శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 06, 2020 , 00:34:30

సహకార పోరుకు సన్నదం

సహకార పోరుకు సన్నదం
  • ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు
  • ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా 97 సొసైటీలకు ఎన్నికలు
  • ఏకగ్రీవం కోసం అన్నదాతల సమాలోచనలు
  • ఈ నెల 8నామినేషన్ల స్వీకరణకు తుది గడువు

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఈనెల 15న జరగబోయే సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి నేటినుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అయా సొసైటీలకు డైరెక్టర్ల పదవులకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు నామినేషన్‌లను స్వీకరిస్తారు. మూడు రోజుల పాటు(6,7,8తేదీల్లో) నామినేషన్‌ల స్వీకరణకు రాష్ట్ర కో-ఆపరేటివ్‌ ఎన్నికల అథారిటీ సమయం ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన సహాకార సంఘాల అధికారులు ఆయా సొసైటీలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా ఖరారు చేశారు. ఖమ్మం జిల్లాలో 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 సొసైటీల ఎన్నికలకు నియమించిన ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చారు. 


అదే విధంగా ఈ నెల 15 జరిగే ఎన్నికలకు అవసరమైన పోలింగ్‌ అధికారులు, రూట్‌ ఆఫీసర్లు సిబ్బందిని సైతం నియమించారు. ఈ నెల 9వ తేదీన సదరు సిబ్బందికి సహకార ఎన్నికల నియమావళి, పోలింగ్‌ జరిగే సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా 76 సొసైటీల పరిధిలో 977 డైరెక్టర్లకు ఎన్నికలు జరుగతుండగా వాటిలో 1,56,512 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే విధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో 21 సొసైటీల పరిధిలో 273 మంది డైరెక్టర్లకు సంబంధించిన నియోజకవర్గాల పరిధిలో 66,980 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 8న నామినేషన్‌ల స్వీకరణకు తుది గడువు కాగా, 9వ తేదీన పరిశీలిన, 10వ తేదీన ఉపసంహరణకు సమయం కేటాయించారు. అనంతరం అదే రోజు  అభ్యర్థులకు గుర్తులు కేటాయించనున్నారు. ఈ పక్రియలో భాగంగా బుధవారం ఆయా సొసైటీలకు సంబంధించిన సీఈఓలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 


నామినేషన్‌ ప్రక్రియ మార్గదర్శకాలు..

నిర్థేశించిన ఫారం-2లో అభ్యర్థిత్వానికి నామినేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి రెండు నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయవచ్చు. 

పోటీ చేసే అభ్యర్థి ఆ సంఘంలో ఏదేని వార్డులో ఓటర్‌ అయి ఉండాలి. అభ్యరిని ప్రతిపాదించే వ్యక్తి, బలపరిచే వ్యక్తి అదే వార్డుకు సంబంధించిన ఓటరై ఉండాలి. ప్రతి నామినేషన్‌ పత్రంలో ఓటర్లుగా అర్హులైన సభ్యులు మాత్రమే ఒకరు ప్రతిపాదకుడిగా, మరొకరు బలపరిచే వ్యక్తిగా సంతకం చేయబడి ఉండాలి. ఒక సభ్యుడు ఒక అభ్యర్థిని మాత్రమే ప్రతిపాదించడం, బలపరచడం చేయాలి.


ప్రతి అభ్యర్థి స్వయంగా తన ప్రతినాదకుడు, బలపరచిన వ్యక్తి ద్వారా లేదా దీనికి సంబంధించిన అతనిచే తిరిగి ఇవ్వలేని రుసుముతో తన నామినేషన్‌ పత్రం సమర్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రెవెన్యూ అధికారిచేత జారీ చేయబడిన కుల ధ్రువీకరణ పత్రం పొందుపరచాలి. ఎస్సీ అభ్యర్థులు రూ.500, ఎస్టీ అభ్యర్థులు రూ.750, మిగతా అభ్యర్థులకు రూ.1,000 చొప్పున నామినేషన్‌ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారి నామినేషన్‌ పత్రం స్వీకరించి పారం-2కు జతచేయబడినది ముట్టినైట్లెతే సదరు పత్రం విడదీసి ఇవ్వాల్సి ఉంటుంది. తనచే నామినేషన్‌ పత్రం స్వీకరించిబడిన క్రమసంఖ్య, తేదీ, సమయం రాసి వెంటనే నామినేషన్‌ పత్రం ముట్టినట్లుగా రశీదు ఇవ్వాలి. సదరు రశీదుపై సంఘం ముద్ర తప్పని సరి ఉండాలి.నామినేషన్‌ స్వీకరణకు గడువు ముగిసిన పిదప ఎన్నికల అధికారి ఫారం-3లో అతనికి అందిన నామినేషన్‌ల పట్టికను తయారు చేసి నోటీసు బోర్డుపై ప్రదర్శించాలి.


