శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Feb 03, 2020 , 03:16:10

సత్తుపల్లి మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం..

సత్తుపల్లి మున్సిపాలిటీని ప్రక్షాళన చేస్తాం..

సత్తుపల్లి రూరల్‌, ఫిబ్రవరి 2: సత్తుపల్లి మున్సిపాలిటీలో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి ప్రక్షాళన చేసి ప్రతిఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం అయ్యగారిపేటలో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సత్తుపల్లి అభివృద్ధి తన బాధ్యత అని, ప్రతిఒక్కరినీ కలుపుకుని ముందుకు సాగుతూ పట్టణ ప్రజల అవసరాలను తీర్చేందుకే పాలకవర్గం పనిచేస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో సిటిజన్‌ చార్టు అమలుచేసి ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఇళ్ల అనుమతిపత్రాలను త్వరితగతిన ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దోమలబెడదను నివారించేందుకు మున్సిపాలిటీ, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పట్టణంలో ఉన్న అన్ని ఖాళీ స్థలాలను గుర్తించి అందులో పేరుకుపోయిన వ్యర్ధాలను త్వరితగతిన తొలగించి ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ప్రతి వార్డులో పారిశుధ్యాన్ని పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామని, గత ఏడాది దోమల విజృంభణ ద్వారా పెద్ద ఎత్తున విషజ్వరాల బారిన ప్రజలు పడ్డారని, ఇకమీదట అలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. బ్రాహ్మణ సంఘం నాయకులు అడిగిన విధంగా వారికి కమ్యూనిటీ హాల్‌ను నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, వార్డు కౌన్సిలర్లు దేవరపల్లి ప్రవీణ్‌కుమార్‌, అమరవరపు విజయనిర్మల, గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, మంత్రిప్రగడ సత్యనారాయణ, కొడిమెల అప్పారావు, నారపరాజు నాగేశ్వరరావు, వినోదరావు, పుల్లారావు, దొడ్డా శంకర్‌రావు, వీరపనేని బాబి తదితరులు పాల్గొన్నారు.


logo