సోమవారం 06 ఏప్రిల్ 2020
Khammam - Feb 05, 2020 , 01:14:51

దారులన్నీ మేడారం వైపే..

దారులన్నీ మేడారం వైపే..

ఖమ్మం నమస్తేతెలంగాణ/ఖమ్మం క్రైం : ఇళ్లలో పండుగ జేసుకుండ్రు... నిలువెత్తు బంగారాన్ని బరువనకుండా నెత్తిన పెట్టుకుని... చంటి బిడ్డలను చంకనెత్తుకుని... చేతిలో సంచితో... వనదేవతల చెంతకు భక్తజనం మేడారానికి బైలెల్లింది... అద్దె బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు, లారీలు, ఆటోల్లో వేలాదిమంది తల్లుల దర్శనానికి పయనమయ్యారు. దీంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.  జాతర ప్రధాన ఘట్టం నేటి నుంచి మూడు రోజులు జరుగుతుండగా రద్దీకి అనుగుణంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 345 బస్సులు ఏర్పాటు చేసింది. 


ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 345 బస్సులు...

దేశంలోనే రెండవ అతిపెద్ద జాతరగా పేరు గడించిన మేడారం జాతరకు జిల్లా ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులను కేటాయించింది. జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, మధిర, భద్రాచలం, సత్తుపల్లి, మణుగూరు డిపోల నుంచి 345 బస్సులను మేడారం జాతరకు నడపుతున్నారు. వాటిల్లో 215 బస్సులు జిల్లాకు చెందినవి కాగా, మిగతా 130 బస్సులను హైదరాబాద్‌ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. కాగా మొదట్నుంచీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని అధికారులు ప్రచారం చేయటంతో భక్తులు కూడా వీటినే ఎంచుకుని మేడారానికి తరలి వెల్లారు. ఇకపోతే కార్లు, లారీల్లో కూడా భక్తులు భారీ సంఖ్యలోనే సమ్మక్క, సారలమ్మల దర్శన భాగ్యం కోసం కదలిపోయారు. నిజం చెప్పాలంటే ప్రయివేటు ట్రావెల్‌ ఏజెన్సీల్లో అద్దెకార్లు ఒక్కటి కూడా ఖాళీగా లేదంటే ఆశ్చర్యం వేయక మానదు. ఒక్క ఖమ్మం నగరం నుంచే దాదాపు 150 అద్దెకార్లతో పాటు మరో 200 స్వంతకార్లున్న వారు మేడారం జాతరకు పయనంకట్టారు. జీపులు, లారీలు, ఆటోలు కూడా వందల సంఖ్యలోనే సమ్మక్క, సారలమ్మల యాత్రకు బయలుదేరి వెళ్లాయి.


ఉమ్మడి జిల్లాలో  మినీ మేడారం జాతరలు...

మేడారం జాతర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న మినీ మేడారంగా పిలవబడే సమక్క-సారలమ్మ గద్దెల వద్ద జాతర కోలాహలం ప్రారంభమైంది. ఇప్పటికే ఆయా గద్దెల నిర్వాహకులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగరంలోని వెంకటేశ్వరనగర్‌ ప్రాంతంలో ఉన్న సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద బుధవారం  పండుగ జరుగనుంది. అదే విధంగా ఇల్లెందు, కొత్తగూడెం రహదారి మధ్యలో ఉన్న మినీ మేడారంగా పేరొందిన సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద జాతర ప్రారంభమైంది. వీటితో పాటు జూలూరుపాడు, వేంసూరు, ఏన్కూర్‌, తల్లాడ, పినపాక, టేకులపల్లి తదితర మండలాల్లో ఉన్న తల్లుల గద్దెల దగ్గరకు భక్తులు పోటెత్తుతున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ముందుగా తమ పొలిమెరల్లో ఉన్న అమ్మవార్లను కొలుచుకుని ఒడిబాల బియ్యంతో బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. 


తల్లులకు మొక్కులు..

సమ్మక్క సారక్క తల్లులకు మొక్కలు చెల్లించుకనేందుకు భక్తులు తమ వెంట బంగారం (బెల్లం), గొర్రెపోతులు, మేకపోతులను వెంట తీసుకెళ్తున్నారు. అదే విధంగా సంతానం కోరిక తీరిన మరికొందరు భక్తులు తలనీలాలను సమర్పించేందుకు బయలుదేరుతున్నారు. ఆనవాయితిగా కుటుంబ మొక్కులను చెల్లించుకునేందుకు గాను మరికొందరు భక్తులు ఒడిబాల బియ్యం పోసుకుని తల్లులకు సమర్పించేందుకు సిద్ధం అవుతున్నారు.  


అధికారుల ప్రత్యేక ఏర్పాట్లు..

ఈ మహాజాతరకు రెండు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున మేడారం ట్రస్ట్‌ బోర్డు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఖమ్మం, కొత్తగూడెం నుంచి వెళ్లే వాహనాలను ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, కొండాయ్‌, ఊరట్టం మీదుగా మేడారం చేరుకుని తిరుగు ప్రయాణంలో ఇదే దారిలో వెళ్లే విధంగా రహదారిని సిద్ధం చేశారు. ఖమ్మం నుంచి మహబూబాబాద్‌, నర్సంపేట మీదుగా వెళ్లే వాహనాలను ములుగు, జంగాలపల్లి, పస్రా, నార్లాపూర్‌ మీదుగా మేడారానికి చేరుకుంటాయి. అయితే తిరుగుప్రయాణంలో మాత్రం నార్లాపూర్‌, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, కమలాపురం క్రాస్‌ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గూడెప్పాడు నుంచి  మల్లంపల్లికి చేరుకుని నర్సంపేటకు వచ్చే విధంగా రహదారి ప్రణాళికను సిద్ధం చేశారు. 


ఆర్టీసీకి ప్రత్యేక రూట్‌లు ఇలా... 

ఖమ్మం నుంచి వెళ్లే బస్సులు: ఇల్లెందుకు, కొత్తగూడెం బైపాస్‌, పాల్వంచ, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె

భద్రాచలం నుంచి :అశ్వాపురం, మణుగూరు, మంగాపేట, ఏటూరునాగారం,తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె

కొత్తగూడెం నుంచి :కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, మణుగూరు, మంగపేట,ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె

మణుగూరు నుంచి : మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయి, మేడారం, సమ్మక్క- సారక్క గద్దె


logo