బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Feb 03, 2020 , 03:28:20

నేడే సహకార ఎన్నికల నోటిఫికేషన్‌...

నేడే సహకార ఎన్నికల నోటిఫికేషన్‌...

ఖమ్మం నమస్తే తెలంగాణ: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్దమైంది. మూడు రోజుల క్రితం ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల షెడ్యూల్డ్‌ను విడుదల చేసి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 76 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉన్న ఈ సొసైటీలకు అదనంగా మరో ఆరు సొసైటీలకు ప్రతిపాదనలు సిద్దం చేసినప్పటికీ షెడ్యూల్‌ కారారైనందున వాటిన రద్దు చేశారు. దీంతో గతంలో ఉన్న 76 సొసైటీలకే ఎన్నికలు జరగనున్నాయి. 

ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడంతో గ్రామాలలో ఎన్నికల వేడి మొదలైంది. వివిధ పార్టీల నాయకులు అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో విజయ దుంధుబి మోగిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీలో సొసైటీ తరఫున పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటికే అనేక మంది   ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీ ప్రజా ప్రతినిదుల చట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అంగ, ఆర్థిక బలం ఉన్న నాయకులు సొసైటీ చైర్మన్లుగా ఎన్నికై జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో చక్రం తిప్పేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్లు ఖరారుకానందున పోటీ చేయదల్చుకునే అభ్యర్థులు మీమాంసలో ఉన్నారు. షెడ్యూల్‌ విడుదలైన ప్రకారం నేటి ఉదయం 10 గంటలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. 

జిల్లాలో 76 సొసైటీలకు ఎన్నికలు...

జిల్లాలోని 76 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా తుదిఓటర్ల జాబితా వెల్లడి కాకపోయినప్పటికీ అధికారుల అంచనా మేరకు సుమారు 1 లక్షా 80 వేల మంది రైతులు ఓటు వేయనున్నారు. దీని కోసం సోమవారం సొసైటీలకు నియమించిన ఎన్నికల అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. దాని ప్రకారం ఈ నెల 6 వ తేదీ నుంచి 8 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 9న నామినేషన్‌ల స్క్రూట్నీ, 10న ఉపసంహరణ. మధ్యాహ్నం 3 గంటల తరువాత గుర్తులు కేటాయిస్తారు. 14వ తేదీ వరకు ప్రచారం. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌. మధ్యాహ్నాం 3 గంటల తరువాత కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 16వ తేదీన ఎన్నికైన డైరెక్టర్లు సొసైటీ చైర్మన్లు ఎన్నుకోనున్నారు. 

ప్రతి సొసైటీకి 13 మంది డైరెక్టర్లు...

జిల్లాలోని ప్రతి సొసైటీకి 13 మంది డైరెక్టర్లుంటారు. ఎస్సీ జనరల్‌-1, ఎస్సీ ఉమెన్‌-1, ఎస్టీ జనరల్‌-1, బీసీ జనరల్‌-2, ఓసీ జనరల్‌ -7, ఓసీ ఉమెన్‌-1 చొప్పున ఎన్నుకోవాల్సి ఉంటుంది. వీరితో పాటు మరో ఐదుగురును కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకుంటారు. వీరిలో ఇద్దరు మహిళలు, మైనార్టీ ఒక్కరూ, అధికారులు ఇద్దరిని రిజిస్టార్‌ నామినేట్‌ చేస్తారు. మొత్తం 18 మంది సోసైటీ పాలకవర్గ సభ్యులుగా ఉంటారు. 


టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆశావహుల యత్నాలు...

రాష్ట్రంలో గత డిసెంబర్‌ నుంచి కొనసాగుతున్న అనేక ఎన్నికల్లో అధికార గులాబీ పార్టీ విజయ ఢంకా మోగిస్తుంది. దీంతో సొసైటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీకి చెందిన రైతులు ముందుకు వస్తున్నారు. సీట్లను సంపాదించుకునేందుకు ఎమ్మెల్యేల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. ఏడాది కాలంగా రాష్ట్రంలో జరుగుతున్న  అన్ని ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయదుందుబి మోగిస్తుండటంతో సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవడం ఖాయం ఉంటుందని చాలా ఆశావహులు భావిస్తున్నారు. దీంతో పోటీ నిలిచేందుకు చాలా మంది ఊర్రుతలూగుతున్నారు. 

ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీకి నిరాసక్తి..

టీఆర్‌ఎస్‌ పార్టీకి వివిధ రకాల ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టుతుండటంతో ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. అధికార పార్టీలో ఆశావహులు సంఖ్య పెరుగుతుండగా ప్రతిపక్ష పార్టీల తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థుల కరువైయ్యారు. ఒక వేళ పోటీ చేసినా డబ్బులు వృథా చేసుకోవడం తప్ప గెలవడమనేది సాధ్యం కాదని నిర్థారించుకుంటున్నారు. గ్రామాల్లో తమకున్న బలాలను అంచనా వేస్తున్నారు. గతంలో గెలిచిన అభ్యర్థులు కూడా తిరిగి ఆయా పార్టీల తరఫున పోటీలు చేసేందుకు ముందుకు రావడం లేదు. తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు మాత్రం అన్ని సొసైటీలలో పోటీల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలన్ని ఎకైమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


logo