మంగళవారం 07 ఏప్రిల్ 2020
Khammam - Feb 06, 2020 , 00:29:57

తీరు మార్చుకోని బిహార్‌ విద్యార్థులు.

తీరు మార్చుకోని బిహార్‌ విద్యార్థులు.
  • తెలుగు విద్యార్థులు, ఉపాధ్యాయులపై నిందారోపణలు
  • ఆపై తమనే ఇబ్బందులు పెడుతున్నారంటూ ఘర్షణ
  • సమస్యలకు తాత్కాలిక పరిష్కారమే చేస్తున్న కమిటీ
  • ఏడాదికేడాది ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు..

.క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రతి ఏటా బీహార్‌ విద్యార్థుల తీరుతో తలనొప్పిగా మారింది. గొడవలు జరిగిన ప్రతిసారి అధికారులు తాత్కాలికంగా  పరిష్కారం చేయగలుగుతున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదు. అత్యున్నత ప్రమాణాలతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విద్యార్థులకు, వసతులు, వనరులు కల్పించినప్పటికీ 30 మంది బిహార్‌ విద్యార్థుల రాకతో ప్రతి సంవత్సరం పాఠశాల ప్రతిష్ట రోడ్డున పడుతుంది. మైగ్రేటెడ్‌ విద్యార్థులు కావటంతో బీహార్‌ వాళ్లకు కొంత ప్రాధాన్యత ఇస్తే దానిని అలుసుగా తీసుకొని తెలుగు విద్యార్థులపై దాడులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులపై కామెంట్స్‌ అరుపులు కేకలతో గొడవలు చేసే స్థాయికి బీహార్‌ విద్యార్థులు వెళుతున్నారు. భాష పరంగా తెలుగు, హిందీ మాట్లాడే విద్యార్థుల సమన్వయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 9వ తరగతిలో బిహార్‌ నుంచి 30 మంది విద్యార్థులు పాలేరుకు ఇక్కడి నుంచి 30 మంది విద్యార్థులు బీహార్‌కు వెళ్లి చదువు కుంటారు. ఇదే తెలుగు విద్యార్థులకు శాపంగా మారింది. ఒక ఏడాదిపాటు చదువు కోసం వచ్చిన వారు నానా గొడవలు చేసి నవోదయ విద్యాలయం ప్రతిష్ట దిగజార్చుతున్నారు. బీహార్‌ విద్యార్థుల తీరుతో తెలుగు విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. 


ఘటన జరిగినప్పుడే చర్యలు..

ఘటన జరిగినప్పుడే చర్యలు తప్ప తరువాత దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. శశ్వాత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే ఎన్నో దఫాలుగా గొడవల్లో ఒక్కసారి కూడా తెలుగు విద్యార్థులు కనీసం నిరసన తెలుపలేని పరిస్థితి. కానీ బిహార్‌ విద్యార్థులు మాత్రం ఏకంగా పోలీస్‌ స్టేషన్‌, కలెక్టరేట్‌కు వెళతామని ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు. అత్యంత ప్రావీణ్యత కలిగిన విద్యార్థులకే నవోదయలో చోటు దక్కుతుంది. అలాంటి పాఠశాలలో ఫలితాలు బాగానే ఉన్నా క్రమశిక్షణ విషయంలో పాఠశాలపై ఆరోపణలు వస్తుండటంతో తల్లిదండ్రుల్లో ఆవేదన కలిగిస్తోంది. గతంలో జరిగిన గొడవల్లో తల్లిదండ్రులు విద్యార్థులను చదువు మాన్పించి ఇంటికి తీసుకెళ్లేందుకు సిద్ధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో సఖ్యత లేకపోవడం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. 

ఉపాధ్యాయులను 


బెదిరిస్తున్న విద్యార్థులు..

బిహార్‌ వాళ్లు మైగ్రేటెడ్‌ విద్యార్థులు కనుక వాళ్లతో సఖ్యతగా ఉండాలని ఉపాధ్యాయులు ముందుగానే తెలుగు విద్యార్థులకు సూచనలు చేస్తారు. తెలుగు విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన విధంగా నడుచుకున్నా బిహార్‌ విద్యార్థులు తెలుగు విద్యార్థులను లెక్కచేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గత 15 సంవత్సరాల్లో ఎప్పుడు గొడవ జరిగినా బిహార్‌ విద్యార్థుల వల్ల జరిగిందే. ఒక్కసారి కూడా తెలుగు విద్యార్థులు కారణం కాలేదు. నవోదయ విద్యాలయ సమితికి జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా ఉంటడంతో బిహార్‌ విద్యార్థులు ఉపాధ్యాయులను, విద్యార్థులను, ప్రిన్స్‌పాల్‌ను కలెక్టర్‌కు కంప్లెయింట్‌ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు వాపోతున్నారు. 


ప్రతి విద్యార్థి దగ్గర సెల్‌ఫోన్‌..

బిహార్‌కు చెందిన విద్యార్థులందరూ విద్యాలయలో సెల్‌ఫోన్లు వాడుతున్నట్లు తెలుస్తోంది. తరగతుల్లో, హాస్టల్‌ గదుల్లో ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నా నివారించలేక పోతున్నారు. సెల్‌ఫోన్లు వాడొద్దని చెపితే ఉపాధ్యాయులపై గొడవకు దిగుతున్నారని వాపోతున్నారు. ఏదైనా అడిగితే వారే గొడవకు దిగి మళ్లీ వారే రక్షణ లేదంటూ రోడ్డున పడుతున్నారు. ఇదంతా బయటకు తెలిస్తే విద్యాలయం ప్రతిష్ట దెబ్బతింటుందని ఉపాధ్యాయులు, ప్రిన్స్‌పాల్‌ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. రెండు సంవత్సరాల కిందట కూడా ఇదే తరహాలో విద్యార్థులు నాలుగు రోజులు తీవ్రగందరగోళం సృష్టించారు. ఇకనైనా నవోదయ విద్యాలయ సమితి ఉన్నతాధికారులు కలుగజేసుకుని గతంలో జరిగిన గొడవలు వాటికి కారణాలు, పూర్తిగా అధ్యయనం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ప్రతిభ గల విద్యార్థులు నష్టపోకతప్పదు. నవోదయ విద్యాలయంలో తమ పిల్లలను చేర్పించాలంటే తల్లిదండ్రులు బయపడే పరిస్థితి వస్తుంది. 


logo