శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Khammam - Jan 26, 2020 , 00:54:33

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం

ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే విజయం

ఖమ్మం ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ఎన్నిక ఏదైనా సరే.. గెలుపు మాత్రం గులాబీదే అవుతున్నది. 2014 రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల నాటి నుంచి నేటి వరకు రెండు పర్యాయాలు టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. పంచాయతీ, స్థానిక సంస్థలు, పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి దన్నుగా నిలిచారు. మొదటి విడతలో అందించిన అద్భుతమైన ప్రజాపాలన ఫలితాలను మరింత పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ప్రజలు అందించారు. విజయ శేఖరుడై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నలుదిశల తన అభివృద్ధి ఫలాలను ప్రజలకు పంచిపెడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కడుతూ ప్రతిపక్షాలను  పాతాళానికి నెట్టివేశారు.

టీఆర్‌ఎస్‌దే విజయం....

 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌  వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తుంది. ఎంపీ, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లు కారుగుర్తుపై ఓటు వేసి అభివృద్ధి వైపు కారు వేగాన్ని పెంచారు. తాజాగా జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా అదే ఒరవడి జిల్లాలో కొనసాగింది. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలు సత్తుపల్లి, వైరా, మధిరలలో  టీఆర్‌ఎస్‌ విజయం సాధించి ఆయా పురపాలకాలపై గులాబీ జెండాను ఎగరవేసింది. మూడు మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను సాధించి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంది. మున్సిపల్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక లాంఛనమే కానుంది. ఎన్నిక ఏదైనా సరే టీఆర్‌ఎస్‌దే గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా కొనసాగుతుంది.  2014 నుంచి జరుగుతున్న ఎన్నికలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అప్పుడు, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీయే విజయకేతనం ఎగురవేసింది. ఎన్నిక.. ఎన్నికకు పార్టీ మరింత బలపడుతూ వస్తుంది. పార్టీ సంస్థాగత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలను నమోదు చేసుకొని భారతదేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ రాజకీయ పార్టీగా అవతరించింది. 2001 సంవత్సరంలో అతికొద్ది మందితో పురుడోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అంచెలంచెలుగా విస్తరిస్తూ అనతి కాలంలోనే జాతీయ, ఇతర  ప్రాంతీయ పార్టీలకు దీటుగా ఎదిగింది.

ఖమ్మం ఖిల్లాలో ప్రతిపక్షాలు ఖల్లాస్‌...

ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ దెబ్బకు ప్రతి పక్ష పార్టీలు కల్లాస్‌ అయ్యాయి. జిల్లాలో జరిగిన  గ్రామపంచాయతీ, స్థానిక సంస్థలు (జడ్పీటీసీ, ఎంపీటీసీ), మున్సిపల్‌ ఎన్నికల్లో  ప్రతి పక్షాలు ఉనికి కోసం పోటీచేశాయే తప్పా టీఆర్‌ఎస్‌ హవాలో కనుచూపు మేరలో లేకుండా పోయాయి. ప్రతి ఎన్నికల్లోనూ సిద్ధ్దాంతాలను గాలికి వదిలి కూటమిగా జతకట్టిన ప్రతిపక్ష పార్టీలు కారుదెబ్బకు తమ ఉనికిని కోల్పోయాయి.  గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 584 గ్రామపంచాయతీల్లో  80 శాతం పంచాయతీలను టీఆర్‌ఎస్‌ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలైన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తిరుగులేని విజయానందుకుంది. ఈ ఎన్నికల్లో 20 ఎంపీపీ స్థానాల్లో 18 ఎంపీపీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకుంది. 20 జడ్పీటీసీ స్థానాలకుగాను 17 జడ్పీస్థానాలల్లో విజయఢంకాను మోగించి ఖమ్మం జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను రెపరెపలాడించాయి. ప్రస్తుతం జరిగిన మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలు నామ మాత్రపు సీట్లకే  పరిమితమయ్యాయి.

బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోగా డిపాజిట్‌ కూడా దక్కలేదు. కేంద్రంలో అధికారంలో ఉండి రాబోయే రోజుల్లో తమదే అధికారమని భాజాలు మోగించిన భారతీయ జనతా పార్టీ కనీసం జిల్లాలో బోణీ కూడా కొట్టలేదు. భారత కమ్యూనిటీ పార్టీ (సీపీఐ) కూడా ఒక్కస్థానం గెలుచుకోలేకపోయింది. సీపీఎం పార్టీ మధిర,  వైరా నియోజకవర్గాల్లో గట్టి పోటీనే ఇస్తామని మాటలు చెప్పినప్పటికీ కారు స్పీడును అందుకోలేకపోయింది. జిల్లాలో  కారు వేగానికి రెండు జాతీయ పార్టీలు దాదాపుగా  కనుమరుగైనట్లుగానే చెప్పవచ్చు. ఇతర  వామపక్ష పార్టీలు ప్రజల్లో తమ చిరునామాను నిలబెట్టుకోలేకపోయాయి. మధిరలో సీపీఎం-1, కాంగ్రెస్‌ -4, టీడీపీ -3, వైరాలో సీపీఎం-1, కాంగ్రెస్‌-2 స్థానాలు గెలుచుకుని చావుతప్పి కన్నులోట్టపోయినట్లుగా ఉంది. ఇక సత్తుపల్లి మున్సిపాలిటీలో ఏ ఒక్క పార్టీ కూడా ఖాతా తెరవలేదు.  దీంతో జిల్లాలో  ప్రతిపక్షాల అడ్రస్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో గల్లంతైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహం  

మున్సిపల్‌ ఎన్నికల్లో జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోవడంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  పువ్వాడ అజయ్‌కుమార్‌ నేతృత్వంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,  ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్‌, ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నూకల నరేశ్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు గెలుపునకు పకడ్బందీ వ్యూహ రచన చేశారు. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇచ్చారు. 

చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక లాంఛనమే...

జిల్లాలోని  సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్‌ పార్టీ కైవసం చేసుకోవడంతో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక లాంఛనమే అయింది. ఈ నెల 27వ తేదీన ప్రమాణ స్వీకారం జరగనున్నందున మున్సిపల్‌ కమిషనర్లు ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని పాలక మండలి సమావేశంలో కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించి అనంతరం చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. రెండు మున్సిపాలిటీల్లోనూ మెజార్టీ స్థానాలు టీఆర్‌ఎస్‌కు రావడంతో పార్టీ అధిష్టానం సూచించిన అభ్యర్థులకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు దక్కనున్నాయి.


logo