గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Feb 01, 2020 , 23:53:00

పల్లెలు.. ప్రగతి మల్లెలు

పల్లెలు.. ప్రగతి మల్లెలు
  • నేటితో పంచాయతీలకు ఏడాది పూర్తి..
  • పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఖమ్మం, నమస్తే తెలంగాణ: పంచాయతీలకు పాలకవర్గాలు ఏర్పడి నేటితో ఏడాది పూర్తవుతుంది. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద కురిపిస్తుంది. పల్లెలు పచ్చగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెల అభివృద్ధికి కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు విడుతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి ద్వారా గ్రామాల స్వరూపం మారింది. పారిశుద్ధ్యం మెరుగుపడటంతో పాటు పచ్చదనం ఉట్టిపడేలా హరితహారాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, స్మశాన వాటికలను ఏర్పాటు చేయడం, సురక్షితమైన మంచినీటిని అందించే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌తో పాటు ఎంపీటీసీ, వార్డు సభ్యులను కూడా భాగస్వామ్యం చేయడం ద్వారా గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చేందుతాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు భాగస్వామ్యంతో గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులు అధికారులతో గుర్తింప చేసి పనులు చేపట్టారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం గ్రామాల్లో హరితహారంతో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు బలమైన పునాదులు వేశారు. 

పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి..
రాష్ట్ర ప్రభుత్వం పల్లెల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుంది. పాలకవర్గాలు స్థానికంగా గుర్తించిన పనులకు నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు కోసం మిషన్‌ భగీరథ పనులు, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలు, నియోజకవర్గాల అభివృద్ధి వంటి నిధులు కేటాయిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెల ఎస్‌ఎఫ్‌సీ ద్వారా రూ.16.50 కోట్లు ఆయా గ్రామ పంచాయతీ ఖాతాలకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు ఈ నిధులు తోడు కావడంతో పల్లెలో అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. గ్రామాలలో పారిశుధ్యం, తెలంగాణకు హరిత హారం కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించేందకు ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌...

 జిల్లాలో ఇప్పటికే 281 పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. మరో 203 పంచాయతీలు కొనుగోలు చేసేందుకు బ్యాంకు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 584 పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, 14 ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ , పీఎంఏజీవై(ఎసీఎస్‌పీ) వంటి పథకాలతో పాటు సర్పంచ్‌లకు గౌరవ వేతనాలు, పంచాయతీల సాధారణ నిధులు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో పంచాయతీల అభివృద్ధికి గత నెల నవంబర్‌ వరకు నిధుల విడుదల వివరాలు ఇలా ఉన్నాయి.

పీఎంఏజీవై(ఎస్‌సీఎస్‌పీ) ద్వారా ఇప్పటి వరకు రూ.2.80లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. 
14వ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా ఇప్పటి వరకు జిల్లాలకు 5 దశలలో రూ.488,018600 నిధులను  జిల్లాలో గ్రామ పంచాయతీలకు విడుదలయ్యాయి. 
స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషణ్‌ ద్వారా పంచాయతీ ఎన్నికల తరువాత నూతన పాలకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయడంతో ఏప్రియల్‌-19 నుంచి మూడు దశలలో రూ.386149300లను అభివృద్ధికి విడుదల చేశారు. సర్పంచ్‌లకు గౌరవ వేతనం కోసం గత అక్టోబర్‌ నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీనికి ఇప్పటి వరకు రూ.26,045,000లను సర్పంచ్‌లకు చెల్లించారు. మొత్తంగా జిల్లాలో గత నవంబర్‌ వరకు రూ.874167 900లను ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేసింది.

ఏడాది పాలనలో పల్లెలో ప్రగతి కాంతులు

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత ఏర్పడిన పంచాయతీల పాలక వర్గాల పాలన నేటితో ఏడాది పూర్తైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా పల్లెలో ప్రగతి కాంతులు వీస్తున్నాయి. గ్రామాల్లో తప్పనిసరిగా డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠ ధామాలు, నర్సరీల పెంపం తప్పని సరి చేసింది. దీంతో జిల్లాలో ఏడాదిలో జరిగిన పాలనలో గ్రామాలు అభివృద్ధివైపు దూసుకపోతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 520 గ్రామ పంచాయతీలలో డంపింగ్‌ యార్డుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 584 గ్రామ పంచాయతీలలో వైకుంఠదామాల నిర్మాణ పనులు పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌, డీఆర్‌డీఏ డ్వామా ద్వారా చేపడుతున్నారు. ప్రతి గ్రామంలో నర్సరీల ద్వారా 113.64 లక్షల మొక్కల పెంపకానికి కసరత్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఏళ్లుగా పడావు పడిన సమస్యలను పరిష్కరించడంతో పాటు విద్యుత్తు సమస్యలు తీర్చడంలో పాలక వర్గాలు ఎంతో శ్రద్ధ వహించాయి. 


logo
>>>>>>