బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Feb 01, 2020 , 23:48:55

విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం

విద్యుదాఘాతంతో భారీ అగ్ని ప్రమాదం

ఖమ్మం క్రైం : ఖమ్మం నగరంలోని శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతంలో ఉడ్‌ వర్క్‌షాపుల్లో శనివారం అర్థరాత్రి 2.30 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీనివాస్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న సామిల్‌ వెనుకభాగంలో ఉడ్‌ వర్క్‌ కాంప్లెక్స్‌లో 12 దుకాణాలు ఉన్నాయి.  రోజు లాగానే శుక్రవారం దుకాణాలు బంద్‌ చేసి వెళ్లారు. శనివారం అర్థరాత్రి 2.30 గంటలకు విద్యుదాఘాతంతో ఓ ఉడ్‌పై నిప్పురవ్వలు పడ్డాయి. దీంతో అక్కడున్న రంపం పొట్టు ద్వారా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో ఓ షాపు నుంచి దట్టమైన పొగలు వస్తున్న నేపథ్యంలో అక్కడున్న నైట్‌ వాచ్‌మెన్‌ ఆయా షాపుల యజమానులకు సమాచారమిచ్చాడు. దీంతో వారు అగ్నిమాపక శాఖాధికారులకు ఫోన్‌ చేసి వివరాలు తెలిపారు. ఆ కాంప్లెక్స్‌లో ఉన్న 9 షాపుల్లో మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకుని ఉదయం 6 గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆ షాపుల్లో టేకు, వేప, తుమ్మ సంబంధించిన గుమ్మాలు, కిటికి రెక్కలుండడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే గ్యాస్‌ ఏజెన్సీ ఉన్న కారణంగా అగ్నిమాపక అధికారులు చాకచక్యంగా మంటలను అదుపులోకి తీసుకురావడంతో బారీ ప్రమాదం తప్పింది. 


logo