శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 27, 2020 ,

అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న ప్రభుత్వం

అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్న ప్రభుత్వం

వైరా, నమస్తే తెలంగాణ:స్వాతంత్రోద్యమంలో పనిచేయడమే కాకుండా దేశానికి మహోన్నతమైన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్‌ బీఆర్‌.అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్‌ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ ఎగురవేశారు. అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి జనగనమన గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ఫలాలు అందరికి దక్కాలని బీఆర్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ కృషితో భారతదేశంలో రిజర్వేషన్లు అమలవుతున్నాయని వివరించారు. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ద్వారానే లభించిన రిజర్వేషన్‌తో తాను ఎమ్మెల్యేగా అయ్యానని స్పష్టం చేశారు. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం సమాజంలోని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాలకు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. ప్రధానంగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు. ఉ మ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్‌ కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరికీ సమన్యాయం చేస్తున్నారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలు, గిరిజనులు,దళితుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఏసీపీ కె.సత్యనారాయణ, వైరా సీఐ జట్టి వసంతకుమార్‌, వైరా ఎస్సై వి.సురేష్‌, వైరా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గుమ్మా రోశయ్య, వైరా ఎంపీపీ వేల్పుల పావని, టీఆర్‌ఎస్‌ నాయకులు బొర్రా రాజశేఖర్‌, మిట్టపల్లి నాగి, కట్టా కృష్ణార్జున్‌ రావు, వనమా విశ్వేశ్వరరావు, మోరంపూడి ప్రసాద్‌, దార్న రాజశే ఖర్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇన్‌చార్జి జయాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. logo