గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 03, 2020 , 03:25:46

గిరిపుత్రుల విద్యా వికాసం

గిరిపుత్రుల విద్యా వికాసం

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖలో 82 ఆశ్రమ పాఠశాలలు, 277 గిరిజన ప్రాథమిక పాఠశాలలు, 35 కళాశాలల వసతి గృహాలలో మొత్తం 394 విద్యా సంస్థల్లో 44,407 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లోని అనేక మండలాల్లో భద్రాచలం ఐటీడీఏ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2018-19 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో 75.80శాతం ఉత్తీర్ణత నమోదైంది. 28 వసతి గృహాలలో 83.52శాతం పరీక్షా ఫలితాలు వచ్చాయి. గురుకులాల్లో కూడా పరీక్షా ఫలితాలు మెరుగ్గా వచ్చాయి. గిరిజన విద్యార్థులకు ఆగ్లంపై పట్టు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సమ్మర్‌ సమిత్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కంప్యూటర్‌, స్పోకెన్‌ ఇంగ్లిషు, బేసిక్‌, స్కిల్స్‌ నేర్పించడం జరిగింది. కంప్యూటర్‌లో నైపుణ్యం పెంపొందించడం కోసం కంప్యూటర్‌, ప్రొజెక్టర్‌ కలిగిన 17 ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు కంప్యూటర్‌ ఉపాధ్యాయులను కూడా నియమించి బోధన ఇప్పిస్తున్నారు. కరాడపత్‌ కార్యక్రమంలో భాగంగా ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్‌ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. తద్వారా ఇంగ్లిషు మీడియం విద్యాబోధనపై ప్రత్యేక అవగాహన కల్పించారు. 507 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. డిజిటల్‌ క్లాస్‌ల ద్వారా విద్యాబోధన చేయూటకు ఈ స్కూల్స్‌ ద్వారా 7 ఆశ్రమ పాఠశాలలను ఎంపిక చేసి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా నవంబర్‌ నెలలో భద్రాచలంలో గిరి బాలోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ బాలోత్సవం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించుటకు గాను యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమాలు తరచు నిర్వహించడం జరుగుతోంది. ఆర్థిక స్తోమత లేని గిరిజన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యను అందించుటకు గాను ఆర్థిక సహాయం కొరకు అంబేద్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బానోతు రాకేష్‌కు యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడమ్‌, యూనైటెడ్‌ స్టేట్స్‌లో విద్యనభ్యసించుటకు రూ.20లక్షలు చెల్లించడం జరిగింది. విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు, వివిధ పోటీల్లో పాల్గొనే వారికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించడం జరిగింది. పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ శిక్షణ 300ల మందికి ఇవ్వడం జరిగింది. ఇందులో అనేక మంది విద్యార్థులు, అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు.  గిరిజన సంక్షేమ గురుకులాల అభివృద్ధికి ఐటీడీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంది. 28 గురుకుల విద్యాలయాల్లో 7986 మంది గిరిజన, గిరిజనేతర  విద్యార్థులు చదువుకుంటున్నారు. 10వ తరగతిలో 84శాతం, ఇంటర్‌లో 78శాతం గతేడాది ఫలితాలు వచ్చాయి. ఎస్‌ఓఈ ఖమ్మంలో పదవ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా ఒక విద్యార్థికి 10/10 జీపీఏ మార్కులు వచ్చాయి. తెలంగాణ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మణుగూరు డిగ్రీ కళాశాల ప్రథమ స్థానంలో పరీక్షా ఫలితాల్లో నిలిచింది.  

విద్యార్థులకు పౌష్టికాహారం అందజేత...

గిరిజన విద్యార్థులకు ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌, గురుకులాల్లో అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. విద్యార్థులకు అవసరమయ్యే నోట్‌ పుస్తకాలు, యూనిఫామ్స్‌, కార్పెట్లు, బెడ్‌షీట్లు, స్కూల్‌ బ్యాగ్స్‌, షూ, డైరీస్‌, ఐడీ కార్డ్స్‌, టై సరఫరా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించారు. భోజన వసతి కూడా కల్పించారు. చక్కటి రుచికరమైన మెనూ కూడా ఐటీడీఏ విద్యాసంస్థల్లో అమలవుతోంది. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ, వసతి గృహాలు, గురుకులాల్లో మెనూ అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.  ప్రతీరోజు పాలల్లో బూస్ట్‌, బ్రేక్‌ పాస్ట్‌లో పూరి, ఆదివారం చపాతీ, శుక్రవారం ఇడ్లీతో పాటు భోజనంలో నెయ్యి, నెలలో రెండో ఆదివారం, నాల్గవ ఆదివారం, రెండో బుధవారం, నాల్గవ బుధవారం చికెన్‌తో భోజనాలు, నెలకు నాలుగు సార్లుచికెన్‌, అదేవిధంగా మొదటి ఆదివారం, మూడో ఆదివారం మటన్‌తో భోజనాలు పెడుతున్నారు. పల్లి పట్టీ నెలలో నాలుగు సార్లు అందజేస్తున్నారు. భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌ ఈ మెనూ అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు జరగడంలేదని గ్రహించిన పీవో స్వయంగా పరిశీలించి మెనూ అమలుకు గట్టి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలను పీవో తరచు తనిఖీలు చేపడుతూ ప్రత్యేక  చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పౌష్టికాహారాన్ని గిరిజన విద్యార్థులకు అందజేస్తున్నారు.

క్రీడల్లో రాణింపునకు ప్రత్యేక శిక్షణ.. ....గిరిజన విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించేందుకు ఐటీడీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంది. చదరంగంలో కూడా గిరిజన విద్యార్థులు రాణించేందుకు ఐటీడీఏ పీవో ప్రత్యేక దృష్టి పెట్టి శిక్షణ ఇప్పించారు. దసరా, ఇతర సెలవుల్లో చదరంగంలో కూడా ఐటీడీఏ ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించడం జరిగింది. గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి చెస్‌ పోటీలకు కూడా ఎంపిక కావడం విశేషం. మోడల్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ కిన్నెరసాని బాలుర, కాచనపల్లి బాలికలు, 10 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో క్రికెట్‌ కొరకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇటీవల భద్రాచలంలో జరిగిన అండర్‌14 నెహ్రూకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భద్రాచలం ఐటీడీఏ జట్టు విజేతగా నిలవడం గమనార్హం. క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఇంత వరకు ఎప్పుడూ పాల్గొనని ఐటీడీఏ జట్టు తొలిసారిగా పాల్గొని విజయం సాధించడం విశేషం. ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్‌ ఇందు కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. షెటిల్‌ బ్యాడ్మింటన్‌లో గిరిజన విద్యార్థినిలకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన క్రీడాల్లో పోటీల్లో ఐటీడీఏ విద్యార్థులు పాల్గొని అనేక బహుమతులు సాధించారు. భద్రాచలం ఐటీడీఏ పీవోగా వీపీ గౌతమ్‌ బాధ్యతలు చేపట్టాక ఐటీడీఏ అన్ని రంగాల్లో అభివృద్ధిపథంలో ముందుకు దూసుకపోతోంది. పీవో తరచు పర్యటనలు చేస్తూ గిరిజన విద్య ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో 2019-20 విద్యా సంవత్సరంలో 10, ఇంటర్‌ ఫలితాల్లో అనూహ్య విజయాలు లభించే అవకాశం ఉంది.


logo