బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 28, 2020 , 00:10:02

పట్టాభిషేకం కొలువుదీరిన మున్సిపల్‌ పాలకవర్గాలు

పట్టాభిషేకం కొలువుదీరిన మున్సిపల్‌ పాలకవర్గాలు

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా 6వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచిన కాపు సీతాలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం ఉదయం 12.30గంటలకు మున్సిపల్‌ కార్యాలయంలో జరిగిన సభ్యుల ప్రమాణస్వీకారం, చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికలను నిర్వహించారు. కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్మన్‌ పదవికి, వైస్‌చైర్మన్‌ పదవికి ఒకరే నామినేషన్‌ వేశారని, నామినేషన్‌ వేసిన వారిని చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌గా భద్రాచలం సబ్‌ కలెక్టర్‌, ఎన్నిక ప్రత్యేకాధికారి భవేష్‌మిశ్రా ప్రకటించారు. చైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి పేరును ఆయన ప్రకటించగా 14వ, 27వ కౌన్సిలర్లు ఎంఎ.అఫ్జలున్నీషా బేగం, వేముల ప్రసాద్‌బాబు ప్రతిపాదించారు. అనంతరం సభ్యుల నుంచి ఆమోదం రావడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సబ్‌ కలెక్టర్‌ ప్రకటించారు. ఎన్నిక పూర్తయిన అనంతరం ఆమెను చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్లు తెలిపి సబ్‌ కలెక్టర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంగ్లిష్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2వ వార్డు కౌన్సిలర్‌ వేల్పుల దామోదర్‌ను మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఎన్నికల పరిశీలకుడు కిల్లు శివకుమార్‌ నాయుడు, మున్సిపల్‌ కమిషనర్‌ అరిగెల సంపత్‌కుమార్‌ పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లెందు మున్సిపల్‌ చైర్మన్‌గా 10వ వార్డు నుంచి గెలుపొందిన దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా గెలుపొందిన ఎస్‌డి.జానీలను వైస్‌ చైర్మన్‌గా ఎన్నికల ప్రత్యేకాధికారి, కొత్తగూడెం ఆర్డీఓ కనకం స్వర్ణలత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి  ఎక్స్‌ ఆఫిషియోసభ్యులుగా ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్‌ పాల్గొన్నారు. ఎన్నికల పరిశీలకుడు టి.కేశవానందకుమార్‌ ఎన్నికను పర్యవేక్షించారు. 

ప్రతి సభ్యుడిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి..

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కాపు సీతాలక్ష్మి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతీ కౌన్సిలర్‌ వద్దకు వెళ్లి కరచలనం చేసి అభివృద్ధికి సహకరించాలని కొత్తగూడెం పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని కోరారు. ఇందుకు స్వపక్ష, విపక్ష కౌన్సిలర్లందరూ  తొలుత ఆమెకు శుభాకాంక్షలు తెలిపి కలిసికట్టుగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు తాము సిద్ధమని తెలిపారు. అనంతరం వైస్‌ చైర్మన్‌గా వేల్పుల దామోదర్‌ ప్రమాణ స్వీకారం చేసి ప్రతీ ఒక్క కౌన్సిలర్‌ను కలుసుకోగా ఆయనకు తోటి కౌన్సిలర్లంతా శుభాకాంక్షలు తెలిపారు. 

కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించిన భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా..

ఉదయం 10.45గంటలకు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్లంతా ప్రైవేట్‌ బస్సులో కొత్తగూడెం మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతో ఆ బస్సులో కౌన్సిలర్లంతా కలిసి వచ్చారు. అనంతరం నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరానికి చేరుకున్నారు. అప్పటికే భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ భవేష్‌మిశ్రా, ఎన్నికల పరిశీలకుడు కిల్లు శివకుమార్‌ నాయుడులు హాల్లో సభ్యులతో ప్రమాణం చేయించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఉదయం 11 గంటలకు ఒక్కొక్కరిచే ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు కౌన్సిలర్లు హాల్‌కు చేరుకోవడంతో మున్సిపల్‌ సిబ్బంది ప్రమాణ స్వీకార ప్రతిజ్ఞ కాపీని వారికి అందజేశారు. ఒకటికి రెండుసార్లు చదువుకోవాలని సబ్‌ కలెక్టర్‌ కౌన్సిలర్లకు సూచించారు. తొలుత తెలుగులో వచ్చే అక్షరాల ఆధారంగా ప్రమాణ స్వీకారం చేయిస్తామని కౌన్సిలర్లకు ఆయన తెలిపారు. తొలుత మున్సిపల్‌ 26వ వార్డు టీఆర్‌ఎస్‌కు చెందిన అంబుల వేణుగోపాల్‌ను ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఒక్కొక్కరిగా ప్రమాణం చేయించారు. చివరగా 4వ వార్డుకు చెందిన సుజాత కేశంశెట్టి ప్రమాణం చేశారు. కొంతమంది కౌన్సిలర్లు వార్డు ప్రజలసాక్షిగా, మున్సిపల్‌ ప్రజల సాక్షిగా, తల్లిదండ్రుల సాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. సీపీఐకి చెందిన కౌన్సిలర్లు పార్టీ పేరును సైతం ఇందులో ఉచ్ఛరించారు. 


సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు..

కొత్తగూడెం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా కాపు సీతాలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా వేల్పుల దామోదర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు సంబురాలు చేసుకున్నారు. వారు ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్‌రావు, ఊకంటి గోపాలరావు, ఆళ్ల మురళీ, ఎం.ఎ.రజాక్‌, బండి రాజుగౌడ్‌, ఎస్‌కె.అన్వర్‌పాషా, తొగరు రాజశేఖర్‌, కాసుల వెంకట్‌, టీబీజీకేఎస్‌ నాయకుడు కాపు కృష్ణ, బత్తుల వీరయ్య, చుంచుపల్లి ఎంపీటీసీ కూసన వీరభద్రం తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వారి బంధుగణం, స్నేహితులు చేరుకోవడంతో మున్సిపల్‌ కార్యాలయ ఆవరణం, హెడ్డాఫీస్‌ ప్రధాన రోడ్డు అంతా కోలహలంగా మారింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బయటకు వచ్చిన కౌన్సిలర్లకు పూల దండలు వేసి శుభాకాంక్షలు తెలిపి, స్వీట్లను తినిపించారు. 

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు

చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఉదయం నుంచే పోలీసులు మున్సిపల్‌ కార్యాలయాన్ని తమ ఆధీనంలో తీసుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ సిబ్బంది, మీడియా పాసులు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొత్తగూడెం డీఎస్పీ ఎస్‌ఎం.ఆలీ ఆధ్వర్యంలో సీఐలు లావుడ్యా రాజు, బత్తుల సత్యనారాయణ, నాగరాజు, అశోక్‌, ఎస్సైలు జి.ప్రవీణ్‌కుమార్‌, రవీందర్‌, తదితరులు బందోబస్తులో పాల్గొన్నారు.


logo