సోమవారం 30 మార్చి 2020
Khammam - Jan 28, 2020 , 23:59:36

సంబురంగా సాగుతూ..

సంబురంగా సాగుతూ..

ఖమ్మం వ్యవసాయం, జనవరి 28: జిల్లాలో ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారుల అంచనాలకు మంచి యాసంగి సాగు జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతలు ఈ ఏడాది మక్క, వరిసాగుపై దృష్టి సారించారు. రైతులకు కావాల్సిన మేర ఎరువులు, విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. వీటికి తోడు జిల్లాలో సాగు నీటి వనరులు, 24గంటల విద్యుత్‌ అందుబాటులో ఉండటం సైతం సాగుకు కలిసివచ్చినైట్లెంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 68వేల హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు జరుగగా మరికొద్ది రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనపడుతుంది. 

ఖరీఫ్‌ సీజన్‌లో ఆశించిన మేర వర్షపాతం నమోదు కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీజన్‌ గడిచిపోయింది. సీజన్‌ ముగింపు దశలో సైతం వర్షాలు విస్తారంగా కురవడం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కావడంతో జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల్లో జలకళ ఉట్టిపడుతోంది. దీంతో యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నేటి వరకు జిల్లా వ్యాప్తంగా 68వేల హెక్టార్ల సాగు జరిగింది. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పాలేరు, వైరా, లంకసాగర్‌లలో సైతం పుష్కలంగా నీరు అందుబాటులో ఉంది. దీంతో రైతులు వానాకాలం పంటలు చేతికి రావడంతో ఆలస్యం చేయకుండా యాసంగి పనులు ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా విత్తనాలు పంపిణీ చేయగా, మార్క్‌ఫెడ్‌ సంస్థ ఎరువుల కొరత రాకుండా డీలర్లు, పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు అందజేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 24గంటల విద్యుత్‌ అందించడంతో సాగు విస్తీర్ణం పెరిగింది. అన్నదాతకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం సైతం సాగు పెరుగుదలకు ఓ కారణం. 

68వేల హెక్టార్లలో 

సాగు చేసిన పంటలు..

సాగర్‌ ఆయకట్టు ప్రాంతం చాలా ఏళ్ల తరువాత కళకళలాడుతోంది. గత కొద్ది రోజుల క్రితం వరకు నిరంతరంగా నీరు రావడంతో యాసంగి సాగును రైతులు నూతన ఉత్సాహంతో చేపట్టారు. జిల్లాలో దాదాపు 16 మండలాలు సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో ఉండటంతో నీటి కొరత తీరినైట్లెంది. ఈ సంవత్సరం జిల్లావ్యాప్తంగా సుమారు 51,769 హెక్టార్లలో వివిధ రకాల పంటల సాగు జరగవచ్చని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అందులో భాగంగానే ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 68,557 హెక్టార్లలో  సాగు జరిగింది. దీనిలో వరి సాధారణ సాగు 30,220 హెక్టార్లు కాగా, 41,314 హెక్టార్లలో సాగు జరిగింది. మరో ప్రధాన పంట ఐన మక్క సాధారణ సాగు 12,228 హెక్టార్లు కాగా, రికార్డు స్థాయిలో 24,461 హెక్టార్లకు చేరుకుంది. వీటితో పాటు అపరాలు 588 హెక్టార్లు, వేరుశనగ 640 హెక్టార్లు, మిర్చి 446 హెక్టార్లు, ఇతర పంటల సాగు మరో 319 హెక్టార్లలో జరిగింది. ఈనెల చివరి వరకు సాగు పనులు కొనసాగే అవకాశం ఉంది. 


logo