సోమవారం 30 మార్చి 2020
Khammam - Feb 03, 2020 , 03:22:00

కేటీపీఎస్‌లో రెండో యూనిట్‌ మూసివేత

కేటీపీఎస్‌లో రెండో యూనిట్‌ మూసివేత

పాల్వంచ, ఫిబ్రవరి 2 : కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారంలోని ఏస్టేషన్‌లో గల రెండో యూనిట్‌ 60 మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్‌ ఉత్పతిని ఆదివారం శాశ్వతంగా నిలిపివేశారు. యూనిట్‌ను మధ్యాహ్నం 2.30 గంటలకు హ్యండ్‌ ట్రిప్‌ చేసి ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. యూనిట్‌లోని బాయిలర్‌తో పాటుగా కోల్‌ బంకర్లు తదితర లొకేషన్లలలో అనేక మరమ్మతులు చేయాల్సి ఉంది. కోట్ల రూపాలయల వ్యయంతో మరమ్మతులు చేయాల్సిన పరస్థితి. ఈ విషయాన్ని టీఎస్‌ జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు దృష్టికి ఇంజనీర్లు తీసుకువెళ్లారు. మరో రెండు నెలల వ్యవధిలో యూనిట్‌ను శాశ్వతంగా యూనిట్‌ను మూసివేయనున్నందున యూనిట్‌ మూసివేతకు నిర్ణయించుకున్నారు. సీఎండీ ఆదేశాల మేరకు యూనిట్‌ను శాశ్వతంగా మూసివేశారు. ఓఅండ్‌ఎం కర్మాగారంలో ఈ యూనిట్‌తో కలిపి నాలుగింటిని శాశ్వత మూసివేత జరిగింది. దీనిపై కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం ఇన్‌చార్జి సీఈ ఎం. శ్రీనివాసరావు నమస్తే సంప్రదించగా 2వ యూనిట్‌ను మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. 

త్వరలో మరో నాలుగు యూనిట్లు 

ఉమ్మడి రాష్ర్టానికి విద్యుత్‌ వెలుగులను అందించిన కేటీపీఎస్‌ ఓఅండ్‌ఎం కర్మాగారంలోని 8 యూనిట్లను పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆదేశాల మేరకు శాశ్వత మూసివేతకు గురికానుంది. 8 యూనిట్లను గత 2019 డిసెంబర్‌ 31వ తేదీ నాటికి శాశ్వతంగా మూసివేయాలని కేంద్ర పర్యావణ శాఖ ఆదేశించిన సంగతి తెల్సిందే. కేటీపీఎస్‌ ఏడో దశ కర్మాగారంలో 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో మరో మూడు నెలల పాటు ఓఅండ్‌ఎం కర్మాగారంలోని యూనిట్లలలో ఉత్పత్తి కొనసాగింపునకు పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది.  ఈ యూనిట్లు పాతవైనప్పటికీ కొత్త కర్మాగారాల కంటే ధీటుగా పూర్తిస్థాయిలో ఉత్పత్తిని చేపడుతున్నాయి. కాని ఈ యూనిట్లు ద్వారా అధిక కాలుష్యం వెలువడుతున్నందున వీటిని మూసివేయాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. 

దీంతో టీఎస్‌ జెన్కో యాజమాన్యం వారి ఆదేశాల మేరకు అంచెలంచెలుగా మూసివేతకు చర్యలు తీసుకున్నది. దీనిలో భాగంగా ముందుగా ఓఅండ్‌ఎంలోని 3వ యూనిట్‌ను రెండేళ్ల క్రితం శాశ్వతంగా మూసివేశారు. దీని తర్వాత బీ స్టేషన్‌లోని 6వ యూనిట్‌ను 14 నెలల క్రితం, అలాగే సీ స్టేషన్‌లోని 8వ యూనిట్‌ను సంవత్సరం క్రితం శాశ్వతంగా మూసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏ స్టేషన్‌లోని రెండో యూనిట్‌లో భారీ మరమ్మతుల దృష్ట్యా దీన్ని శాశ్వతంగా మూసివేశారు. దీంతో ఓఅండ్‌ఎంలోని 4 యూనిట్లు ప్రస్తుతం మూత పడగా మరో నాలుగు యూనిట్లు మరో రెండు నెలల్లో మూత పడనున్నాయి. 


logo