన్న 1 శాతం షేర్‌ విషయంలో మేము మద్దతు ఇస్తున్నాం. కాని రాష్ర్టాల వాటాల నుంచి మినహాయించి ఇవ్వటం సరికాదని, అది కేంద్రం వాటాలో ఇవ్వాలని సూచించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రభావం వలన ఆదాయం కోల్పోతున్న తెలంగాణ రాష్ట్రంతో పాటుగా మిగిలిన దక్షిణాది రాష్ర్టాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయాలని ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ విషయంలో నీతి ఆయోగ్‌ సంబంధించిన  సభ్యులు కూడా వచ్చి తెలంగాణ రాష్ర్టానికి వచ్చి రాష్ట్రం అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ పథకాన్ని పరిశీలించి రూ. 19,205 కోట్లు సహాయం ఇవ్వాలని తెలంగాణకు అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి 31 మే 2016 సిఫార్సు చేశారన్నారు.  సాక్షిగా తెలంగాణకు నిధులు మంజూరు చేయాల్సిందిగా నామా కోరారు. అలాగే మిషన్‌ కాకతీయ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాలలో చెరువులను అభివృద్ది చేసుకున్నామని, దీనికి నీతి ఆయోగ్‌ 5 వేలు కోట్లు సహాయం అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసిందన్నారు. అదేవిధంగా నేషనల్‌ వాటర్‌గ్రిడ్‌ ఏర్పాటుతో పాటుగా నదులు అనుసంధానం చేయాలని, అలాగే కేంద్రం, రాష్ట్రం రెండు కలిసి పనిచేస్తే రాష్ర్టాలు అభివృద్ధి సాధించటంతో పాటుగా దేశాభివృద్ధి జరుగుతుందని నామా పేర్కొన్నారు.


logo