నామినేషన్ల పరిశీలన..

నామినేషన్ల పత్రముల పరిశీలనకు నిర్ణయించబడిన తేదీ  సమయాన ఎన్నికల అధికారి నామినేసన్‌ల పత్రాలను పరిశీలన చేపట్టాలి. పరిశీలన సమయంలో అభ్యర్థి, అతని ప్రతిపాదకుడు లేదా బలపరచిన వ్యక్తి హాజరు కావడానికి అర్హులు. అభ్యర్థి లేక అతని ప్రతిపాదకుడు, బలపరిచిన వ్యక్తి కేవలం హాజరు కాలేదని కారణం చేత నామినేషన్‌ చెల్లుబాటు కాకుండా ఉండదు. ఎన్నికల అధికారి అభ్యర్థుల వారీగా పరిశీలించి, అభ్యంతరాలు ఏవైనా ఉంటే తగు నిర్ణయం తీసుకోవచ్చు. లేదా అవసరం అనుకుంటే తనంతట తానుగా అర్హతపై విచారించవచ్చు. 


అభ్యర్థి పేరు. ప్రతిపాదకుని పేరు, బలపరిచిన వ్యక్తి పేరుగాని, వారికి సంబంధించిన ఇతర వివరాలు అర్హులైన ఓటర్ల పట్టికలో అక్షరదోషాలతో నమోదు చేయబడిన కారణంచే, ఒకవేళ వారి గుర్తింపునకు సహేతుక సందేహానికి అతీతంగా,  మరో విధంగా రుజువు అయితే అభ్యర్థి నామినేసన్‌ తిరస్కరించబడదు. ఎన్నికల అధికారి ప్రతి నామినేషన్‌ పత్రంపైన సందర్భాన్ని బట్టి అంగీకరించబడినది, లేక తిరస్కరించబడినది అనే తన నిర్ణయాన్ని పేర్కొనాలి. ఒకవేళ నామినేషన్‌ పత్రం తిరస్కరించబడినైట్లెతే అట్టి తిరస్కరణకు గల కారణాలు సంక్షిప్తంగా రాత పూర్వకంగా నమోదు చేయాలి.పరిశీలన ముగిసిన వెంటనే అందిన నామినేషన్లలో  చెల్లుబాటు అయిన వాటి పట్టికను నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఫారం-4లో తిరస్కరించబడిన వాటిని ఫారం-5లో నామినేషన్‌ పత్రాలలో పేర్కొనబడిన పేర్లు తెలుగు అక్షర క్రమంలో సంఘం నోటీస్‌ బోర్డుపై ప్రదర్శించాలి.


రాష్ట్రంలో తొలిసారిగా...

స్వరాష్ట సాధన తరువాత తొలిసారిగా జరుగబోతున్న సహకార సంఘాల ఎన్నికలు ప్రాధ్యాన్యత సంతరించుకున్నాయి. ఉమ్మడి రాష్టంలో చివరిసారిగా  చివరిగా 2013 సంవత్సరం జనవరి 31, ఫిబ్రవరి 3 తేదీల్లో రెండు దఫాలుగా సొసైటీలకు ఎన్నికలు జరిగాయి. ఖమ్మం జిల్లాలోని పెద్దబీరవెల్లి, నారాయణపురం, బ్రాహ్మణపల్లికి సంబంధించిన సహాకార సంఘాలకు ఎన్నికలు జరగలేదు. గతంలో ఆ సొసైటీలలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఆ ప్రాంత వాసులు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలు జరగలేదు. ఈ నెల 15న ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 97 సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2013 సంవత్సరంలో ఎన్నికైన పాలకవర్గాల గడువు 2018 సంవత్సరంలోనే కాలపరిమితి ముగిసనప్పటికీ నూతన సహకార చట్టం తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ నెల 31, వచ్చే నెల 3తో పాలకవర్గాల గడువు ముగుస్తుండటంతో తక్షణం ఎన్నికలు జరపాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. 

 

ఏకగ్రీవం కోసం సమాలోచనలు..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన సర్పంచ్‌, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల్లో అనేక స్థానాలకు ఏకగ్రీవాలు జరిగాయి. సీఎం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన ప్రజలు తమ గ్రామాల్లో ఒకే తాటిపై నిలచి టీఆర్‌ఎస్‌ పార్టీని బలపరచారు. అదే విధంగా సహకార సంఘాల్లో సైతం తమ గ్రామాల పరిధిలోని డైరెక్టర్లను ఏకగ్రీవం చేసుకునేందుకు అన్నదాతలు సమాలోచనలు చేస్తున్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకొని అహర్నిషలు తమ కోసం ఆలోచన చేస్తున్న సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరిచే విధంగా నిర్ణయం తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే స్థానిక టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఆయా సొసైటీల పరిధిలోని ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెజార్టీ స్థానాలు ఏకగ్రీం అయ్యే అవకాశం కనపడుతుంది. 


logo