గురువారం 09 ఏప్రిల్ 2020
Khammam - Feb 07, 2020 , 23:43:01

రెండోసారి ఏకగ్రీవం కానున్న బాగం హేమంతరావు

రెండోసారి ఏకగ్రీవం కానున్న బాగం హేమంతరావు

మయూరి సెంటర్‌, ఫిబ్రవరి 7: సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు నేలకొండపల్లి మండలం మోటాపురం సహకార సంఘం అధ్యక్షనిగా రెండోసారి ఏకగ్రీవం కానున్నారు. 2013లో జరిగిన ఎన్నికలలో కూడా మోటాపురం  సహకార సంఘం అధ్యక్షనిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బాగం అనంతరం డీసీసీబీకి జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా బాగం హేమంతరావుకు ఉపాధ్యక్ష పదవి వరించింది. ఈసారి కూడా మోటాపురం సహకార సంఘం అధ్యక్షనిగా బాగం హేమంతరావును ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామంలోని అన్ని రాజకీయపార్టీలు, రైతాంగం నిర్ణయించారు. ఈ మేరకు అన్ని పార్టీలు సమావేశమై డైరెక్టర్‌ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేసి 13 మంది డైరెక్టర్‌ స్థానాలకు శుక్రవారం సింగిల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. 1వ డైరెక్టర్‌ స్థానం నుంచి బాగం హేమంతరావు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నామినేషన్ల కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, రైతులు పాల్గొన్నారు. 

మోటాపురం సహకార సంఘాన్ని బలోపేతం చేసిన బాగం 

2013 సంవత్సరంలో మోటాపురం సహకార సంఘ అధ్యక్షనిగా ఏకగ్రీవంగా ఎన్నికైన బాగం ఆసంఘాన్ని బలోపేతం చేయడంలో కీలకపాత్ర పోషించారు. 2013లో కేవలం రూ. 24 లక్షలు మాత్రమే ఉన్న సంఘం టర్నోవర్‌ నేడు 6 కోట్లకు చేరుకుంది. సంఘంలో రైతుల వాటా ధనం రూ. 59,91,574 ఉంది. ప్రతి సంవత్సరం సుమారు రూ. 60 లక్షల ఎరువుల వ్యాపారం, రూ. 10 లక్షల విత్తనాల వ్యాపారం నిర్వహిస్తున్నారు. 2014లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో రూ. 1 కోటి 56 లక్షల రుణమాఫీ వచ్చింది. నూతనంగా ఈ సంవత్సరం ఖరీఫ్‌ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రం సంఘం ద్వారా ప్రారంభించి, రైతుల వద్ద నుంచి ధాన్యం కోనుగోలు చేసి దీని ద్వారా కమీషన్‌ రూపంలో సంఘానికి రూ. 5 లక్షలు వచ్చింది. అదే విధంగా రైతులకు గేదేల రుణాలను కూడా సంఘం ఆధ్వర్యంలో అందించడం జరిగింది. సంఘాన్ని పారదర్శకంగా ఎలాంటి అవినీతికి తావులేకుండా రైతులందరికి సంఘం ద్వారా పలు సేవలందించి నష్టాలలో ఉన్న సంఘాన్ని లాభాల బాటలోకి తీసుకువచ్చిన నేపథ్యంలో అన్ని పార్టీల వారు, రైతులు బాగం హేమంతరావును తిరిగి మోటాపురం సహకార సంఘం అధ్యుక్షునిగా రాజకీయాలకు అతీతంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. 


logo