బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 30, 2020 , 02:24:21

మేడారానికి ప్రత్యేక బస్సులు..

మేడారానికి ప్రత్యేక బస్సులు..

ఖమ్మం కమాన్‌బజార్‌, విలేకరి: మహాజాతరకు రంగం సిద్ధమైంది. ఆసియా ఖండంలోనే పెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సమ్మక్క సారలమ్మ గద్దెలను సందర్శించేందుకు వీలుగా భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కూడా ప్రణాళికను రూపొందించింది.  ఖమ్మం రీజియన్‌ నుంచి భక్తుల సౌకర్యార్థం కోసం ఫిబ్రవరి 2 నుంచి 9వరకు 345 ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, ఖమ్మం, ఏటూరునాగారం, వెంకటాపురం, వాజేడు, పేరూరు, చర్ల, టేకులపల్లి, మంగపేట మీదుగా బస్సులు మేడారానికి బయలుదేరనున్నాయి. ఇప్పటికే జాతర డ్యూటీకి వెళ్లే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణలను ఇచ్చారు. ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు పాయింట్ల వద్ద పాసింజర్‌ గైడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేడారం జాతరకు 690 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 100 మంది వలంటీర్లు విధులు నిర్వహించనున్నారు. 


తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరుగబోయే మేడారం జాతరకు ఆర్టీసీ అధికారులు ఖమ్మం రీజియన్‌ నుంచి ఫిబ్రవరి 2 నుంచి 13 పాయింట్ల నుంచి బస్సులను పూర్తి స్థాయిలో నడిపేందుకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే జాతరకు నడిచే ప్రత్యేక బస్సులకు  పూర్తి మరమ్మత్తులు నిర్వహించి ఫుల్‌ కండీషియన్‌లో ఉంచారు. బస్సులు బయలుదేరే పాయింట్ల వద్ద ప్యాసింజర్‌ గైడ్‌లను ఏర్పాటు చేశారు. బస్సుల ఎదుట సర్వీసు నెంబర్లు కన్పించే విధంగా చిన్న గోడపత్రికలను తయారు చేసి అద్దానికి అంటించి భక్తులకు ఎలాంటి అసౌకార్యాలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనంగా బస్సులను కేటాయించేందుకు నిర్ణయించుకున్నారు. జాతర డ్యూటీకి వెళ్లే డ్రైవర్లకు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణలు నిర్వహించి డీపో మేనేజర్లు, అసిస్టెంట్‌ డిపో మేనేజర్లు ఎప్పటికపుపడు పర్యవేక్షిస్తుంటారు.ఖమ్మం రీజియన్‌ నుంచి నడిపించే ప్రత్యేక బస్సులు అమ్మవారి గద్దె వరకు వెళ్లే విధంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఖమ్మం రీజియన్‌ నుంచి మేడారానికి 345 బస్సులను నడపాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఉమ్మడి ఖమ్మం రీజియన్‌ నుంచి 215 బస్సులతో పాటు అదనంగా 130 బస్సులను ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి భక్తుల రద్దీ దృష్ట్యా బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నారు.  


ఖమ్మం జిల్లా నుంచి మేడారం జాతరకు బస్సులు పాయింట్‌లను ఆర్టీసీ అధికారులు  ఏర్పాటు చేశారు. భద్రాచలం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఖమ్మం, ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ, టేకులపల్లి, మణుగూరు, ఏటూరునాగారం, మంగపేట, పేరూరు పాయింట్‌ల నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఈ పాయింట్‌లలో ప్యాసింజర్‌ గైడ్‌లను అందుబాటులో ఉంచారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఈ పాయింట్‌లలో టెంట్‌, తాగునీటి సౌకర్యం, ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల్లో ఆర్టీసీ వైద్యశాల, ప్రభుత్వ వైద్యశాల,  స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హెల్త్‌ క్యాంప్‌లు నిర్వహించనున్నారు. 110 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా మేడారంలో సేవలు అందించనున్నారు. వీరు భక్తులకు సూచనలు చేస్తూ బస్సులు ఎక్కించేందుకు తోడ్పాటును అందిస్తారు. ఖమ్మం రీజినల్‌ మేనేజర్‌ జాతర ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తారు. కొత్తగూడెం డీవీఎం కొత్తగూడెంలో ఉంటూ ట్రాఫిక్‌ రద్దీని, ఖమ్మం డీవీఎం ఇల్లెందు పాయింట్‌లో ఉంటూ, ఖమ్మం డిపో మేనేజర్‌ ఇల్లెందు పాయింట్‌, కొత్తగూడెం డిపో మేనేజర్‌ కొత్తగూడెం, సత్తుపల్లి డిపో మేనేజర్‌ వెంకటాపురం, ఏటూరునాగారం, భద్రాచలం డిపో మేనేజర్‌ భద్రాచలం, మణుగూరు డిపో మేనేజర్‌ మణుగూరు, మధిర డిపో మేనేజర్‌ మేడారం పాయింట్‌లలో ఉంటూ ట్రాఫిక్‌ క్లియర్‌ చేయనున్నారు. బస్సుల రద్దీని బట్టి వీరందరిని సమన్వయ పరుస్తూ రీజినల్‌ మేనేజర్‌ సూచనలు చేయనున్నారు. ప్రాంతీయ వైద్యాధికారి  మేడారం జాతరలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే డ్రైవర్లు, కండక్టర్లు, వాలంటీర్లకు వైద్య సూచనలు ఇస్తారు.


డిపో మేనేజర్ల సంరక్షణలో బస్సులు

ఆ రీజియన్‌కు చెందిన బస్సులు డిపోల వారిగా కేటాయించి జాతరలో ఆయా డిపో మేనేజర్ల సంరక్షణలో బస్సులు నడుపుతారు. ఈ మేడారం జాతరలో డ్రైవర్లకు, కండక్టర్లు, వాలంటీర్లకు గుడారాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ సంస్థ మేడారం జాతరలో విధులు నిర్వహిస్తున్న వారికి సబ్సిడీ ధరల్లో, భోజనాలు, టిఫిన్లు, చాయ్‌లు తదితర తినుబండారాలను అందించనున్నారు. ఈ జాతరకు వెళ్లే కార్మికులకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ట్రైనింగ్‌ ఇచ్చి గత మేడారం జాతర కంటే ఈ మేడారంలో ఉత్సాహంగా పనిచేయాలంటూ సూచనలు, సమావేశాలు, అవగాహన సదస్సులో నిర్వహిస్తున్నారు.  


logo