గురువారం 02 ఏప్రిల్ 2020
Khammam - Jan 28, 2020 , 02:19:01

మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు

రఘునాథపాలెం, జనవరి27: మానవ తప్పిదం.. అవగాహనా లోపం.. నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్‌ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ పేర్కొన్నారు. జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరిగే 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం నగరంలోని ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో జరిగింది. దీనికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముందుగా ఆయన వారోత్సవాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను జిల్లా రవాణాశాఖాధికారి బీమిరెడ్డి కృష్ణారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం సీపీ మాట్లాడారు. గత ఏడాదిలో జరిగిన 820 రోడ్డు ప్రమాదాల్లో 280 మందికి పైగా మరణించారన్నారు. ఈ మరణాల్లో 88 మంది తలకు బలమైన గాయం తగలడం కారణంగానే ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. హెల్మెంట్‌ ధరించకపోవడం వల్ల 40శాతం మంది యువత రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నట్లు సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై ప్రయాణం చేసే వారు విధిగా సీట్‌బెల్డ్‌, హెల్మెంట్‌ ధరించాలన్నారు. ముఖ్యంగా ప్రమాదాల నివారణలో యువతపాత్ర ఎంతో కీలకమైందన్నారు. తమపైనే తమ కుటుంబం భవిశ్యత్తు ఆధారపడి ఉందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెంట్‌, కారు నడిపేటప్పుడు సీట్‌ బెల్ట్‌ ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు. ఈ వారం రోజుల పాటు రహదారి భద్రతపై కల్పిస్తున్న అవగాహనా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని, ప్రమాదాలు తగ్గుముఖం పట్టేలా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చునన్నారు. ప్రమాదాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చైతన్య పరిచేందుకు రహదారి భద్రతా వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు తగ్గిచేందుకు రవాణాశాఖ, పోలీస్‌ శాఖ కృషి చేస్తుందన్నారు. అనంతరం పలు ఆటోలకు సీపీ స్వయంగా వాల్‌ పోస్టర్లు అంటించారు. సభకు ముందుగా ప్రమాదాల నివారణపై కళాకారుల బృందం తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించారు. వారోత్సవాల సందర్భంగా కార్యాలయం ప్రాంగణం మొత్తం ప్రమాదాల నివారణపై ఏర్పాటు చేసిన బ్యానర్లు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి జిల్లా రవాణాశాఖాధికారి బీమిరెడ్డి కృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ కృష్ణమూర్తి, మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్‌ శంకర్‌ నాయక్‌, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్స్‌పెక్టర్లు కిషోర్‌బాబు, మనోహర్‌, ట్రాఫిక్‌ సీఐ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.  


logo
>>>>>>