బుధవారం 01 ఏప్రిల్ 2020
Khammam - Feb 10, 2020 , 01:10:05

కల్లాల్లో క‘న్నీరు’

కల్లాల్లో క‘న్నీరు’

ఖమ్మం వ్యవసాయం: ఉపరితల ద్రోణి ప్రభావంతో  శనివారం తెల్లవారుజాము (ఆదివారం) నుంచి ఆకాల వర్షం కురవడంతో కూసుమంచి, తిరుమలయపాలెం, ఖమ్మం రూరల్‌ మండలం, ముదిగొండ మండలాలో మిర్చిసాగు చేసిన రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది. కూసుమంచి మండలంలో రాత్రివేళ కురిసిన వర్షానికి గాను కల్లాలలో ఆరబెట్టిన పంట నీటిపాలు అయ్యింది. పట్టాలు కప్పినప్పటికీ వరద నీరు ప్రవాహంలా రావడంతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.  పంట ఎండబెట్టి ఒకటి రెండు రోజుల్లో మార్కెట్‌కు తీసుకబోయే తరుణంలో వర్షం రావడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. తిరుమలయపాలెం, ఖమ్మం రూరల్‌ మండలాల్లో ఆకాల వర్షానికి పంట దెబ్బతిన్నాయి.   రైతుల ఇబ్బందులను తెలుసుకున్న పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పంటను పరిశీలించారు. ప్రభుత్వం సంభందిత అండగా ఉంటుందని  రైతులకు ధైర్యం చెప్పారు.  

జిల్లావ్యాప్తంగా 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం

జిల్లాలోని పలు మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఖమ్మం నగరంతో పాటు మరికొన్ని మండలాల్లో చెదురుముదురు జల్లులు కురిశాయి. జిల్లా వ్యాప్తంగా సరాసరి 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కూసుమంచి మండలంలో 39.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, తిరుమలాయపాలెం మండలంలో 22.2 మి.మీ, ముదిగొండ మండలంలో 6.6 మి.మీ, నేలకొండపల్లి మండలంలో 1.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో సైతం ఓ మోస్తారు వర్షం కురిసింది. కల్లాల్లో తడిసిన పంటను తక్షణం వేరు చేసుకోవాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు సూచించారు.   

సుమారు 20వేల క్వింటాల మిర్చిపంటకు నష్టం..

కూసుమంచి మండలంలో మిర్చిపంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు పేర్కొన్నారు. మండల పరిదిలో ఈ సంవత్సరం 3,883 ఎకరాల్లో ఆయా గ్రామాల రైతులు సాగు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సాగు చేసిన పంటకు సంభందించి దాదాపు 60శాతం పంట కల్లాల్లోనే ఆరబెట్టారు. వీటిలో దాదాపు 20వేల క్వింటాల పంట తడిసి న్నట్లు ప్రాథమిక అంచనా ఉందన్నారు. తిరుమలయపాలెం, రూరల్‌ మండలాల్లో కల్లాల్లో పంట తడిసిపోయింది. పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తరువాత ఉద్యానశాఖ అధికారులు నివేదిక తయా రు చేసే పనిలో నిమగ్నమయ్యారు.


logo
>>>>>>