బుధవారం 08 ఏప్రిల్ 2020
Khammam - Jan 26, 2020 , 00:54:33

వార్‌ వన్‌సైడ్‌..

 వార్‌ వన్‌సైడ్‌..


మున్సిపల్‌  పీఠాలపై గులాబీ జెండా రెపరెపలాడింది.. శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ ప్రతిపక్షాలను చిత్తుగా ఓడించి మరోసారి సత్తా చాటింది.. కొన్నిపార్టీలకు డిపాజిట్లు కూడా రానీయకుండా ప్రభంజనం సృష్టించింది..ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర,కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో విజయదుందుభి మోగించింది..  జిల్లాలో మొత్తం 65 వార్డులకు 51 వార్డులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. మంత్రి అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేసి గెలుపునకు బాటలు వేశారు.. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆస్వాదిస్తున్న ప్రజలు మూకుమ్మడిగా టీఆర్‌ఎస్‌కు జై కొట్టారు.. ప్రతిపక్షాలను పాతాళానికి తొక్కారు.. సత్తుపల్లిలో క్లీన్‌స్వీప్‌ కావడంతో కాంగ్రెస్‌, టీడీపీలు కనుమరుగైపోయాయి.. వైరాలో 15వార్డుల్లో విజయ కేతనం ఎగురవేసింది. కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకునే మధిరలో ఆ పార్టీ మట్టికరిచిపోయింది.. మొత్తానికి ఉమ్మడి జిల్లాలో ఐదు పురపాలికలను గెలిపించి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కానుకగా అందజేయనున్నారు.. ఎన్నికల విజయంపై టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విజయోత్సవాలు నిర్వహించారు.. 
-ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పురపాలిక’ పోరులో టీఆర్‌ఎస్‌ పార్టీ సత్తా చాటింది. ఎవరూ ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో భారీ మెజార్టీతో మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో నిర్వహించచిన మున్సిపల్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ఎన్నికల బాధ్యతలను స్థానిక ఎమ్మెల్యేల భుజస్కందాలపై పెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు పనిచేసి విజయ కానుకను కేసీఆర్‌కు అందించారు. సత్తుపల్లిలో గతంలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఉన్న సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఒక్క సీటు కూడా ప్రతిపక్షం సత్తుపల్లిలో గెలవలేక బోర్లపడింది. మొదటి సారిగా సత్తుపల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురవేయడంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య క్రీయాశీలకంగా పనిచేశారు. ఇల్లెందు మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ పార్టీని దిక్కరించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ మడత వెంకన్నగౌడ్‌ దంపతుల్లో ఆయన సతీమణి మడత రమా మాత్రమే గెలవగలిగింది. ‘స్వతంత్ర అభ్యర్థులతో ఇల్లెందు మున్సిపాలిటీని కైవసం చేసుకుంటా’ అని భీరలు పోయిన మడత వెంకన్నగౌడ్‌ ఓటమి చెందారు. ఇల్లెందు మున్సిపల్‌ పరిశీలకుడిగా వచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు నేతృత్వంలో స్థానిక ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌, పట్టణ నేతలు సమన్వయంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపునకు ప్రధాన భూమిక పోషించారు. ఇల్లెందు మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డులుండగా టీఆర్‌ఎస్‌ పార్టీ-19, సీపీఐ-1, సీపీఐ(ఎంఎల్‌)-1, స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురు గెలుపొందారు.

కొత్తగూడెం మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నేతృత్వంలో మొత్తం 36 వార్డులకు టీఆర్‌ఎస్‌ పార్టీ-25, సీపీఐ-8, కాంగ్రెస్‌-1, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. కొత్తగా ఏర్పడిన వైరా మున్సిపాలిటీలో స్థానిక ఎమ్మెల్యే రాములునాయక్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 20 వార్డులకు టీఆర్‌ఎస్‌ పార్టీ-15, కాంగ్రెస్‌-2, సీపీఎం-1, స్వతంత్రులు -2 స్థానాలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటగా ఉన్న  మధిర మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ జెండా ఎగిరింది. గతంలో సీఎల్‌పీ నేతగా పనిచేసిన భట్టి విక్రమార్క కోట భీటలు వారింది. ఎక్కడా లేని విధంగా మహా కూటమి పేరుతో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీచేశాయి. జడ్పీచైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ నేతృత్వంలో మహా కూటమిని ముక్కలు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ మధిర మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేసింది. మొత్తం 22 స్థానాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ-13, కాంగ్రెస్‌-4, టీడీపీ-3, సీపీఎం-1, స్వతంత్ర-1 విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో అన్ని మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఇన్ని రోజులు ప్రభుత్వంపై విమర్శలు చేసి విర్రవీగిన ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతైంది. మహాకూటమి పేరుతో ప్రజల ముందుకు వచ్చిన విపక్షాలను ప్రజలు తరిమికొట్టారు. ఉమ్మడి జిల్లాలో బీజేపీ పార్టీ కనీసం ఒక్క వార్డులో సైతం బోణి కొట్టలేకపోయింది. ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ కేవలం 7 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.logo