సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Feb 07, 2020 , 23:44:57

యథేచ్ఛగా మట్టి దందా..

యథేచ్ఛగా మట్టి దందా..

రఘునాథపాలెం: ఒకప్పుడు చాలా ఎత్తైన గుట్టలు, వాటిపై చెట్లు, పుట్టలు ఉండేవి. వాటి మాటున జంతువులూ కనిపించేవి. ప్రస్తుతం ఆ గుట్టలు రోజురోజుకూ తరిగిపోతున్నాయి. మట్టి కోసం గుట్టల్ని మాయం చేస్తున్నారు. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటు. ఖమ్మం నగరానికి కూతవేటు దూరంలో నిత్యం రాత్రిపగలు గుట్టలను భారీ యంత్రాలతో తవ్వి కరగదీస్తున్నారు. ఏండ్లుగా మట్టి దందా జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అటుగా కన్నెత్తి చూసింది లేదు. ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వేస్తూ వ్యాపారులు కోట్లు కుమ్మరించుకుంటున్నారు. ఖమ్మం నగరం బాలప్పేట శివారులో జరిగే మొరం దందాపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ప్రత్యేక కథనం.. 

            అక్రమ వ్యాపారానికి బాలప్పేట శివారు గుట్టలు అడ్డాగా మారాయి. బాలప్పేట అడ్డాగా మట్టి మాఫియా జరుగుతున్నది. ప్రభుత్వ భూముల్లో నెలకున్న గుట్టలను పిండి చేస్తూ వ్యాపారులు కోట్లు గడిస్తున్నారు. ఏండ్ల తరబడిగా దందా సాగుతున్నా.. పట్టించుకునే అధికారి కరువయ్యాడు. దీంతో వ్యాపారుల మట్టి దందా ‘ముప్పై టిప్పర్లు..ఆరవై ట్రాకర్లు అన్న చందంగా కొనసాగుతోంది. వీరి అక్రమ దందా వెనుక పరోక్షంగా అధికారుల సహకారం మెండుగా ఉండటంతోనే అనేక ఏళ్లుగా గుట్టల్ని పిండి చేస్తూ కాసులు పోగేసుకుంటున్నారు. వీరి వ్యాపారాన్ని నిరోధించాల్సిన రెవెన్యూ, మైనింగ్‌ యంత్రాంగాలు సైతం చోద్యం చూస్తూ అక్రమార్కుల వ్యాపారానికి వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఖమ్మం నగరానికి కూత వేటు దూరంలోని బాలప్పేట శివారులో మొరం దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఖమ్మం నగరానికి చెందిన ఎల్బీనగర్‌(గోపాలపురం), బల్లేపల్లి, బాలప్పేట ప్రాంతాలకు చెందిన మట్టి వ్యాపారులు ఏళ్లుగా గుట్టలపై పాగా వేసి మొరం దందాను కొనసాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో ఉన్న కొండలను పిండి చేస్తూ తహసీల్దార్‌, మైనింగ్‌ అధికారులకు ఎలాంటి రుసుము చెల్లించకుండా పెద్ద ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారు. ఇలా వ్యాపారులు రాత్రిపగలు తేడా లేకుండా నిత్యం వందల ట్రాక్టర్ల మట్టిని రవాణా చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.


logo