ఆదివారం 29 మార్చి 2020
Khammam - Jan 30, 2020 , 02:20:37

రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి కృషి చేస్తా

రామదాసు ధ్యాన మందిరం  అభివృద్ధికి కృషి చేస్తా
  • 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కందాల
  • ఘనంగా ప్రారంభమైన రామదాసు

నేలకొండపల్లి, జనవరి 29: ఎంతో చరిత్ర కలిగిన భక్త రామదాసు ధ్యాన మందిరం అభివృద్ధికి కృషి చేస్తానని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న రామదాసు జయంత్యుత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉత్సవాలను ప్రారంభించి ఆయన మాట్లాడుతూ.. ముందుగా మందిరం ఆవరణలో 12 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన రామదాసు కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే కందాల ఆవిష్కరించారు. విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి బస్వరాజు గోపిని సన్మానించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈసందర్భంగా సభలో ఎమ్మెలే కందాల మాట్లాడుతూ.. రామదాసు మందిరం అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ను కలిసి వివరిస్తానని అన్నారు.  పరమ భక్తాగ్రేసుడైన రామదాసు ఇక్కడి వ్యక్తి కావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. రామదాసు చరిత్రను భావితరాల వారికి అందించాలన్నారు. దేశమంతా గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. సీఎం సీపీఆర్‌వో జ్వాలా నరసింహరావు మాట్లాడుతూ.. రామదాసు కీర్తిని నలుదిశల ప్రకటించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో తిరువాయుర్‌లో జరిగే త్యాగరాజు ఉత్సవాల మాదిరిగానే రామదాసు ఉత్సవాలు జరుగుతాయన్నారు. భాషా సాంస్కృతిక రాష్ట్ర సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాతనే రామదాసుకు గుర్తింపు లభించిందన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ హన్మంతు కొడింబా మాట్లాడుతూ రామదాసు కీర్తనలను వినిపిస్తే మనసు తన్మయం చెందుతుందన్నారు. కంచర్ల గోపన్న మంచి వాగ్గేయకారుడని, మంచి భక్తుడన్నారు. అందరి సహకారంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్‌ చక్రవర్తి, డీఈవో మదన్‌మోహన్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ మరికంటి ధనలక్ష్మీ, ఎంపీపీ వజ్జా రమ్య, సర్పంచ్‌ రాయపూడి నవీన్‌, ఎంపీటీసీలు బొడ్డు బొందయ్య, దోసపాటి కల్పన, శీలం వెంకటలక్ష్మీ, ఎంపీడీవో రవికుమార్‌, తహసీల్దార్‌ స్వాతిబిందు, రామదాసు పదోతరం వంశస్తులు కంచర్ల శ్రీనివాసరావు, భక్త రామదాసు విద్వత్‌ కళాపీఠం అధ్యక్షుడు సాధు రాధాకృష్ణమూర్తి, పెండ్యాల గోపాలకృష్ణమూర్తి పాల్గొన్నారు. 


logo