మంగళవారం 31 మార్చి 2020
Khammam - Jan 31, 2020 , 05:09:03

గురువులపై పదింతల బాధ్యత..

 గురువులపై  పదింతల బాధ్యత..
  • పరీక్షలపై డివిజన్ల హెచ్‌ఎంలతో సమీక్ష
  • 5న న్యూవిజన్‌లో ఖమ్మం డివిజన్‌, లూర్ధుమాతలో మధిర డివిజన్‌కు

ఖమ్మం ఎడ్యుకేషన్‌ : జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో పదో తరగతి పాఠ్యాంశాలు బోధిస్తున్న ఉపాధ్యాయుల భవిష్యత్‌ విద్యార్థుల చేతిలో ఇమిడి ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్న తరుణంలో ఉపాధ్యాయులు కూడా అదే స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్దాలని అందుకు విద్యాశాఖాధికారులు ప్రణాళికలు రూపొందించాలని విద్యాశాఖ డైరెక్టరేట్‌ నుంచి ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో గురువులపై‘పది’ంతల బాధ్యత నెలకొంది. టెన్త్‌లో విద్యార్థులు ఫెయిలైతే ఏఏ సబ్జెక్ట్‌లో ఎక్కువ మంది ఫెయిలయ్యారో సంబంధిత ఉపాధ్యాయులపై ప్రభావం చూపనుంది. విద్యార్థుల ప్రగతి దృష్ట్యా నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టీచర్లు పాటుపడాల్సిన ఆవశ్యకతను వివరించేలా డివిజన్ల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఇటీవల రాసిన స్పెషల్‌ టెస్ట్‌లు 1,2 పరీక్షల ఆధారంగా వాటిల్లో వచ్చిన గ్రేడ్‌లను పరిగణలోకి తీసుకుని డీఈఓ  మదన్‌మోహన్‌ సమీక్షలో ప్రధానోపాధ్యాయులకు పలు సలహాలు చేయనున్నారు.


పూర్తి సౌకర్యాలున్నప్పటికి .... : పాఠశాలల ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలలకు ఉచిత పాఠ్యపుస్తకాలను సరఫరా చేశారు. గత రెండు సంవత్సరాల నుంచి సీసీఈ విధానంలోనే పరీక్షలు జరుగుతుండటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పూర్తి అవగాహన వచ్చింది. ప్రశ్నకు సమాధానం రాసే తీరు కంటే సీసీఈ విధానంలో పరీక్షలు రాయడం, భోధనలోనూ ఓత్తిడి లేని సులువైన పద్దతి. సులువైన విధానంలో విద్యార్థులు ఫెయిలైతే సంబంధిత సబ్జెక్ట్‌ ఉపాధ్యాయులను బాధ్యులుగా పేర్కొననున్నారు. ఖాళీగా ఉపాధ్యాయుల పోస్టులు లేకుండా సంబంధిత స్థానాల్లో గత సంవత్సరం నుంచి విద్యా వలంటీర్లను నియమించి వారి సేవలను వినియోగిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం కూడా వారి సేవలను కొనసాగిస్తూ అవనరమైన చోట్ల అదనపు నియామకాలు చేస్తూనే ఉన్నారు. 

స్పెషల్‌ టెస్ట్‌ల ఫలితాలపై సమీక్ష... : జనవరి2వ తేదీ నుంచి నిర్వహిస్తున్న స్పెషల్‌ టెస్ట్‌ల్లోని స్పెషల్‌ టెస్ట్‌లు 1,2 పరీక్షల ఫలితాలను భేరీజు వేసుకుని ప్రధానోపాధ్యాయుల సమీక్ష నిర్వహించనున్నారు. సిలబస్‌ ప్రకారం పూర్తి చేయాల్సిన యూనిట్లు, పూర్తి అయిన సిలబస్‌, సబ్జెక్ట్‌ల వారీగా విద్యార్థులకు వచ్చిన గ్రేడ్‌లతో సమీక్షకు రావాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఏ,బీ,సీ,డీ గ్రేడ్‌లు కేటాయిస్తారు. ఏ,బీ గ్రేడ్‌లు వచ్చిన విద్యార్థులు ఎలాగైనా ఉత్తీర్ణత సాధిస్తారు. సీ గ్రేడ్‌ విద్యార్థులు కొంత సాధన చేస్తే ఉత్తీర్ణులవుతారు. ఇక తంటా అంతా డీ గ్రేడ్‌ విద్యార్థులతోనే వారి తల్లిదండ్రుల సహకారంతో ప్రత్యేక శ్రద్ద తీసుకొని దృష్టి సారిస్తేనే ఫలితం ఉండనుంది.  


5వ తేదీన హెచ్‌ఎంల సమీక్ష... : ఖమ్మం డివిజన్‌ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు ఫిబ్రవరి 5వ తేదీన ఖమ్మంలోని న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాలలో ఉదయం10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు మధిర డివిజన్‌ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు తల్లాడలోని లూర్ధమాత పాఠశాలలో సమీక్ష నిర్వహించనున్నారు. స్పెషల్‌ టెస్ట్‌లకు సంబంధించిన ఫలితాలను ఫిబ్రవరి 3వ తేదీ వరకు మండల విద్యాధికారులకు అందజేయాలని సూచించారు. ప్రైవేట్‌ పాఠశాలలు మినహా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమీక్ష నిర్వహించనున్నారు. సమీక్షకు సంబంధించిన ఏర్పాట్లను డీసీఈబీ పర్యవేక్షించనుంది.


logo
>>>>>>