గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 31, 2020 , 05:00:26

మిర్చిపై ‘కరోనా’ కాటు..

మిర్చిపై ‘కరోనా’ కాటు..
  • చైనా, థాయ్‌లాండ్‌, ఇతర దేశాలకు నిలిచిన ఎగుమతులు
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
  • పొరుగు రాష్ర్టాలు, స్థానిక వ్యాపారులే కొనుగోళ్లు
  • రోజురోజుకూ తగ్గుతున్న తేజా మిర్చి ధర


ఖమ్మం వ్యవసాయం, జనవరి 30: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్‌ అన్ని వర్గాలపై ప్రభావం చూపెడుతున్నది. నిన్న, మొన్నటి వరకు ప్రాణాలను కబలించే ఈ వ్యాధి పట్ల యావత్తు ప్రజానీకం భయబ్రాంతులకు గురవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్‌ మన దేశంలో తయారయ్యే పంట ఉత్పత్తులపై పరోక్షంగా ప్రభావం చూపెడుతున్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా సాగయ్యే తేజ రకం మిర్చి పంటపై కరోనా ప్రభావం చూపెడుతున్నది. ఎందుకంటే ఈ పంట ఉత్పత్తుల ఎగుమతులు ఇతర దేశాలకు ఆగిపోవడంతో ధర పడిపోయింది. దీంతో తేజా మిర్చి సాగుచేసిన పాలిట శాపంగా మారింది.


ఇక్కడ పండిన పంటలో కేవలం 30 శాతం కారం పొడిని మాత్రమే వినియోగిస్తుండగా మిగిలిన 70 శాతం పంటను స్థానిక వ్యాపారులు విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఖమ్మం మార్కెట్‌కు కూతవేటు దూరంలో ఉన్న చైనా ఫ్యాక్టరీ యాజమాన్యం సైతం ఈ మిర్చి పంటను కొనుగోలు చేస్తున్నది. జిల్లాలో ఏటా దాదాపు 60వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల నుంచి సైతం రైతులు ఏటా ఖమ్మం మార్కెట్‌కు పంటను తీసుకొస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో తేజా రకం పంటకు  ఆదరణ ఉండటంతో వ్యాపారులు పోటీ పడి కొనుగోలు చేశారు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా శీతల గిడ్డంగుల్లో ఒక్క బస్తా లేకుండా రైతులు, వ్యాపారులు పంటను అమ్ముకున్నారు. అనంతరం నూతన పంట మార్కెట్‌కు వచ్చిన కొత్తలో సైతం అదే ధర కొనసాగింది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా మిర్చిపంటకు క్వింటాలుకు రూ.22 వేల వరకు పలకడం రైతులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే గత కొద్ది రోజుల క్రితం చైనా దేశంలో జరిగే అత్యంత గొప్ప పండుగను పురస్కరించుకుని అక్కడి వ్యాపారులు కొనుగోళ్లకు తాత్కాలిక బ్రేక్‌ విధించడంతో స్థానిక వ్యాపారులు అదే దోరణి కనపర్చారు. దీంతో అంచెలంచెలుగా ధరల తగ్గుదలకు ప్రధాన కారణమైంది. అయితే జాతీయస్థాయి వ్యాపారులు పంట నిల్వలేనందున ఇదే అదునుగా భావించి కొనుగోలు ప్రారంభించడంతో గత వారం నుంచి మార్కెట్‌లో కొనుగోళ్లు ఆశాజనకంగా జరిగాయి. 


కరోనా వైరస్‌ ప్రభావంతో..

ఇది ఇలా ఉండగా గడిచిన నాలుగు రోజుల నుంచి కరోనా వైరస్‌ ప్రభావంతో తిరిగి పూర్తిగా ఎగుమతులు ఆగిపోయాయని స్థానిక వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన సరుకులు చైనా, థాయిలాండ్‌, బ్యాంకాక్‌ తదితర దేశాలకు మిర్చి ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం ధరలపై చూపుతుందని పేర్కొన్నారు.  


ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు..

మూడు రోజుల నుంచి తేజా రకం పంటకు ధర తగ్గుతుండటం పట్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.  అందులో భాగంగానే గురువారం కూడా నగర వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళన చేశారు. ఉదయం జరిగిన జెండా పాటలో క్వింటా ఒక్కంటికి రూ.14 వేలు పెడుతున్నట్లు ఖరీదుదారులు నిర్ణయం చేయడంతో రైతులు ఒక్కసారిగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో మిర్చి యార్డులో ఒక్కసారిగా రైతుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిస్థితిని తెలుసుకున్న మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మిర్చి యార్డుకు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడారు. ధర తగ్గుదలకు దారి తీసిన కారణాలను వివరించారు. అనంతరం ఆయన తన చాంబర్‌లో రైతులు, వ్యాపారులతో వైస్‌ చైర్మన్‌ పిన్ని కోటేశ్వరరావు, డీఎంవో సంతోష్‌కుమార్‌తో కలిసి  ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం జెండా పాటను రూ.15 వేలకు పెంచాలని ఖరీదు దారులకు సూచించడంతో వారు సమ్మతించారు. అనంతరం  రూ.15 వేలు ధర నిర్ణయించి జెండా పాటకు అనుగుణంగా ఖరీదుదారులు కొనుగోళ్లు చేపట్టారు. మార్కెట్‌లో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకుగాను సీఐలు శ్రీధర్‌, వెంకన్నబాబు, గోపి, రమేష్‌లు పూర్తిస్థాయిలో బందోబస్తు చేపట్టారు. అనంతరం మిర్చియార్డులో క్రయవిక్రయాలు ప్రశాంతంగా జరిగాయి. 

 

మరింత తగ్గితే నిల్వచేసుకోవడమే మేలు.. 

మార్కెట్‌లో తేజారకం మిర్చికి మరింత ధరలు తగ్గినైట్లెతే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిల్వచేసుకోవడమే మేలని అధికారులు, అడ్తివ్యాపారులు రైతులకు సూచిస్తున్నారు. ఇక్కడ సాగు జరిగిన పంట ఎక్కువ మొత్తంలో చైనా, సమీప దేశాలకే ఎగుమతి అవుతున్నందున అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా ధరలు తగ్గుతున్నాయని వారు సూచిస్తున్నారు. ధరలలో నిలకడ రావాలంటే మరికొద్ది రోజులు  పట్టే అవకాశం ఉంది. అయితే అత్యవసర, అనివార్యం అయితే రైతులు పంటను అమ్ముకోవచ్చు అని, లేనిపక్షంలో జిల్లాలో ఉన్న శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


logo