మంగళవారం 31 మార్చి 2020
Khammam - Feb 01, 2020 , 23:50:42

బాధ్యతల స్వీకరణ..

బాధ్యతల స్వీకరణ..
  • సత్తుపల్లి, ఇల్లెందు చైర్మన్లుగా మహేశ్‌, వెంకటేశ్వరరావు
  • అట్టహాసంగా జరిగిన కార్యక్రమం

ఇల్లెందు నమస్తే తెలంగాణ : ప్రజలు కోరుకున్న పాలన ఇద్దాం.. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిద్దాం.. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సుపరిపాలనకు శ్రీకారం చుడుదామని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియనాయక్‌ తనదైన శైలిలో ప్రసంగించారు. శనివారం నూతన పాలకవర్గం బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ ఆదర్శమైన పాలనను చూసి ప్రజలు మనకు ఈ అవకాశాన్ని ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ లాంటి జాతీయపార్టీలు మున్సిపల్‌ ఎన్నికల్లో మట్టికరిచాయంటే కేసీఆర్‌ పరిపాలనే అందుకు కారణమన్నారు. కౌన్సిలర్‌ అయ్యామనే ధీమా, దర్జా, దర్పం ఎక్కడా కనిపించకూడదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయడమే కౌన్సిలర్‌ విధి అన్నారు. పాలకవర్గం ప్రజలకు చేరువయ్యే విధంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పుడు బాధ్యతలు చేపడుతున్న పాలకవర్గం, చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లంతా కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలని వారికి ఎల్లప్పుడూ ఇల్లెందు ఎమ్మెల్యే అండగా ఉంటారని ప్రకటించారు. ఇల్లెందు ప్రజలకు మరోమారు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 


స్ఫూర్తిదాయక పాలనను అందిద్దాం మున్సిపల్‌ చైర్మన్‌ డీవీ 

స్ఫూర్తిదాయక పాలన అందిద్దామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డీవీ) పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కౌన్సిల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన పాలకవర్గం ఒక కుటుంబం లాంటిదని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవర్చేందుకు ప్రతీ ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. పారిశుధ్యం, నీటి సరఫరా, పట్టణ శుభ్రత తదితర వాటిలో పాలకవర్గం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. అవినీతి లేని పరిపాలనను అందించేందుకు కంకణ బద్దంగా పనిచేస్తామని ఎమ్మెల్యే హరిప్రియ సమక్షంలో ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, జిల్లా నాయకులు బానోత్‌ హరిసింగ్‌నాయక్‌, రాష్ట్ర రైతు సమన్వయ సమితి సలహాదారు పులిగళ్ల మాధవరావు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు సుధీర్‌తోత్లా, రంగనాథ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ విజయ, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 


logo
>>>>>>